Radio frequency signals
-
ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్.. ఏడు దేశాలు కలిసి..
Largest Radio Telescope SKAO: టెక్నాలజీ పరంగా రోజురోజుకూ అందనంత ఎత్తుకు ఎదుగుతోన్న మానవాళికి..ఈ సృష్టిలో ఇప్పటికీ సమాధానాలు దొరకని, అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఛేదించేందుకు తాజాగా... ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 30 ఏళ్లుగా దీని కట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. డిజైన్, అన్ని రకాల అనుమతులు దొరకడంతో జూలై మొదటి వారంలో పనులు మొదలయ్యాయి. ఈ టెలిస్కోప్‌కు ‘ద స్క్వేర్ కిలోమీటర్ ఆరే అబ్జర్వేటరీ(ఎస్‌కేఏఓ)’ అనే పెరుపెట్టారు. దీన్ని రెండువందల అతిపెద్ద డిష్ రిసీవర్లు, కోటీ ముప్పయి వేల చిన్న యాంటెనాలతో నిర్మిస్తున్నారు. దీంతో ఇప్పుడున్న టెలిస్కోప్లకంటే పదిరెట్ల అధిక సామర్థ్యంతో కాస్మోస్‌ను అధ్యయనం చేయడానికి వీలవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ కలిగిన ఈ టెలిస్కోప్ 70 మెగాహెడ్జ్‌ల నుంచి 25 గిగా హెడ్జ్‌ల రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను వినగలదు. దీన్ని రెండు ఖండాల్లో నిర్మించడం విశేషం. ఎస్కేఏ మధ్యశ్రేణి వ్యవస్థను దక్షిణాఫ్రికాలోని కరూ ఎడారిలో 50 అడుగుల వ్యాసార్థం గలిగిన 197 డిష్‌లతో, తక్కువ శ్రేణి ఫ్రీక్వెన్సీని వినగలిగే వ్యవస్థను 1,32,072 యాంటెనాలతో పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పాటుచేయనున్నారు. ఈ టెలిస్కోపు దాదాపు యాభైఏళ్లు క్రీయాశీలకంగా పనిచేయనుంది. ఎస్‌కేఏఓ సైన్స్ వర్కింగ్ గ్రూప్‌లో 40 దేశాలకు చెందిన వెయ్యిమందికిపైగా శాస్త్రవేత్తలున్నారు. ఈ భారీ రేడియో టెలిస్కోప్ విజ్ఞాన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి వీరంతా కృషిచేస్తున్నారు. ఈ విశ్వంలో జీవం ఎలా ఉద్భవించింది, గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి, ఇతర గ్రహాల లోగుట్టు ఏంటి వంటి అనేక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకోనున్నారు. టెలిస్కోప్ ఏర్పాటుకు రెండు బిలియన్ డాలర్లు(రూ.14,928 కోట్లు) ఖర్చు అవుతాయని ప్రస్తుత అంచనా. 2029 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ, 2024 నుంచే శాస్త్రీయ పరిశోధనలను ప్రారంభించనున్నారు. ఏడు దేశాలు కలిసి.. ఈ ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్లు నిధులు సమకూరుస్తున్నాయి. ఇండియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియాలు.. పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ టెలిస్కోప్ రూపకల్పనలో పాల్గొననున్నాయి. ‘ప్రపంచంలోనే భారీ టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభమైనందుకు నేను ఉద్విగ్నభరితుణ్ణయ్యాను. ఈ క్షణం కోసం 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఈ టెలిస్కోప్ ద్వారా విశ్వంలో మనల్ని వేధిస్తోన్న అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది’ అని చెప్పారు ఎస్‌కేఏఓ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ ఫిలిప్ డైమండ్. -
ఏలియన్లకు సందేశాన్ని పంపారు!!
లండన్: గ్రహాంతరవాసుల ఉనికిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సమీప నక్షత్రంపైకి ఓ సందేశాన్ని పంపారు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న జీజే 273 నక్షత్రానికి రేడియో సందేశాలను పంపినట్లు మెసేజింగ్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్(ఎంఈటీఐ) సోమవారం తెలిపింది. జీజే 273 నక్షత్రం రెండు గ్రహాలను కలిగి ఉందని, అందులో ఒకదానికి జీజే 237బీ అని నామకరణం చేశారు. ఇది జీవుల ఆవాసానికి అనుకూల వాతావరణమున్న గ్రహం కావడంతో దీనిపై గ్రహాంతరవాసులు ఉండే అవకాశముందని భావిస్తున్నారు. నీటిజాడ ఉండడంతో జీవరాశి ఉండే అవకాశముందని చెబుతున్నారు. తాము భావిస్తున్నట్లు జీజే 237పై జీవరాశి ఉన్నట్లయితే రేడియో సందేశాల ద్వారా తెలుసుకోవచ్చని, అయితే ఆ జీవరాశి ఏలియన్లా? కాదా? అనేది తెలుసుకునేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని ఎంఈటీఐ శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘మేం పంపిన సందేశాల ద్వారా ఏలియన్ల గురించి తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అవి ఏలియన్లు కాకుండా ఇతర జీవరాశి అయినా మా కష్టం ఫలించినట్లే’నని ఎంఈటీఐ శాస్త్రవేత్త డగ్లస్ వాకోచ్ పేర్కొన్నారు. -
వైఫైతో గోడల్లోంచీ చూడొచ్చు!
వాషింగ్టన్: ఉగ్రవాదులు ఒక భవనంలో దాక్కున్నారు.. చుట్టూ పోలీసులు మోహరించారు. కానీ లోపల ఎంత మంది ఉన్నారు? ఆయుధాలేమున్నాయి? అసలు లోపల గదులు, వస్తువులు ఏమున్నాయో తెలియదు.. పోలీసులు వెంటనే ఒక రోబోను రంగంలోకి దించారు. ఆ భవనాన్ని స్కాన్ చేసిన ఆ రోబో.. గోడల అవతల ఏముందో, ఎక్కడెక్కడ మనుషులున్నారో చూపించేసింది.. అంతే పోలీసులకు తమ పని సులువైపోయింది. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన సరికొత్త టెక్నాలజీ మహిమ ఇది. అసలు ఇలా గోడల అవతల ఏముందో స్కాన్ చేసి గుర్తించేందుకు ఉపయోగించేదేమిటో తెలుసా?.. ‘వైఫై’ టెక్నాలజీ. అదేనండీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లన్నింటిలోనూ ఉండే టెక్నాలజీయే! రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల ఆధారంగా గోడల అవతల ఉన్న వస్తువులు, మనుషులను ఇది గుర్తిస్తుంది. అంతేకాదు కలపతో చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహపు వస్తువులు ఇలా ఏ తరహాకు చెందినవో గుర్తించడంతోపాటు... గోడ అవతల ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నాయో కూడా చెప్పేస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఈ టెక్నాలజీని కేవలం రోబోలతో మాత్రమే కాకుండా... వైఫైతో పనిచేసే ఇతర పరికరాల్లోనూ వినియోగించుకోవడానికి అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొంటున్నారు.