
‘నామ’మాత్రం కారాదు!
దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో రహదారి పేరు మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసముండే ‘7, రేస్ కోర్స్ రోడ్’ పేరును లోక్ కల్యాణ్ మార్గ్‌గా మారుస్తున్నట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో రహదారి పేరు మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసముండే ‘7, రేస్ కోర్స్ రోడ్’ పేరును లోక్ కల్యాణ్ మార్గ్‌గా మారుస్తున్నట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అఖిలపక్ష సమావేశంలో ఇందుకోసం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. లోక్ కల్యాణ్ అంటే హిందీలో ప్రజా సంక్షేమం గనుక... తామంతా ఆ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాం గనుక ఇది సరిపోతుం దని స్థానిక బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి చెబుతున్నారు. ఇంతక్రితం ఢిల్లీలో ఔరంగ జేబ్ మార్గ్ ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్‌గా మారింది. బొంబాయి పేరు ముంబైగా, కలకత్తా పేరు కోల్‌కతాగా, గౌహతి పేరు గువాహటిగా ఇటీవలికాలంలో మారాయి.
ప్రాంతాల పేర్లే కాదు...ఒక్కోసారి వ్యక్తుల పేర్లూ మారుతుంటాయి. అయితే ప్రభు త్వాలకు సాధ్యమైనట్టుగా వ్యక్తుల విషయంలో అదంత సులభం కాదు. అందరికీ అలా సాధ్యమూ కాదు. ఎన్నో లాంఛనాలు పూర్తి చేసుకోవాలి. అందుకు సంబం ధించి గెజెట్ నోటిఫికేషన్ రావాలి. దాని ఆధారంగా ఎన్నిటినో మార్చుకుంటూ రావాలి. ప్రజానీకంపై బలమైన ముద్ర వేసి విషాదకర పరిస్థితుల్లో కనుమరు గైనవారి పేరిటా, జీవితాల్ని త్యాగం చేసిన నాయకుల పేరిటా, మహనీయుల పేరిటా ఒక ప్రాంతాన్ని లేదా వీధిని ఎంచుకుని వారి పేరు పెట్టడం ఎప్పటినుంచో ఉన్నదే. అలా చేయడాన్ని తప్పుబట్టే వారుండరు. పాత పేరు పోయి కొత్త పేరొ చ్చినా జనం అంత త్వరగా అలవాటు పడరు. విజయవాడలో కార్ల్ మార్క్స్ రోడ్ ఇప్పటికీ అక్కడి పౌరులకు ఏలూరు రోడ్డే. అలాగే మహాత్మాగాంధీ రోడ్ బందరు రోడ్డే! ఢిల్లీలోని ‘7, రేస్ కోర్స్ రోడ్’ మొదటినుంచీ దేశ ప్రధానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటున్నది.
మోదీకి ముందు 13మంది ప్రధానులు అక్కడ నివాసం ఉన్నారు. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో రేస్ కోర్సుకు దారితీసే మార్గం గనుక దానికి ఆ పేరు వచ్చింది. ఆనాటి రేస్‌కోర్స్ ఇప్పుడు లేకున్నా పేరు మాత్రం స్థిరపడి పోయింది. సంపన్న కుటుంబాల సంగతేమోగానీ గుర్రప్పందాలను చాలామంది జూదంగా పరిగణిస్తారు. అలాంటి పేరు ప్రధాని నివసించే రోడ్‌కు ఉండరాదన్నది మన నేతల ఆలోచన కావొచ్చు. మన భారతీయ విలువలకూ, సంప్రదాయాలకూ గుర్రప్పందాలు విరుద్ధమైనవన్నది బీజేపీ అభిప్రాయం. పేరు మార్పుపై పెద్ద చర్చే నడిచింది. రోడ్‌కు ‘ఏకాత్మ మార్గ్’ అని పెట్టాలని ఎంపీ లేఖి సూచించారు. బీజేపీ మాతృక అయిన భారతీయ జనసంఘ్ స్థాపకుల్లో ఒకరైన దీన్ దయాళ్ ఉపా ధ్యాయ సిద్ధాంతం ‘ఏకాత్మ మానవవాద్’ గనుక లేఖి ప్రతిపాదన వెనకున్న ఆంత ర్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందువల్లే కావొచ్చు...దాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ తిరస్కరించి సిక్కుల మత గురువు గురుగోవింద్ సింగ్ పేరు ఉండాలని సూచించారు. అయితే చివరకు ‘లోక్ కల్యాణ్’ పేరును స్థిరపరిచారు.
