ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరత
45% అభివృద్ధి కేంద్రాలు మన దేశంలోనే
► 118 బిలియన్ డాలర్లకు ఐటీ ఎగుమతులు
► నాస్కాం ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. స్థానికులకు ఉద్యోగాలు, పాలసీల రూపకల్పన తద్వారా ఆర్థికాభివృద్ధి ఇదీ ఈ ఉద్యమ లక్ష్యం. ఈ ఉద్యమాన్ని ఒక్కో దేశం ఒక్కో రకంగా చేస్తోంది. అంటే అమెరికా హెచ్1బీ వీసా నిబంధనల మార్పు చేస్తే.. ఆస్ట్రేలియా, సింగపూర్లు వర్క్ వీసా పాలసీని రద్దు చేశాయి’ అని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ చెప్పారు.
వీసా పాలసీ నిబంధనల ఇబ్బందులు వీసా ఆధారిత కంపెనీలకు ఎదురవుతాయే తప్ప నిపుణులకు కాదని పేర్కొన్నారు. గురువారమిక్కడ ‘నాస్కాం గ్లోబల్ ఇన్‌హౌజ్ సెంటర్స్ కాన్క్లేవ్–2017’ రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతోందని, దీంతో పనిచేసే విధానం మారుతోందన్నారు.
కానీ, ప్రపంచ దేశాల్లో నైపుణ్యమున్న ఉద్యోగులకు కొరత ఉందని.. దీన్ని అధిగమించేందుకు నిపుణులకు ఎర్రతివాచీ పరుస్తున్నాయన్నారు. ‘ఆర్థిక మందగమనం సవాళ్లు విసురుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే కనుమరుగవుతాం. 20 లక్షల ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొంది. మన దేశంలో 60 శాతం కంపెనీలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటానికి స్టార్టప్స్‌తో భాగస్వామ్యమై పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఐటీ ఎగుమతులు 118 బిలియన్ డాలర్లకు..
57% గ్లోబల్ సోర్సింగ్ మన ఐటీ కంపెనీలే నిర్వహిస్తున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ‘45%కి పైగా గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్స్ మన దేశంలోనే ఉన్నాయి. వీటి ఆదాయం 21 బిలియన్ డాలర్లు. దేశంలో ఐటీ ఎగుమతుల వాటా 118 బిలియన్ డాలర్లకు చేరింది. ఐటీ రంగంలో ప్రతి ఏటా 60–70 వేల మంది ఉద్యోగులు జతవుతున్నారు’ అని తెలిపారు.