ఎందుకిలా జరిగింది ?
* ఓటమిపై టీ-కాంగ్రెస్ నేతలకు రాహుల్ ప్రశ్న
* ప్రజలతో మమేకం కాలేదని మాజీ ఎంపీలపై ఆగ్రహం
* తెలంగాణలోనూ అవే ఫలితాలా?
* ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినా గెలవలేదని అసంతృప్తి
* పోరాడిన మీరెలా ఓడారన్న సోనియా
* వైఫల్యాలపై విశ్లేషణ వినిపించిన బృందం
* ప్రజలకు నిజాలు చెప్పలేకపోయాం, అబద్ధాలు ఆడలేకపోయాం
* సమన్వయం లేకనే ఓటమి అంటూ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుని ఢిల్లీకి వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ కోసం పోరాడిన వారు సైతం ఓడిపోవడమేంటని ఒకింత ఆశ్చర్యపడింది. ముఖ్యంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారం ఖాయమని భావిస్తే.. ఊహించని ఫలితాలు రావడంపై పెదవి విరిచారు. ఇందుకు అభ్యర్థుల వైఫల్యాలే ప్రధాన కారణమని ఆగ్రహించినట్లు సమాచారం. లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తర్వాత తొలిసారి ఢిల్లీకొచ్చిన టీ-కాంగ్రెస్ మాజీ ఎంపీలు, ఓ ఎంపీ శుక్రవారం ఉదయం రాహుల్‌ని ఆయన నివాసంలో కలిశారు. రాహుల్ నాయకత్వంలో భవిష్యత్తు పోరాటానికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవడంలో పార్టీ నేతలు విఫలమయ్యారని రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘తెలంగాణలోనూ అవే ఫలితాలు ఎందుకు వచ్చాయి? ఎందుకిలా జరిగింది? అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం కదా? 17 మంది ఎంపీలను ఇస్తామన్నారు.. ఎన్ని సీట్లు గెలిచారు?’ అంటూ రాహుల్ ప్రశ్నలు సంధించారు. దీనికి బృంద సభ్యులు అనేక కారణాలను వినిపించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనన్న సందేశాన్ని సమర్థంగా వినిపించలేకపోయామని, అందుకు తమతోపాటు పార్టీ రాష్ట్ర నేతలంతా బాధ్యులేనని పేర్కొన్నారు. ప్రజలకు నిజాలు చెప్పలేకపోయామని, అబద్ధాలు ఆడలేకపోయామని, ఫలితంగా ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యామని విశ్లేషించారు. ముఖ్యంగా పార్టీలో సమన్వయం కొరవడిందని, తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఎవరికి వారే అన్న చందంగా ప్రవర్తించారని వివరించారు.
అధిష్టానం తెలంగాణలో ఒకే నాయకుడిని పార్టీ పెద్దగా ముందుంచితే బాగుండేదని, పది, పన్నెండు మంది ముఖ్యమంత్రి అభ్యర్థుల్లా వ్యవహరించడంతో పార్టీకి దిశానిర్దేశం లేకుండా పోయిందని వాపోయారు. అలాగే అభ్యర్థుల ఎంపికలో ప్రత్యర్థుల బలాబలాల్ని పసిగట్టలేకపోవడం, ఎంపీ అభ్యర్థులు సూచించిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోవడం వంటి పరిణామాలు ఓటమికి కారణమయ్యాయని వివరించినట్టు సమాచారం. భవిష్యత్తు పోరాటంలో మీ వెంటే ఉంటామని, తెలంగాణ కోసం పోరాడినట్టే పార్టీ పునర్నిర్మాణం కోసం పోరాడుతామని రాహుల్‌కు వివరించినట్టు తెలిసింది. అయితే ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ ఆయన మాత్రం సంతృప్తి చెందలేదు. ‘మీరు మీ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం కాలేకపోయారు. కార్యకర్తలకు కూడా దగ్గరకాలేకపోయారు. వారిని విశ్వాసంలోకి తీసుకుని ఉంటే ఫలితాలు ఇలా ఉండేవి కావు. వెళ్లి అధ్యక్షురాలిని కలవండి’ అని సూచించారు.
