rajapur
-
లారీతో తొక్కించేశారు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ రాజాపూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ పొలాల మీదుగా ఇసుక వాహనాలు నడపొద్దన్న పాపానికి ఓ పేద రైతును ఇసుకాసురులు లారీ టైర్ల కింద తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రాజాపూర్ మండలం తిర్మలాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తిర్మలాపూర్‌కు చెందిన గుర్రంకాడి నర్సింలు(38)కు గ్రామశివారులో ఎకరం పొలం ఉంది. దాని పక్కనే దుందుభి వాగు ఉంది. ఇసుక మాఫియా అక్కడ ఇసుకను తీసి ఫిల్టర్ చేసి టిప్పర్లు, లారీల ద్వారా రైతుల పొలాల మీదుగా హైదరాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ పది ట్రిప్పుల ఇసుక తరలుతోంది. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు పడిపోయి సాగుకు నీరందని పరిస్థితి నెలకొనడంతో పరిసర పొలాల రైతులు గతంలో ఎన్నోమార్లు ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. అధికారులకు సైతం ఎన్నోమార్లు íఫిర్యాదు చేసినా అక్రమరవాణాకు అడ్డుకట్ట పడలేదు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తన పొలం మీదుగా వెళ్తున్న టిప్పర్‌ను నర్సింలు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇసుక అక్రమార్కులు అదే వాహనం టైర్ల కింద నర్సింలును తొక్కించేసి హత్య చేశారు. హత్యపై భగ్గుమన్న మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నర్సింలు చావుకు కారణమైనవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ శ్రీధర్ పరిశీలించారు. హంతకులను చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రంగంలో అధికార పార్టీ నాయకుడు? నర్సింలు హత్యపై కోపోద్రిక్తులైన గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనాస్థలానికి చేరుకున్న సదరు నాయకుడు మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు కాకుండా చూసేందుకు యత్నిస్తున్నాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని మండిపడిన గ్రామస్తులు ఇసుక రవాణా వద్దని వారించిన తమపై మాఫియా అనేకసార్లు దౌర్జన్యం చేసిందని భగ్గుమన్నారు. అదే గ్రామానికి చెందిన తో నేత అండదండలు ఇసుక మాఫియాకు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఇసుక లారీ యజమానులు మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా బరితెగిస్తోందనే ఆరోపణలున్నాయి. -
పాదచారులపైకి దూసుకెళ్లిన ఇన్నోవా.. ముగ్గురు మృతి
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం కుచ్చెర్కల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పాదచారులపైకి ఇన్నోవా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మగ్గురు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రంగయ్య, యాదగిరి, చంద్రయ్యలుగా గుర్తించారు. అయితే ఇన్నోవా వాహనంలో ఉన్నవారు మాత్రం ప్రమాదం జరిగిన పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ వాహనాన్ని వెంబడించిన పలువురు యువకులు రంగారెడ్డిగూడ వద్ద దానిని అడ్డగించారు. అనంతరం ఆ వాహనాన్ని రాజాపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
మోక్షం కలిగేనా?
సాక్షి, రాజాపూర్: మండలంలోని రంగారెడ్డిగూడ శివారులో ఉన్న రైౖల్వేగేట్ వద్ద అండర్ బ్రిడ్జి లేక వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేట్లు ఉన్న స్థానంలో అండర్ వే నిర్మించి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. మండల కేంద్రం నుంచి మల్లేపల్లికి వెళ్లేదారిలో ఉన్నా రైల్వేగేట్‌ను తొలగించి దాని స్థానంలో అండర్ బ్రిడ్జి నిర్మించారు. ఇక్కడ నిర్మించినట్లుగానే రంగారెడ్డి గూడా వద్ద నిర్మిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పట్లో అండర్ బ్రిడ్జికి మోక్షం లేనట్లేనని అనిపిస్తుంది. గతంలో రైళ్లు చాలా తక్కువగా తిరిగేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తుండడంతో, ప్రతి సారి రంగారెడ్డిగూడ వద్ద ఉన్న గేట్‌ను వేయడంతో అటు నుంచి వెళ్లే కల్లేపల్లి, అగ్రహారం పొట్లపల్లి, గుండ్లపొట్లపల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అదనంగా డబుల్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు చకచక పనులు సాగుతున్నాయి. డబుల్ లైన్ పూర్తయితే మరిన్ని రైళ్లు తిరిగే అవకాశం ఉంది. దీంతో రంగారెడ్డిగూడవద్ద అండర్‌బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మించాల్సిన అవసరం ఎంతైన ఉంది. గతంలో రైల్వేశాఖ అధికారులు సర్వే నిర్వహించి అండర్ వే నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు. ఇప్పటి వరకు పనులు మొదలు కాకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులకు వినతులు ఇచ్చాం రైల్వే గేట్ స్థానంలో అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఇక్కడికి వచ్చిన అధికారులకు వినతులు ఇచ్చాం. అండర్ బ్రిడ్జి ఇక్కడ చాలా అవసరం. గ్రామసభలో కూడా తీర్మానం చేసి రైల్వేశాఖ అధికారులకు పంపిస్తాం. గొల్లపల్లి, రాజాపూర్, పెద్దాయపల్లి గ్రామాల వద్ద రైల్వేగేట్ల స్థానంలో నిర్మించినట్లుగానే రంగారెడ్డిగూడ వద్ద ఉన్న రైల్వేగేట్ స్థానంలో ఖచ్చితంగా అండర్ బ్రిడ్జిని నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలి. – జనంపల్లి శశికళ, సర్పంచ్, రంగారెడ్డిగూడ -
పొట్టకూటి కోసం వచ్చి.. పరలోకానికి!