మిగిలినవాటి సంగతెలా ఉన్నా ఢిల్లీ ఈమధ్య కాలంలో వివాదాలకు చిరు నామాగా మారింది. రాజధాని నగరాన్ని చికున్‌గున్యా వణికించింది. రోడ్లపై చెత్త చేరడం, పారిశుద్ధ్యలోపం కారణంగా అక్కడి ఆసుపత్రులన్నీ ఆ రోగం బారినపడిన వారితో నిండిపోయాయి. 15మంది మరణించారు కూడా. ఇందుకు బాధ్యులు మీరంటే మీరని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాదులాడుకున్నాయి. ఫలితంగా వైద్య సాయం అందడంలో ఆలస్యమూ అయింది. ఇక కేంద్రంలో పాలక పక్షానికి నేతృత్వంవహిస్తున్న బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనడం రివాజైంది.
ఆప్ సర్కారుకు చెందిన మంత్రి లేదా పార్టీ ఎమ్మెల్యే అరెస్టు కావడం లేదా ఆ పార్టీకే చెందిన ఓ ఛోటా నాయకుణ్ణి పోలీసులు నిర్బంధించడం మీడియాలో తరచు కనబడే వార్త. ఇవేమీ లేకపోతే ఆప్ ప్రభుత్వం చేసిన నియామకాన్ని లేదా నిర్ణయాన్ని రద్దు చేయడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటారు. ఏసీబీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరును ప్రస్తా వించడానికి ప్రధాని ఆమోదం ఉన్నదని కేజ్రీవాల్ ఈమధ్యే నిప్పులు చెరిగారు. ఈ ‘కుట్ర’ను బట్టబయలు చేయడానికి త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడతానని కూడా ఆయనంటున్నారు. ఇలా పరస్పరం కత్తులు నూరుకుంటున్న రెండు వైరి పక్షాలు రేస్‌కోర్సు రోడ్ విషయంలో ఒక్కటి కావడం ఢిల్లీ వాసులకు పెద్ద వింతే.
లోక్ కల్యాణ్ పేరెట్టినందుకు కాకపోయినా... ప్రధాని నివాసం ఉండే వీధి గనుక ఆ ప్రాంతాన్ని అద్దంలా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇంతకు ముందూ తీసుకునే ఉంటారు. కానీ ‘లోక్ కల్యాణ్’ స్ఫూర్తితో రాజకీ యాల్లోకి వచ్చామని చెబుతున్న నేతలు అందుకు తగ్గ ఆచరణను కనబరు స్తున్నారా? ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అదే జరిగుంటే ఢిల్లీలో అంత మంది ఒక రోగం బారిన పడి చనిపోయే పరిస్థితి ఉండదు. అక్కడ రాజకీయ కలహాలు నిత్యకృత్యంగా మారవు. ప్రభుత్వాల మధ్యా, నేతల మధ్యా వృథా వివాదాలు సాగవు. ఇదే రాజధాని నగరంలో మూడు దశాబ్దాల క్రితం హంతక ముఠాలు వీధుల్లోకొచ్చి వందలాదిమంది సిక్కులను ఊచకోత కోశాయి. పసి పిల్లలు, వృద్ధులు, ఆడ, మగ అన్న విచక్షణ లేకుండా నిష్కారణంగా ప్రాణాలు తీశాయి. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న చాలా మంది నాయకులు ‘సహజ మరణం’ చెందారు.
సజీవంగా ఉన్నవారు చట్టంలోని లొసుగులు ఉపయోగిం చుకుని ఈనాటికీ స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఆప్తులను కోల్పోయిన ఎన్నో కుటుం బాలు మాత్రం ఇప్పటికీ దిక్కూ మొక్కూ లేని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నాయి. ముఖ్యంగా ఇంతక్రితమూ, ఇప్పుడూ పేర్ల మార్పు ప్రస్తావన వచ్చినప్పుడల్లా భారతీయ విలువల గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు వీటిపై ఆలో చించాలి. ప్రజల సంక్షేమం గురించి, వారి అవసరాల గురించి పట్టించుకునే నేతలు వ్యవహరించాల్సిన తీరు మరింత మెరుగ్గా ఉండితీరాలి. ఇప్పుడు రహదారి పేరు మార్చడంలో వ్యక్తమైన సుహృద్భావం తమ సంక్షేమం, భద్రత విషయంలో కూడా ఉండాలని పౌరులు అనుకోవడం అత్యాశేమీ కాదు.