
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అభివృద్ధి ముసుగు తగిలించుకున్న ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని మతతత్వం వైపు నడిపిస్తూ లౌకిక విలువలకు భంగం కలిగిస్తున్నారని ఢిల్లీ జేఎన్‌యూ బీఏఎస్‌వో నేత ఉమర్ ఖలీద్ అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర 7వ మహాసభల సందర్భంగా వేలాది మంది యువకుల తో బుధవారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మహిళలపై, చిన్నారులపై జరుగుతు న్న దాడులను సమర్థిస్తూ బీజేపీ నేతలు ర్యాలీ లు తీయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
యూపీలో యోగి ప్రభుత్వ పాలనలో 11ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని, దేశ వ్యాప్తంగా నేరస్తులను శిక్షించాలని ఆందోళన చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వం నేరస్తులను అరెస్ట్ చేసినట్లు చేసి వదిలేసిందని అన్నారు. అమిత్‌షాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినందుకే న్యాయమూర్తి లోయాను హత్య చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని జపం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాటాలు సాగుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment