Race Course Road
-
ప్రధాని కార్యాలయం ఎలా ఉంటుందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ఎక్కడ నివసిస్తాడని ఏ భారతీయుడిని అడిగినా వాషింగ్టన్‌లోని ‘వైట్‌హౌస్’లో అని టక్కున సమాధానం ఇస్తారు. మరి భారత ప్రధాన మంత్రి ఎక్కడ నివసిస్తారని ప్రశ్నిస్తే టక్కున సమాధానం ఇవ్వకుండా కొంత ఆలోచనలో పడతారు. ఢిల్లీలోని ‘రేస్ కోర్స్ రోడ్డులో’ ఎక్కడో ఉంటారంటారు. వైట్‌హౌస్ అనగానే ఆ భవనం రూపురేఖలు మన కళ్లముందు కదలాడుతాయి. అదే మన ప్రధాన మంత్రి భవనం ఎలా ఉంటుందంటే ఎవరికి సరిగ్గా స్ఫురణకు రాదు. ఒకటి, రెండు సార్లు మినహా టీవీలో కూడా మన పీఎం భవనాన్ని సరిగ్గా చూపలేదు. పత్రికల్లో కూడా ఇప్పటి వరకు క్లోజప్ ఫొటోలు, మహా అంటే భవనం ముందు భాగం ఫొటోలు మాత్రమే వచ్చాయి. ప్రధాన మంత్రి నివాసం గురించి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులను అడిగితే సెవన్ రేస్ కోర్సు రోడ్డు అని టక్కున చెబుతారు. సెవన్ అంటే అది ఏడో నెంబర్ భవనం. అందులో ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయం పనిచేస్తుంది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడో నెంబర్ భవనంలోగానీ ఐదో నెంబర్ భవనంలోగానీ ఉంటారు. కచ్చితంగా ఇదని తెలియదుగానీ ఆయన నివాసం ఐదో నెంబర్ భవనంలో అని సన్నిహితులు చెబుతారు. రేస్‌కోర్స్ రోడ్డులో పీఎం ఉండేది మొత్తం ఐదు భవనాల సముదాయం. 1, 3, 5, 7, 9 నెంబర్లతో ఆ భవనాలు ఉన్నాయి. ఒకటి, తొమ్మిదవ నెంబర్ భవనాల్లో రాజీవ్ గాంధీ హత్యానంతరం 1985లో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాని కార్యాలయాల భవనాలకు రక్షణ కల్పించడమే ఎస్పీజీ ప్రధాన విధి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అంటే 2016లో ప్రధాని కార్యాలయాన్ని సెవెన్ రేస్ కోర్స్ నుంచి సెవెన్, లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చారు. అయినా ఇప్పటికీ పాత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తీన్‌మూర్తి రోడ్డులోని తీన్‌మూర్తి భవనంలో ఉన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ సఫ్దార్ జంగ్ రోడ్డులో ఉన్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక ఆయన తన కుటుంబంతో మొట్టమొదటి సారిగా రేస్ కోర్స్ రోడ్డులోకి వచ్చారు. రాజీవ్ గాంధీ ఏడవ నెంబర్ భవనాన్ని తన కార్యాలయంగా ఎంచుకోగా, ఐదో నెంబర్ భవనంలో కుటుంబం నివాసం ఉంది. రాజీవ్ గాంధీ సన్నిహిత సలహాదారు మూడవ నెంబర్ భవనంలో ఉండేవారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యులు ఐదో నెంబర్, ఏడో నెంబర్ భవనాల్లో కన్నా మూడవ నెంబర్ భవనంలోనే ఎక్కువ ఉండేవారని అప్పట్లో ప్రచారం ఉండేది. ఐదో నెంబర్, మూడో నెంబర్ భవనాల లాన్లు కలిసి పోయి ఉండడం వల్ల ఎలాంటి ఎస్పీజీ తనిఖీలు లేకుండానే ఓ భవనంలో నుంచి మరో భవనంలోకి వెళ్లే అవకాశం ఉండేది. పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఐదో నెంబర్ భవనంలో ఉండేందుకు ఇష్టపడకుండా మూడవ నెంబర్ భవనంలో ఉన్నారు. అందుకు రెండు రకాల వాదనలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ పట్ల అమితమైన అభిమానం ఉండడంతో ఆ భవనంలో ఆయన జ్ఞాపకాలు అలాగే ఉండిపోనీయాలని మూడో నెంబర్ భవనానికి మారారన్నది అధికారికంగా చెప్పిన వాదన. ఐదో నెంబర్ భవనంలో ఉంటే అరిష్టమని ఆయన మిత్రుడైన తాంత్రిక స్వామి చంద్రస్వామి చెప్పడంతో అందులో ఉండలేదన్నది మరో వాదన. ఆ తర్వాత వచ్చిన ప్రధానులు ఏడో నెంబర్ భవనం నుంచి పనిచేస్తూ ఐదు లేదా మూడో నెంబర్ భవనాల్లో ఉంటూ వచ్చారు. అటల్ బిహారి వాజపేయి ప్రధాన మంత్రి అయ్యాక ఏడో నెంబర్ భవనానికి సమీపంలో సినిమా థియేటర్, కాన్ఫరెన్స్ రూములతో కూడిన అతి పెద్ద ఆడిటోరియం నిర్మించారు. దానికి పంచవటి అని పేరు పెట్టారు. ఓ హెలిపాడ్‌ను కూడా నిర్మించారు. అప్పట్లో ఈ నిర్మాణాలకు 2,658 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 12 ఎకరాల్లో విస్తరించిన ప్రధాని కార్యాలయ సముదాయంలోకి సాధారణ పౌరులనే కాదు, మీడియాను కూడా అనుమతించరు. అతికొద్ది సందర్భాల్లో కాన్ఫరెన్స్ రూమ్‌ల వరకే మీడియా ప్రతినిధులను అనుమతిస్తారు. ఎక్కడా ఎవరినీ ఫొటోలు తీయనీయరు. అసలు ఈ భవనాలే బయటకు కనిపించవు. అదే ప్రధాని ఆదేశం ఉంటే ఎస్పీజీలు ఎవరినైనా ఎలాంటి విజిటింగ్ పాస్‌లు ఇవ్వకుండా, కనీసం రాకపోకలను నమోదు చేయకుండా, తనిఖీలు కూడా చేయకుండా పంపిస్తారు. ఇలాగే ఒకనాడు తాను కోట్ల రూపాయల సూటు కేసుతో పీవీ నరసింహారావును కలుసుకున్నానని స్టాక్ ఎక్స్ఛేంజీ బ్రోకర్ హర్షద్ మెహతా స్వయంగా వెల్లడించారు. అదే దేశ దేశాల నుంచి ముప్పుండే అమెరికా అధ్యక్షుడి భవనం ‘వైట్‌హౌస్’లోకి వివిధ సందర్భాల్లో సామాన్యులను కూడా అనుమతిస్తారు. ఇక మీడియా విషయం చెప్పక్కర్లేదు. మాజీ అధ్యక్షుడు ఒబామా స్వయంగా మీడియా ప్రతినిధులను వెంటపెట్టుకొని లోపలికి తీసుకెళ్లేవారు. ప్రముఖ జర్నలిస్ట్ సీమా గోస్వామి ‘రేస్ కోర్స్ రోడ్డు’ పేరిట రాసిన పుస్తకం కోసం ఆ రోడ్డులో పరిశోధన చేయడం వల్ల కొన్ని అదనపు విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
‘నామ’మాత్రం కారాదు!
దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో రహదారి పేరు మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసముండే ‘7, రేస్ కోర్స్ రోడ్’ పేరును లోక్ కల్యాణ్ మార్గ్‌గా మారుస్తున్నట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అఖిలపక్ష సమావేశంలో ఇందుకోసం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. లోక్ కల్యాణ్ అంటే హిందీలో ప్రజా సంక్షేమం గనుక... తామంతా ఆ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాం గనుక ఇది సరిపోతుం దని స్థానిక బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి చెబుతున్నారు. ఇంతక్రితం ఢిల్లీలో ఔరంగ జేబ్ మార్గ్ ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్‌గా మారింది. బొంబాయి పేరు ముంబైగా, కలకత్తా పేరు కోల్‌కతాగా, గౌహతి పేరు గువాహటిగా ఇటీవలికాలంలో మారాయి. ప్రాంతాల పేర్లే కాదు...ఒక్కోసారి వ్యక్తుల పేర్లూ మారుతుంటాయి. అయితే ప్రభు త్వాలకు సాధ్యమైనట్టుగా వ్యక్తుల విషయంలో అదంత సులభం కాదు. అందరికీ అలా సాధ్యమూ కాదు. ఎన్నో లాంఛనాలు పూర్తి చేసుకోవాలి. అందుకు సంబం ధించి గెజెట్ నోటిఫికేషన్ రావాలి. దాని ఆధారంగా ఎన్నిటినో మార్చుకుంటూ రావాలి. ప్రజానీకంపై బలమైన ముద్ర వేసి విషాదకర పరిస్థితుల్లో కనుమరు గైనవారి పేరిటా, జీవితాల్ని త్యాగం చేసిన నాయకుల పేరిటా, మహనీయుల పేరిటా ఒక ప్రాంతాన్ని లేదా వీధిని ఎంచుకుని వారి పేరు పెట్టడం ఎప్పటినుంచో ఉన్నదే. అలా చేయడాన్ని తప్పుబట్టే వారుండరు. పాత పేరు పోయి కొత్త పేరొ చ్చినా జనం అంత త్వరగా అలవాటు పడరు. విజయవాడలో కార్ల్ మార్క్స్ రోడ్ ఇప్పటికీ అక్కడి పౌరులకు ఏలూరు రోడ్డే. అలాగే మహాత్మాగాంధీ రోడ్ బందరు రోడ్డే! ఢిల్లీలోని ‘7, రేస్ కోర్స్ రోడ్’ మొదటినుంచీ దేశ ప్రధానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటున్నది. మోదీకి ముందు 13మంది ప్రధానులు అక్కడ నివాసం ఉన్నారు. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో రేస్ కోర్సుకు దారితీసే మార్గం గనుక దానికి ఆ పేరు వచ్చింది. ఆనాటి రేస్‌కోర్స్ ఇప్పుడు లేకున్నా పేరు మాత్రం స్థిరపడి పోయింది. సంపన్న కుటుంబాల సంగతేమోగానీ గుర్రప్పందాలను చాలామంది జూదంగా పరిగణిస్తారు. అలాంటి పేరు ప్రధాని నివసించే రోడ్‌కు ఉండరాదన్నది మన నేతల ఆలోచన కావొచ్చు. మన భారతీయ విలువలకూ, సంప్రదాయాలకూ గుర్రప్పందాలు విరుద్ధమైనవన్నది బీజేపీ అభిప్రాయం. పేరు మార్పుపై పెద్ద చర్చే నడిచింది. రోడ్‌కు ‘ఏకాత్మ మార్గ్’ అని పెట్టాలని ఎంపీ లేఖి సూచించారు. బీజేపీ మాతృక అయిన భారతీయ జనసంఘ్ స్థాపకుల్లో ఒకరైన దీన్ దయాళ్ ఉపా ధ్యాయ సిద్ధాంతం ‘ఏకాత్మ మానవవాద్’ గనుక లేఖి ప్రతిపాదన వెనకున్న ఆంత ర్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందువల్లే కావొచ్చు...దాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ తిరస్కరించి సిక్కుల మత గురువు గురుగోవింద్ సింగ్ పేరు ఉండాలని సూచించారు. అయితే చివరకు ‘లోక్ కల్యాణ్’ పేరును స్థిరపరిచారు. మిగిలినవాటి సంగతెలా ఉన్నా ఢిల్లీ ఈమధ్య కాలంలో వివాదాలకు చిరు నామాగా మారింది. రాజధాని నగరాన్ని చికున్‌గున్యా వణికించింది. రోడ్లపై చెత్త చేరడం, పారిశుద్ధ్యలోపం కారణంగా అక్కడి ఆసుపత్రులన్నీ ఆ రోగం బారినపడిన వారితో నిండిపోయాయి. 