
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ఎక్కడ నివసిస్తాడని ఏ భారతీయుడిని అడిగినా వాషింగ్టన్‌లోని ‘వైట్‌హౌస్’లో అని టక్కున సమాధానం ఇస్తారు. మరి భారత ప్రధాన మంత్రి ఎక్కడ నివసిస్తారని ప్రశ్నిస్తే టక్కున సమాధానం ఇవ్వకుండా కొంత ఆలోచనలో పడతారు. ఢిల్లీలోని ‘రేస్ కోర్స్ రోడ్డులో’ ఎక్కడో ఉంటారంటారు. వైట్‌హౌస్ అనగానే ఆ భవనం రూపురేఖలు మన కళ్లముందు కదలాడుతాయి. అదే మన ప్రధాన మంత్రి భవనం ఎలా ఉంటుందంటే ఎవరికి సరిగ్గా స్ఫురణకు రాదు. ఒకటి, రెండు సార్లు మినహా టీవీలో కూడా మన పీఎం భవనాన్ని సరిగ్గా చూపలేదు. పత్రికల్లో కూడా ఇప్పటి వరకు క్లోజప్ ఫొటోలు, మహా అంటే భవనం ముందు భాగం ఫొటోలు మాత్రమే వచ్చాయి.
ప్రధాన మంత్రి నివాసం గురించి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులను అడిగితే సెవన్ రేస్ కోర్సు రోడ్డు అని టక్కున చెబుతారు. సెవన్ అంటే అది ఏడో నెంబర్ భవనం. అందులో ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయం పనిచేస్తుంది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడో నెంబర్ భవనంలోగానీ ఐదో నెంబర్ భవనంలోగానీ ఉంటారు. కచ్చితంగా ఇదని తెలియదుగానీ ఆయన నివాసం ఐదో నెంబర్ భవనంలో అని సన్నిహితులు చెబుతారు. రేస్‌కోర్స్ రోడ్డులో పీఎం ఉండేది మొత్తం ఐదు భవనాల సముదాయం. 1, 3, 5, 7, 9 నెంబర్లతో ఆ భవనాలు ఉన్నాయి. ఒకటి, తొమ్మిదవ నెంబర్ భవనాల్లో రాజీవ్ గాంధీ హత్యానంతరం 1985లో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాని కార్యాలయాల భవనాలకు రక్షణ కల్పించడమే ఎస్‌పీజీ ప్రధాన విధి.
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అంటే 2016లో ప్రధాని కార్యాలయాన్ని సెవెన్ రేస్ కోర్స్ నుంచి సెవెన్, లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చారు. అయినా ఇప్పటికీ పాత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తీన్‌మూర్తి రోడ్డులోని తీన్‌మూర్తి భవనంలో ఉన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ సఫ్దార్ జంగ్ రోడ్డులో ఉన్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక ఆయన తన కుటుంబంతో మొట్టమొదటి సారిగా రేస్ కోర్స్ రోడ్డులోకి వచ్చారు. రాజీవ్ గాంధీ ఏడవ నెంబర్ భవనాన్ని తన కార్యాలయంగా ఎంచుకోగా, ఐదో నెంబర్ భవనంలో కుటుంబం నివాసం ఉంది. రాజీవ్ గాంధీ సన్నిహిత సలహాదారు మూడవ నెంబర్ భవనంలో ఉండేవారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యులు ఐదో నెంబర్, ఏడో నెంబర్ భవనాల్లో కన్నా మూడవ నెంబర్ భవనంలోనే ఎక్కువ ఉండేవారని అప్పట్లో ప్రచారం ఉండేది. ఐదో నెంబర్, మూడో నెంబర్ భవనాల లాన్లు కలిసి పోయి ఉండడం వల్ల ఎలాంటి ఎస్పీజీ తనిఖీలు లేకుండానే ఓ భవనంలో నుంచి మరో భవనంలోకి వెళ్లే అవకాశం ఉండేది.
పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఐదో నెంబర్ భవనంలో ఉండేందుకు ఇష్టపడకుండా మూడవ నెంబర్ భవనంలో ఉన్నారు. అందుకు రెండు రకాల వాదనలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ పట్ల అమితమైన అభిమానం ఉండడంతో ఆ భవనంలో ఆయన జ్ఞాపకాలు అలాగే ఉండిపోనీయాలని మూడో నెంబర్ భవనానికి మారారన్నది అధికారికంగా చెప్పిన వాదన. ఐదో నెంబర్ భవనంలో ఉంటే అరిష్టమని ఆయన మిత్రుడైన తాంత్రిక స్వామి చంద్రస్వామి చెప్పడంతో అందులో ఉండలేదన్నది మరో వాదన. ఆ తర్వాత వచ్చిన ప్రధానులు ఏడో నెంబర్ భవనం నుంచి పనిచేస్తూ ఐదు లేదా మూడో నెంబర్ భవనాల్లో ఉంటూ వచ్చారు.
అటల్ బిహారి వాజపేయి ప్రధాన మంత్రి అయ్యాక ఏడో నెంబర్ భవనానికి సమీపంలో సినిమా థియేటర్, కాన్ఫరెన్స్ రూములతో కూడిన అతి పెద్ద ఆడిటోరియం నిర్మించారు. దానికి పంచవటి అని పేరు పెట్టారు. ఓ హెలిపాడ్‌ను కూడా నిర్మించారు. అప్పట్లో ఈ నిర్మాణాలకు 2,658 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 12 ఎకరాల్లో విస్తరించిన ప్రధాని కార్యాలయ సముదాయంలోకి సాధారణ పౌరులనే కాదు, మీడియాను కూడా అనుమతించరు. అతికొద్ది సందర్భాల్లో కాన్ఫరెన్స్ రూమ్‌ల వరకే మీడియా ప్రతినిధులను అనుమతిస్తారు. ఎక్కడా ఎవరినీ ఫొటోలు తీయనీయరు. అసలు ఈ భవనాలే బయటకు కనిపించవు. అదే ప్రధాని ఆదేశం ఉంటే ఎస్‌పీజీలు ఎవరినైనా ఎలాంటి విజిటింగ్ పాస్‌లు ఇవ్వకుండా, కనీసం రాకపోకలను నమోదు చేయకుండా, తనిఖీలు కూడా చేయకుండా పంపిస్తారు.
ఇలాగే ఒకనాడు తాను కోట్ల రూపాయల సూటు కేసుతో పీవీ నరసింహారావును కలుసుకున్నానని స్టాక్ ఎక్స్ఛేంజీ బ్రోకర్ హర్షద్ మెహతా స్వయంగా వెల్లడించారు. అదే దేశ దేశాల నుంచి ముప్పుండే అమెరికా అధ్యక్షుడి భవనం ‘వైట్‌హౌస్’లోకి వివిధ సందర్భాల్లో సామాన్యులను కూడా అనుమతిస్తారు. ఇక మీడియా విషయం చెప్పక్కర్లేదు. మాజీ అధ్యక్షుడు ఒబామా స్వయంగా మీడియా ప్రతినిధులను వెంటపెట్టుకొని లోపలికి తీసుకెళ్లేవారు. ప్రముఖ జర్నలిస్ట్ సీమా గోస్వామి ‘రేస్ కోర్స్ రోడ్డు’ పేరిట రాసిన పుస్తకం కోసం ఆ రోడ్డులో పరిశోధన చేయడం వల్ల కొన్ని అదనపు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment