Largest Radio Telescope SKAO: టెక్నాలజీ పరంగా రోజురోజుకూ అందనంత ఎత్తుకు ఎదుగుతోన్న మానవాళికి..ఈ సృష్టిలో ఇప్పటికీ సమాధానాలు దొరకని, అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఛేదించేందుకు తాజాగా... ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 30 ఏళ్లుగా దీని కట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. డిజైన్, అన్ని రకాల అనుమతులు దొరకడంతో జూలై మొదటి వారంలో పనులు మొదలయ్యాయి. ఈ టెలిస్కోప్‌కు ‘ద స్క్వేర్ కిలోమీటర్ ఆరే అబ్జర్వేటరీ(ఎస్‌కేఏఓ)’ అనే పెరుపెట్టారు. దీన్ని రెండువందల అతిపెద్ద డిష్ రిసీవర్‌లు, కోటీ ముప్పయి వేల చిన్న యాంటెనాలతో నిర్మిస్తున్నారు. దీంతో ఇప్పుడున్న టెలిస్కోప్‌లకంటే పదిరెట్ల అధిక సామర్థ్యంతో కాస్మోస్‌ను అధ్యయనం చేయడానికి వీలవుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ కలిగిన ఈ టెలిస్కోప్ 70 మెగాహెడ్జ్‌ల నుంచి 25 గిగా హెడ్జ్‌ల రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను వినగలదు. దీన్ని రెండు ఖండాల్లో నిర్మించడం విశేషం. ఎస్‌కేఏ మధ్యశ్రేణి వ్యవస్థను దక్షిణాఫ్రికాలోని కరూ ఎడారిలో 50 అడుగుల వ్యాసార్థం గలిగిన 197 డిష్‌లతో, తక్కువ శ్రేణి ఫ్రీక్వెన్సీని వినగలిగే వ్యవస్థను 1,32,072 యాంటెనాలతో పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పాటుచేయనున్నారు. ఈ టెలిస్కోపు దాదాపు యాభైఏళ్లు క్రీయాశీలకంగా పనిచేయనుంది. ఎస్‌కేఏఓ సైన్స్ వర్కింగ్ గ్రూప్‌లో 40 దేశాలకు చెందిన వెయ్యిమందికిపైగా శాస్త్రవేత్తలున్నారు.
ఈ భారీ రేడియో టెలిస్కోప్ విజ్ఞాన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి వీరంతా కృషిచేస్తున్నారు. ఈ విశ్వంలో జీవం ఎలా ఉద్భవించింది, గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి, ఇతర గ్రహాల లోగుట్టు ఏంటి వంటి అనేక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకోనున్నారు. టెలిస్కోప్ ఏర్పాటుకు రెండు బిలియన్ డాలర్లు(రూ.14,928 కోట్లు) ఖర్చు అవుతాయని ప్రస్తుత అంచనా. 2029 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ, 2024 నుంచే శాస్త్రీయ పరిశోధనలను ప్రారంభించనున్నారు.
ఏడు దేశాలు కలిసి..
ఈ ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్‌లు నిధులు సమకూరుస్తున్నాయి. ఇండియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియాలు.. పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ టెలిస్కోప్ రూపకల్పనలో పాల్గొననున్నాయి. ‘ప్రపంచంలోనే భారీ టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభమైనందుకు నేను ఉద్విగ్నభరితుణ్ణయ్యాను. ఈ క్షణం కోసం 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఈ టెలిస్కోప్ ద్వారా విశ్వంలో మనల్ని వేధిస్తోన్న అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది’ అని చెప్పారు ఎస్‌కేఏఓ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ ఫిలిప్ డైమండ్.
Comments
Please login to add a commentAdd a comment