15మంది మరణించారు కూడా. ఇందుకు బాధ్యులు మీరంటే మీరని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాదులాడుకున్నాయి. ఫలితంగా వైద్య సాయం అందడంలో ఆలస్యమూ అయింది. ఇక కేంద్రంలో పాలక పక్షానికి నేతృత్వంవహిస్తున్న బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనడం రివాజైంది. ఆప్ సర్కారుకు చెందిన మంత్రి లేదా పార్టీ ఎమ్మెల్యే అరెస్టు కావడం లేదా ఆ పార్టీకే చెందిన ఓ ఛోటా నాయకుణ్ణి పోలీసులు నిర్బంధించడం మీడియాలో తరచు కనబడే వార్త. ఇవేమీ లేకపోతే ఆప్ ప్రభుత్వం చేసిన నియామకాన్ని లేదా నిర్ణయాన్ని రద్దు చేయడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటారు. ఏసీబీ కేసు ఎఫ్ఐఆర్లో తన పేరును ప్రస్తా వించడానికి ప్రధాని ఆమోదం ఉన్నదని కేజ్రీవాల్ ఈమధ్యే నిప్పులు చెరిగారు. ఈ ‘కుట్ర’ను బట్టబయలు చేయడానికి త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడతానని కూడా ఆయనంటున్నారు. ఇలా పరస్పరం కత్తులు నూరుకుంటున్న రెండు వైరి పక్షాలు రేస్‌కోర్సు రోడ్ విషయంలో ఒక్కటి కావడం ఢిల్లీ వాసులకు పెద్ద వింతే. లోక్ కల్యాణ్ పేరెట్టినందుకు కాకపోయినా... ప్రధాని నివాసం ఉండే వీధి గనుక ఆ ప్రాంతాన్ని అద్దంలా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇంతకు ముందూ తీసుకునే ఉంటారు. కానీ ‘లోక్ కల్యాణ్’ స్ఫూర్తితో రాజకీ యాల్లోకి వచ్చామని చెబుతున్న నేతలు అందుకు తగ్గ ఆచరణను కనబరు స్తున్నారా? ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అదే జరిగుంటే ఢిల్లీలో అంత మంది ఒక రోగం బారిన పడి చనిపోయే పరిస్థితి ఉండదు. అక్కడ రాజకీయ కలహాలు నిత్యకృత్యంగా మారవు. ప్రభుత్వాల మధ్యా, నేతల మధ్యా వృథా వివాదాలు సాగవు. ఇదే రాజధాని నగరంలో మూడు దశాబ్దాల క్రితం హంతక ముఠాలు వీధుల్లోకొచ్చి వందలాదిమంది సిక్కులను ఊచకోత కోశాయి. పసి పిల్లలు, వృద్ధులు, ఆడ, మగ అన్న విచక్షణ లేకుండా నిష్కారణంగా ప్రాణాలు తీశాయి. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న చాలా మంది నాయకులు ‘సహజ మరణం’ చెందారు. సజీవంగా ఉన్నవారు చట్టంలోని లొసుగులు ఉపయోగిం చుకుని ఈనాటికీ స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఆప్తులను కోల్పోయిన ఎన్నో కుటుం బాలు మాత్రం ఇప్పటికీ దిక్కూ మొక్కూ లేని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నాయి. ముఖ్యంగా ఇంతక్రితమూ, ఇప్పుడూ పేర్ల మార్పు ప్రస్తావన వచ్చినప్పుడల్లా భారతీయ విలువల గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు వీటిపై ఆలో చించాలి. ప్రజల సంక్షేమం గురించి, వారి అవసరాల గురించి పట్టించుకునే నేతలు వ్యవహరించాల్సిన తీరు మరింత మెరుగ్గా ఉండితీరాలి. ఇప్పుడు రహదారి పేరు మార్చడంలో వ్యక్తమైన సుహృద్భావం తమ సంక్షేమం, భద్రత విషయంలో కూడా ఉండాలని పౌరులు అనుకోవడం అత్యాశేమీ కాదు. -
ప్రధాని అడ్రస్ మారింది.. కొత్త చిరునామా ఇదే!
భారత ప్రధానమంత్రి అధికారిక నివాస చిరునామా మారింది. దేశంలోనే అత్యంత కీలకమైన చిరునామాగా ఇన్నినాళ్లు కనిపిస్తూ వస్తున్న 7, రేస్ కోర్స్ రోడ్ పేరు ఇక చరిత్రలో కలిసిపోయింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని నివాసంతోపాటు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారుల నివాసాలు ఉన్న దీని పేరును ’లోక్ కల్యాణ్ మార్గ్’ పేరు మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ’లోక కల్యాణానికి (ప్రజా సంక్షేమానికి) మించినది ఏది లేదు. అందుకే రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఏకగ్రీవంగా పేరు మార్పు నిర్ణయాన్ని తీసుకున్నారు’ అని బీజేపీ ఢిల్లీ ఎంపీ మినాక్షి లేఖి తెలిపారు. న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) బుధవారం భేటీ అయి.. 7, రేస్ కోర్స్ రోడ్డు పేరుమార్పుపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఆమె సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. రేస్ కోర్స్ అనే పదం భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధంలేనిదని, వలస పాలన కాలం నాటి ఆ పేరును తొలిగించి 'ఏకాత్మ మార్గ్'అని పెట్టాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ప్రతిపాదించారు. న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆమె న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) సభ్యురాలిగా కూడా ఉన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ భావజాలం ఏకాత్మ మానవ దర్శన్ (integral humanism)ను సూచించేలా రేస్ కోర్స్ రోడ్డును 'ఏకాత్మ మార్గ్'గా మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే, ఎన్డీఎంసీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 'ఏకాత్మ మార్గ్'కు బదులుగా అమరజవాన్లలో ఒకరి పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. 1965 యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ నిర్మల్జిత్ సింగ్ పేరును ఆప్ ఎమ్మెల్యే సూచించారు. ఈ విషయంపై కౌన్సిల్ బుధవారం సమావేశమై.. '7, లోక్ కల్యాణ్ మార్గ్'గా పేరు ప్రతిపాదిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనుంది. ఇక నుంచి ప్రధాని నివాసం 7, లోక్‌కల్యాణ్ మార్గ్ కానుంది. -
ప్రధాని మోదీ ఇంటి అడ్రస్ మారనుందా?
కొన్ని చిరునామాలు అప్రయత్నంగానే బండగుర్తుల్లా గుర్తుండిపోతాయి. 1600, పెన్సిల్వేనియా ఎవెన్యూ ఎన్‌డబ్ల్యూ, వాషింగ్టన్ డీసీ.. చిరునామా వినగానే అమెరికన్లకు అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ గుర్తొస్తుంది. ఇక ఇండియాలో రాజకీయపరంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తి నివాసం ఎక్కడంటే.. '7 రేస్ కోర్స్ రోడ్, న్యూఢిల్లీ' అని ఠక్కున చెప్పేస్తాం. భారత ప్రధానమంత్రి అధికారిక నివాసం అది. ప్రస్తుతం ఆ ఇంట్లో నరేంద్ర మోదీ నివసిస్తున్నారు. అయితే ఇటీవల వెల్లువెత్తుతున్న డిమాండ్ల నేపథ్యంలో మోదీగారి ఇంటి అడ్రస్ మారిపోనుందనే భావన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. రేస్ కోర్స్ అనే పదం భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధంలేనిదని, వలస కాలం నాటి ఆ పేరును తొలిగించి 'ఏకాత్మ మార్గ్'అని పెట్టాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆమె ఈ మేరకు న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ)లో ప్రతిపాదన చేశారు. బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ బావజాలం ఏకాత్మ మానవ దర్శన్ (integral humanism)ను సూచించేలా రేస్ కోర్స్ రోడ్డును 'ఏకాత్మ మార్గ్'గా మార్చాలని ఆమె ప్రతిపాదించారు. కాగా, ఎన్డీఎంసీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు మాత్రం పేరు మార్పునకు అంగీకరిస్తూనే ఆర్ఎస్ఎస్ సంబంధిత వ్యక్తులవి కాకుండా అమరజవాన్లలో ఒకరి పేరు పెట్టాలని అంటున్నారు. 1965 యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ నిర్మల్జిత్ సింగ్ పేరును ఆప్ ఎమ్మెల్యే సూచించారు. ఈ విషయంపై కౌన్సిల్ తుది తీసుకోలేదు. ఒకవేళ పేరుమార్పునకు ఓకే చెప్పినా ఇప్పటికే ఇలాంటి మార్పుల వల్ల తలెత్తిన విమర్శల నేపథ్యంలో కేంద్ర పునరాలోచించే అవకాశం లేకపోలేదు. గతంలో ఔరంగజేబ్ రోడ్డును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చిన సందర్భంగా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.