బస్టాపుల్లో క్యూలైన్లు
హైదరాబాద్‌లో ముంబై తరహా రవాణా వ్యవస్థ: మంత్రి మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముంబై తరహా రవాణా వ్యవస్థను, క్యూలైన్ విధానాన్ని హైదరాబాద్‌లోనూ అమలు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. సీఎం కేసీఆర్ ఆమోదంతో ఈ దిశగా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ తదితరులతో కలిసి ముంబై వెళ్లిన మంత్రి మహేందర్ రెడ్డి అక్కడి వ్యవస్థను అధ్యయనం చేసి వచ్చారు.
ముంబైలో బస్టాపులు, రైల్వేస్టేషన్లు, మెట్రోను అనుసంధానించిన తీరు, ప్రయాణికులు క్యూ పద్ధతి వంటి అంశాలను ఈ బృందం పరిశీలించింది. దనిపై శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ముంబైలో రైలు, మెట్రో, ఆర్టీసీ వ్యవస్థలు ఎక్కడికక్కడ ఒకదానికొకటి అనుసంధానమవడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదన్నారు.
మహారాష్ట్రలో మాదిరిగా క్యూలైన్ విధానం ప్రవేశ పెట్టడం వల్ల ప్రమాదాలు, ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే రైలు, మెట్రో, బస్టాప్‌లను అనుసంధానిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. బస్సులు సమయానికి గమ్య స్థానాలకు చేరేలా చూడటం, ట్రాఫిక్ చిక్కులు తలెత్తినప్పుడు వెంటనే ఇతర బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపడం వంటి చర్యలను ముంబై పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో చేపడుతున్నారని.. హైదరాబాద్‌లోనూ అలాంటి విధానం తీసుకువస్తామని చెప్పారు. రోడ్లు దాటడానికి స్కైవాక్‌లు, సులువైన టికెటింగ్ కోసం స్మార్ట్‌కార్డులు, బస్సుల సమాచారం తెలుసుకోడానికి జీపీఎస్ విధానం అమలుతో రవాణా వ్యవస్థ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. తమ అధ్యాయనంపై సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తామని, ఆయన ఆమోదంతో కొత్త వ్యవస్థను అమలు చేస్తామని మంత్రి తెలిపారు.