సాక్షి, రాజాపూర్ (జడ్చర్ల): పొట్ట కూటి కోసం సొంత ఊరుని వదిలి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఏఎస్ఐ యాదయ్య కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దిలీప్‌కుమార్‌సా(22), జితేందర్‌కుమార్(27)తో పాటు మరో ఐదుగురు యువకులు కేరళ రాష్ట్రంలోని ఏర్నాకులంలో కేబుల్ పనులు చేసేందుకు హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి 10 గంటలకు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. దిలీప్‌కుమార్, జితేందర్‌కుమార్ మృతదేహాలు అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం రంగారెడ్డిగూడ శివారులో అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుడిపక్క టైర్ పంక్చర్ కావడంతో దిలీప్‌కుమార్, జితేందర్‌కుమార్ కిందకి దిగి మరో టైర్ మార్చుతుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్‌కుమార్‌కు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందిగా.. జితేందర్‌కుమార్‌ను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. దీంతో మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు ఇన్నోవా వాహనం డ్రైవర్ ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
ఎదురుచూపులు ఎన్నాళ్లు..!
రాజాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతినెలా అందించే ఆసరా పింఛన్లు మండలంలోని కొన్ని గ్రామాల్లో మూడు నెలలుగా అందడంలేదు. బయోమెట్రిక్ విధానంలో కొన్ని సాంకేతిక లోపాలు, మిషన్లకు సరిగ్గా సిగ్నల్స్ అందక లబ్ధిదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. పింఛన్ వస్తుందన్న నమ్మకంతో తెలిసిన వారితో అప్పు సప్పు చేసి కాలం నెట్టుకొస్తుండగా.. నెలల తరబడి పింఛన్ అందకపోవడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పింఛన్లు అందక ఆందోళన ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 అందజేస్తుంది. రాజాపూర్, బాలానగర్ ఉమ్మడి మండలాల్లో మొత్తం 7,464 మందికి ఆసరా పింఛన్ల లబ్ధిధారులు ఉన్నారు. అందులో వయోవృద్ధులు 2,459మంది, వితంతువులు3,611 మంది, వికలాంగులు914, గీతా కార్మికులు 118, నేత కార్మికులు111, ఒంటరి మహిళలు, 250 మంది ఉన్నారు. వీరందరికి ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.95,48,500 పంపిణీ జరుగుతోంది. కానీ, గత మూడునెలలుగా అధికారుల అలసత్వమో, ప్రభుత్వ నిర్లక్షమోకాని ప్రతి నెల అందాల్సిన ఆసరా పింక్షన్లు మూడునెలలు అయినా అందడంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్స్ లేక.. ఇదిలాఉండగా, గతంలో గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఆసరా పింఛన్లు నేరుగా అందజేసేవాళ్లు. అయితే గత కొన్ని నెలలుగా పోస్టాఫీస్‌ల ద్వారా లబ్ధిదారులకు అకౌంట్లు తెరిపించి, ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకోకూడదనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ ద్వారా అందజేస్తున్నారు. అయితే, గ్రామాల్లో బయోమెట్రిక్ మిషన్లకు సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. అన్ని గ్రామాల్లో పోస్టాఫీస్‌లు లేకపోవడంతో ఉన్న ఒక్క పోస్ట్‌మన్‌కు రెండు మూడు గ్రామాల పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పజెప్పడంతో ఆలస్యమవుతుందని ఆరోపిస్తున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్లు తీసుకోకపోతే లబ్ధిదారుడి పేరు తొలగిస్తారని, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా పింఛన్ అందలే.. ఆసరా పింఛన్ అందక మూడునెలలు అయ్యింది. ప్రతి నెలా పింఛన్ వస్తే కాస్త ఆసరాగా ఉండేది. మూడు నెలలుగా ఎ ప్పుడిస్తారో అంటూ ఎదురుచూస్తున్నా ం. గతంలోలాగా మా ఊర్లో పింఛన్లు అందిస్తలేరు. మా ఊళ్లో పోస్టాఫీస్ లేదు. కుచ్చర్కల్ పోయి తెచ్చుకోవాలే. – మహ్మద్‌జాఫర్, దివ్యాంగుడు వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం మూడు నెలలుగా కొన్ని గ్రామాల్లో ఆసరా పింఛన్లు అందడంలేదని ఇటీవల తెలిసింది. ఆ గ్రామాల్లో నెట్వర్క్ సమస్య ఉంది. వీలైన ంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం. లబ్ధిదా రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పింఛన్ నుంచి పేర్లు తొలగించం. ఈ నెల పింఛన్ అందిస్తాం. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ, రాజాపూర్ -
గుర్తుతెలియని యువకుడి మృతదేహం స్వాధీనం
నారాయణపేట రూరల్ : ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట మండలంలోని జాజాపూర్ శివారులో శనివారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి (30) మృతదేహం బాటసారులకు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ సాయికుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఒంటిపై గులాబీ గీతలతో తెల్లచొక్కా, నీలిరంగు ప్యాంటు ఉన్నాయి. ఈ యువకుడు ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు. అక్కడి ఆనవాళ్లను బట్టి వారంరోజుల క్రితమే మద్యంలో క్రిమిసంహారక మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త నారాయణపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.