మొక్కలో ఊపిరి పోసుకొని...
ఓ మనిషి చనిపోయాక అతను చిహ్నంగా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శాశ్వతంగా గుర్తుండిపోవాలంటే ఏం చేయాలి? వాళ్లకో స్మారకం కట్టాలి. అందుకు ఎంతో ఖర్చవుతుంది. ఆ అవసరం లేకుండా చనిపోయిన వ్యక్తి ఏదో రూపంలో ఓ జ్ఞాపకంగా కనిపిస్తే.. ఇదే ఇటలీకి చెందిన డిజైనర్లు రాహుల్ బ్రెడ్జెల్, అన్నా సిటెల్లీలకు వచ్చిన ఓ మంచి ఐడియా. వెంటనే వారు సేంద్రియ పదార్థాలతో కోడి గుడ్డు ఆకారంలో ఉండే ఓ శవ పేటికను తయారు చేశారు. ఈ పేటికలో వ్యక్తి మృతదేహాన్ని లేదా అంత్యక్రియల అనంతరం వారి అస్థికలను పెట్టి, వాటిలో తమకిష్టమైన మొక్క విత్తనం నాటి భూమిలో పాతిపెడితే కొంత కాలానికి ఆ పేటిక నుంచి భూమిపైకి విత్తు మొలకెత్తుతుంది. అది కాస్తా మొక్కై పెరుగుతుంది.
అలా మనల్ని వీడిని వ్యక్తి జ్ఞాపక చిహ్నంగా శాశ్వతంగా నిలిచిపోతుంది. డిజైనర్లు ఇటలీ భాషలో ’క్యాప్సులా ముండీ (ప్రపంచ క్యాప్సుల్)’గా పిలుస్తున్న ఈ శవపేటికను తయారు చేయడానికి సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తారు. మానవ అస్థికలు కూడా మొక్కలకు బలాన్ని ఇస్తాయి కనుక మనం నాటే విత్తనాలు చెట్లుగా మంచిగా ఎదుగుతాయని వారు చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు శ్మశానాలను పచ్చటి వనాలుగా మారుస్తున్న నేటి కాలంలో మృతదేహాలే వృక్షాలుగా పెరగడం అద్భుతమని డిజైనర్లు అంటున్నారు. తాము అస్థికలను పెట్టి విత్తును నాటే పేటికలనే తయారు చేశామని, ఇకముందు మృతదేహాలను పెట్టే పేటికలను తయారు చేస్తామన్నారు.