యువతకు భరోసానివ్వకపోతే భవిష్యత్ అంధకారమే
‘యువతరం శిరమెత్తితే.. నవతరం గళమెత్తితే... లోకమే మారిపో దా!... చీకటే మాసిపోదా...’ అంటూ ఎన్నో ఆశలతో ప్రగతిశీల శక్తులు యువతరం వైపు చూస్తున్న సందర్భం ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అనేక సమస్యలతోపాటు యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఉపా ధి లేమి సమస్యలు పరిష్కరించబడతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు భాగాన నిలిచింది. ఎంతో మంది యువకులు ప్రాణాలర్పించారు కూడా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన కేసీఆర్, తనే ముఖ్యమంత్రి అయి 9 నెలలు గడిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల యువతకు జరిగే ప్రయోజనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు ముఖ్య మంత్రి కేసీఆర్ తద్భిన్నమైన ముఖచిత్రం చూపిస్తున్న, ఆవిష్కరిస్తున్న పరిస్థితి నేటిది. మరోవైపు చాయ్వాలాగా ప్రచార పటాటోపం ప్రారం భించి ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మోదీ భారతదేశాన్ని టోకుగా విదేశీ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న సందర్భం ఇది. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) తన రాష్ట్ర తొలి మహాసభలను ఖమ్మంలో జరుపుకోబోతున్నది.
యువతకు భరోసా ఇవ్వని ప్రభుత్వ విధానాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న యువజన విధానాలు, స్వయం ఉపాధి పథకాలు యువతకు ఏ భరోసా ఇవ్వలేకపోతున్నాయి. గత ప్రభుత్వాలు ప్రకటించిన యువశక్తి గానీ, రాజీవ్ యువకిరణాలు గానీ, నేటి ప్రభుత్వాల మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ గానీ యువ తకు ఉపాధి కల్పించటంలేదు. 2004-2014 మధ్య కాలంలో కేవలం భవన నిర్మాణ రంగంలో తప్ప ఏ రంగంలో ఉద్యోగాలు పెరగలేదని, పైగా భారీగా తగ్గాయని ఎన్ఎస్ఎస్వో లెక్కలు తెలుపుతున్నాయి.
సినిమాల హీరోలు, మతోన్మాదాన్ని ప్రేరేపించే ఉన్మాదులు, దేశ సహజ వనరులను కొల్లగొట్టి కోట్లు గడించే ధనవంతులు, దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో అధికార పీఠాలెక్కి ప్రజల్ని బూటుకాళ్లతో తన్నే నాయకులు, ప్రజాప్రతినిధులు యువతకు ఆదర్శం కారాదు. గుట్కా, మద్యం లాంటి వ్యసనాలకు, ఉత్పత్తులకు, అమ్మకాలకు వ్యతిరేకంగా, మన దేశ సహజ వనరులైన విత్తనాలు, భూమి, నీరు, అడవులు, ఖనిజాలపై ప్రజలకే శాశ్వత హక్కులు ఉండేలా యువత ఉద్యమించాలి. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాడాలి. వ్యవసాయాన్ని విషపూరితం చేస్తున్న రసాయనాలకు వ్యతిరేకంగా, గాలినీ, నీటినీ, సముద్రాలనూ విషపూరితం చేస్తున్న పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి. తమ భవిష్యత్ కోసం యువత తెగించి పోరాడకపోతే భవిష్యత్ అంధకారం కాక తప్పదు.
(మార్చి 30, 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఖమ్మంలో పీవైఎల్ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా...)
- ఎ.రాజేందర్, పీవైఎల్ రాష్ట్ర కన్వీనర్