Rain Water Harvesting System
-
‘ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇది సరైన సమయం’
సాక్షి, హైదరాబాద్ : ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదని, ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు పిలుపునిచ్చారు. వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, ఇందుకు ప్రజలంతా కలిసి రావాలన్నారు. ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణపై కార్యక్రమాలు చేపట్టాలని, ఈ వేసవి కాలంలో సంరక్షణ కార్యక్రమాలు చేపడితే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను ఇస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని జలమండలి నిర్మించిన థీమ్ పార్కును సందర్శించిన మంత్రి, అక్కడ జలమండలి చేపట్టిన ప్రాజెక్టులపై, బోర్డు కార్యకాలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జలమండలి రూపొందించిన రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ థీమ్ పార్కు.. విద్యార్థులు, నగరవాసులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. (ఫ్యాన్ అత్యుత్సాహం: కేటీఆర్ ఏమన్నారంటే..) ఇదే సరైన సమయం జలమండలి రూపొందించిన దాదాపు 42 నీటి సంరక్షణ నమానాలు, పద్ధతులు విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. నేడు నీటిని సంరక్షిస్తేనే రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు నీటి ఇక్కట్లు ఉండవని తెలిపారు. అలాగే ఇప్పడు ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణపై పెద్ద ఎత్తున తగిన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లో వర్షాకాలానికి ముందే చైతన్యం తీసుకువచ్చేందుకు ఇది సరైన సమయం అని కేటీఆర్ తెలిపారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను ఇస్తాయని, భూగర్భ నీటి మట్టాలు పెరుగుతాయని తెలిపారు. (కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారుతో కేటీఆర్ భేటీ ) జలమండలి తన వంతు పాత్ర పోషిస్తుంది థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన పలు రకాల నమానాలను మంత్రి తిలకించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ అభివృద్దిలో జలమండలి తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిందని, ఇంకా స్వయం సమృద్ది సాధించడానికి, నగరవాసులకు మెరుగైన సేవల కోసం జలమండలి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.అలాగే జలమండలి ప్రధాన నగరంలో మంచినీటి సరఫరా చేసిన జలమండలి ఓఆర్ఆర్ గ్రామాల్లో సైతం మంచినీటి సరఫరా చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం ఓఆర్ఆర్ ప్రాజెక్టును 193 గ్రామాల్లో పనులు చేపట్టి, మంచినీటి సరఫరా చేపడుతుందని కేటీఆర్ వివరించారు. (ఢిల్లీ అల్లర్లు: ఆ తల్లి పిల్లలతో సహా..!) వేసవికాలంలో ఓఆర్ఆర్ గ్రామాల్లో నీటి ఇక్కట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అలాగే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ శివారు మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న సెవరెజీ నిర్వహణను మార్చి 1 నుంచి జలమండలి చేపడుతుందని తెలిపారు. విషయంలో పక్కా ప్రణాళికతో అయా ప్రాంతాల్లోని సెవరెజీ నిర్వహణకు సన్నద్దం కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, జలమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు. -
కందకాలు తవ్వితే చెట్లు పచ్చబడ్డాయి
కోనేరు సురేశ్‌బాబు విజయనగరం జిల్లా ఆలూరు మండలం కందుల పదం గ్రామపరిధిలో 13 ఎకరాల్లో పామాయిల్ తోటను పదిహేనేళ్లుగా సాగు చేస్తున్నారు. పామాయిల్ చెట్టుకు రోజుకు 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. వెంగళ్రావు సాగర్ డ్యామ్ దగ్గర్లోనే సురేశ్‌బాబు వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. గుడ్డవాగు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్ అందుబాటులో ఉండటం వల్ల బోర్ పుష్కలంగా నీరు పోస్తూ ఉంటుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కరెంటు ఉన్న సమయంలో గతంలో డ్రిప్ ద్వారా అనుదినం నీరందించేవారు. అయితే, భూమి తేలిక నేల కాకపోయినప్పటికీ ఎత్తుపల్లాలుగా ఉండటం వల్ల కొన్ని చోట్ల చెట్లకు సరిగ్గా నీరందక ఇబ్బందులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కందకాలు తీయిస్తే ఎక్కడి వర్షపు నీరు అక్కడే ఇంకి, వేసవిలోనూ చెట్లకు, దిగుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న భావనతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించి గత మేలో కందకాలు తీయించారు. పామాయిల్ చెట్ల మధ్య 9 మీటర్ల దూరం ఉంటుంది. చెట్లకు సమాన దూరంలో మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన తర్వాత డ్రిప్ వాడటం మానేశారు. కందకాల ద్వారానే బోరు నీటిని పారిస్తున్నారు. పామాయిల్ చెట్ల మట్టలను కందకాల్లో వేశారు. అవి క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారుతున్నాయి. నీటికి కొరత లేకపోయినా ముందు చూపుతో సురేశ్‌బాబు వాన నీటి సంరక్షణ కోసం కందకాలు తవ్వించడం విశేషం. కందకాలు తవ్విన తర్వాత చెట్లు మరింత పచ్చగా, కళగా ఉంటున్నాయని ఆయన గుర్తించారు. ఇరుగు పొరుగు రైతులు కూడా ఈ మార్పును గుర్తించారని ఆయన తెలిపారు. భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఎండాకాలంలో నీరు వెనకా ముందు అయినాæచెట్లకు ఇబ్బందేమీ ఉండబోదని సురేశ్‌బాబు (97017 50189) ఆశాభావంతో ఉన్నారు. -
నేడు కందకాలపై సదస్సు
వైఎస్సార్ జిల్లా సొండిపల్లి మండలం ముడుంపాడు పంచాయతీ ఆరోగ్యపురం సమీపంలోని కత్తిరాళ్లబండ వద్ద గల డా. జనార్థన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 25న ఉ. 9.30 గం.కు స్వల్ప ఖర్చుతో కందకాల ద్వారా వాననీటి సంరక్షణపై అవగాహన సదస్సు జరగనుంది. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి(99638 19074), ఉపాధ్యక్షుడు ముత్యంరెడ్డి(94419 27808) అవగాహన కల్పిస్తారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. వెంకటేశ్వరరెడ్డి– 82473 85931 -
పథకం అదే పేరే మారుతోంది..
శ్రీకాకుళం: ఇంకు గుంటల పథకానికి పేరు మార్చి మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2004 ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వర్షం నీరు వృధా కాకుండా ఉండేందుకు ఇంకుడు గుంటల పథకాన్ని ప్రారంభించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పాఠశాల్లోనూ ఇటువంటి ఇంకుడు గుంటలను ప్రారంభించారు. అప్పట్లో కోట్లాది రూపాయలు వెచ్చించినా అవి బూడిదలో పోసిన పన్నీరే అయింది. అటువంటి గుంటలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ఇటువంటి పథకాలు అవసరమే అయినప్పటికీ చిత్తశుద్ధి కొరవడడంతో కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. ఇటువంటి పథకానికి మళ్లీ పేరు మార్చి ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్’ పేరిట మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.