తప్పుగా అర్థం చేసుకున్నారు
న్యూఢిల్లీ: ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలతో క్రికెట్ విశ్వసనీయత దెబ్బతింటుందనే తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకున్నాయని భారత జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ‘నేనన్న మాటలను కొంతమంది మరో రకంగా అర్థం చేసుకోవడం నిరాశ కలిగించింది’ అని ద్రవిడ్ చెప్పినట్టు ‘క్రిక్ ఇన్ఫో’ వెబ్సైట్ ట్వీట్ చేసింది. అలాగే విశ్వసనీయత గురించి ద్రవిడ్ చెప్పిన మాటల సారాంశాన్ని అర్థం చేసుకోవడంలో గందరగోళం నెలకొందని, పూర్తి ఇంటర్వ్యూ కోసం బుధవారం వరకు వేచి ఉండాలని కోరింది.
ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ కారణంగా నెలకొన్న పరిస్థితుల గురించి ఆవేదన చెందిన ద్రవిడ్... ఆటపై విశ్వసనీయత పెరిగేలా ఆటగాళ్లు, పరిపాలకులు ప్రయత్నించాలని సూచించాడు. అభిమానుల కారణంగానే తామంతా ఈ స్థాయిలో ఉన్నామని గుర్తుచేశాడు. క్రికెట్ పాలకులు కూడా ఆటగాళ్లు, అభిమానుల వల్లే ఆటను ముందుకు తీసుకెళుతున్నారని, అందుకే క్రికెట్ బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా విశ్వసనీయతతో పనిచేయాల్సి ఉంటుందన్నాడు.