లోటుపాట్లను ముందే ఎందుకు చెప్పలేదు?: సోనియా
దీంతో సాయంత్రం ఐదు గంటలకు ఈ బృందం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిసింది. కలిసిన వెంటనే మాజీ ఎంపీలంతా ముందుగా క్షమాపణలు కోరారు. తెలంగాణ ఇస్తే అత్యధిక స్థానాలు గెలుచుకొస్తామని మాట ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సోనియా స్పందిస్తూ.. ‘తెలంగాణ కోసం పోరాడిన మీరెలా ఓడారు? మీరు కచ్చితంగా గెలుస్తారనుకున్నాం’ అంటూ సానుభూతి కన బరిచినట్టు సమాచారం. ‘మీరు తెలంగాణ అడిగారు.
దానికోసం పోరాడారు. కానీ అక్కడ పార్టీ పరిస్థితిపై, లోటుపాట్లపై ఎప్పుడూ చెప్పలేదు. ముందే చెబితే పరిస్థితి మరోలా ఉండేదేమో!’ అని విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని సూచించారు. సోనియా, రాహుల్‌ను కలిసిన వారిలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ షెట్కార్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేశ్ జాదవ్‌లు ఉన్నారు.
మా పోరాటం ఆగదు..
రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఈ బృందం విలేకరులతో మాట్లాడింది. ‘2009 నుంచి తెలంగాణ బిల్లు పాసయ్యేంతవరకు సభలో, బయట అవిశ్రాంత పోరాటం జరిపాం. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు ఎందుకు ఈ శిక్ష వేశారో అర్థంకావడం లేదు. పోరాడినందుకా లేక తెలంగాణ సాధించినందుకా? 12 మంది కాంగ్రెస్ ఎంపీల్లో ఒక్కరినే గెలిపించారు. తెలంగాణ ప్రజల తీర్పు చాలా బాధ కలిగించింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి సీమాంధ్రలో పార్టీ దెబ్బతింటుందని తెలిసినా ఇచ్చిన మాట కోసం సోనియా... తెలంగాణ ఇస్తే చివరికి తీర్పు ఇలా వచ్చింది.
అయినా ప్రజల కోసం మా పోరాటం ఆగదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాల్లో సభలోనూ, బయటా పోరాడుతాం’ అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాధనలో మా పోరాటం.. ఆరాటం చరిత్రలో నిలుస్తుంది. సీట్ల కోసం, ఓట్ల కోసం విభజించలేదు. దాన్ని అందరూ గమనించాలి. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటూ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. తెలంగాణ కోసం ఏమాత్రం పోరాడని టీడీపీ, వైఎస్సార్సీపీలకు సైతం తెలంగాణ ప్రజలు ఓటేశారు. కానీ మాకెందుకు వేయలేదన్నదే మా బాధ’ అని పేర్కొన్నారు.
‘ఓడిపోయినా మా బాధ్యత మరువం. బంగారు తెలంగాణ కాంక్షించిన అమరవీరుల ఆశయాల కోసం అనునిత్యం పోరాడుతాం. తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చండని, తెలంగాణ ప్రజలు మీ వెంట ఉంటారని అధిష్టానాన్ని నమ్మించాం. కానీ మేం మాట నిలబెట్టుకోలేకపోయాం. అందుకు చింతిస్తున్నాం. క్షమాపణలు చెబతున్నాం’ అని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. ఇకపై అకుంఠిత దీక్షతో ఐక్యంగా ముందుకు సాగుతామని సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. ‘నేను ఓడిపోయినందుకు బాధలేదు. టీఆర్ఎస్లో ఉంటేనే గెలుస్తావన్నారు. కానీ తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్‌లోకి తిరిగి రావడమే న్యాయమనిపించింది. అందుకు నేను సంతోషంగానే ఉన్నా’ అని వివేక్ తెలిపారు. జూన్ 2న అపాయింటెడ్ డే సందర్భంగా తెలంగాణ పండగ జరపాలని, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్సేనని ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు టీ-కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.