Rajasri
-
ఈ చట్టాలు ఎవరి చుట్టాలు?
నక్సల్స్‌తో సంబంధాలున్నాయని, ప్రధాని హత్యకు కుట్రపన్నారని చేసిన ఆరోపణల ఆధారంగా కోర్టులో హక్కుల ఉద్యమ నేతలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి, వారిపై అభియోగాలు రుజువుకావడం లేదా కాకపోవడానికి ముందు పాలకపక్షానికి భారీగా రాజకీయ ప్రయోజనాలు దక్కుతాయి. తమను వ్యతిరే కించే, ప్రశ్నించే, లేదా అసమ్మతి ప్రకటించే వారికి భయోత్పాతం కలిగించే రీతిలో హెచ్చరించడానికే యూఏపీఏ చట్టం కింద అభియోగాలు నమోదు చేస్తారు. ఈ తరహా వేధింపుల చట్టాలు పాలకపక్షానికి రాజకీయ ప్రయోజనం కలిగిస్తాయి. ఈ కేసుల్లో చిక్కుకున్న వారు ఏళ్ల తరబడి విచారణ పేరుతో నిర్బంధంలో మగ్గిపోతుంటారు. చట్టాన్ని తన పని తనను చేసుకోనివ్వండి, అని ఈ రోజుల్లో కొందరు తెలివిగా చెబుతారు. వాస్తవానికి దాడులు, బెదిరింపులు, అరె స్టులతో వేధింపుల ఆట మొదలవుతుంది. చట్టాన్ని ఇష్టమొచ్చినట్టు వంచి తమకు అనుకూలంగా వాడు కుంటారు పాలకులు. మంచి, చెడు మధ్య, చట్ట బద్ధ మైన, చట్ట వ్యతిరేక ప్రవర్తన మధ్య సాక్ష్యాధారాలను బట్టి ఏది న్యాయమైనదో తేల్చడంపైనే చట్టాల అమలు ఆధారపడి ఉంటుంది. ఇటీవల పుణె పోలీ సులు అరెస్టు చేసిన ఐదుగురు హక్కుల ఉద్యమ నేతలు సుధాభరద్వాజ్, గౌతమ్నవలాఖా, అరుణ్ ఫెరీరా, వరవరరావు, వర్నన్ గొన్సాల్వ్స్‌పై చేసిన ఆరోపణలను బట్టి వారికి నక్సల్స్‌తో సంబంధా లున్నాయని లేదా భీమా కోరేగావ్ హింసలో వారికి పాత్ర ఉందని లేదా వారంతా కలిసి ప్రధాని హత్యకు కుట్రపన్నారని అనుకోవాలి. కాని, కోర్టులో వారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి. వారిపై అభియోగాలు రుజువుకావడానికి లేదా కాక పోవడానికి ముందు పాలకపక్షానికి భారీగా రాజ కీయ ప్రయోజనాలు దక్కుతాయి. తమను వ్యతిరే కించే, ప్రశ్నించే, లేదా అసమ్మతి ప్రకటించేవారికి భయోత్పాతం కలిగించే రీతిలో హెచ్చరించడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగాలు నమోదు చేస్తారు. అయితే, నేరం నిరూపించడానికి లేదా నిరూపించ లేకపోవడానికి అంత ప్రాధాన్యం ఉండదు. ఉగ్రవాద చర్యలు, సంస్థలు, దేశ ఆర్థిక భద్రతకు ముప్పు తెచ్చే నేరాలూ–ఇవన్నీ యూఏపీఏ పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకుంటే పోలీసు కస్ట డీలో గరిష్ట కాలం ఉంచవచ్చు. 180 రోజుల వరకూ చార్జిషీటు దాఖలు చేయకపోయినా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. అంతేగాక దీని కింద అరెస్టయిన వారికి బెయిలు దొరకడం కష్టం. రుజువుకాని సంబం ధాలపై ఆధారపడి చేసే అభియోగాలను బట్టి నింది తులను దోషులుగా ప్రకటించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. 2007లో యూఏపీఏ నిబంధనల కింద అరెస్టుచేసిన వర్నన్ గొన్సాల్వ్స్‌పై మొత్తం 17 అభియోగాలు నమోదు చేశారు. వీటన్నిటి నుంచి నిర్దోషిగా బయటపడటానికి ముందు ఆయన తన జీవితంలో ఆరేళ్లు జైల్లో గడపాల్సివచ్చింది. కాబట్టి యూఏపీఏ కింద అరెస్టయినవారు ఎవరైనా ఇలాంటి కష్టాలు తప్పవు. మహ్మద్ అమీర్‌ఖాన్ ఈ చట్టం కింద చేసిన 18 ఆరోపణల నుంచి విముక్తి పొంద డానికి 14 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఇంకా మహ్మద్ అబ్దుల్ కలీం వంటి వేలాదిమంది తమ జీవితాల్లో కీలకమైన సమయాన్ని కారాగారాల్లోనే గడపాల్సి వచ్చింది. ఇలాంటి తీర్పులు వచ్చేనాటికి ఈ చట్టం కింద నిర్బంధంలో గడిపిన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా నీరసించిపోతారు. యూఏపీఏ కింద అరెస్టు చేయడమే.. నిందితులకు తర్వాత ఎదురయ్యే నిర్బంధం కారణంగా ఓ తరహా క్రమశిక్షణలా, అదుపు చేసే టెక్నాలజీలా పనిచేస్తుంది. ఆగస్టు 28న పైన చెప్పిన ఐదుగురు ప్రముఖులను అరెస్ట్ చేయ డానికి ముందు జూన్‌లో ఐదుగురిని మహారాష్ట్ర పోలీ సులు అరెస్ట్ చేశారు. జనవరి ఒకటిన భీమా కోరే గావ్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించే ఈ అరెస్టులూ జరిగాయి. గత మూడు నెలల్లో అరెస్టు చేసిన ఈ పది మంది, రెండు మూడేళ్లలో అరెస్టయిన అనేక మంది కూడా ప్రజల కోసం పనిచేసే ఉద్యమ కార్యకర్తలు, లాయర్లు, జర్నలిస్టులు, విద్యావేత్తలు. దేశంలో అత్యంత బలహీన స్థితిలో ఉన్న బడుగు వర్గాలైన ఆదివాసీలు, దళితులు, విచారణ ఖైదీల తర ఫున వారు చట్టబద్ధ పోరాటాలు చేస్తున్నారు. జూన్‌లో అరెస్టయినా చార్జిషీట్ పెట్టలేదు! యూఏపీఏ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న కేసుల్ని పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమౌతాయి. భీమా కోరేగావ్ హింసను సాకుగా చూపి జూన్‌లో అరెస్ట్ చేసిన ఐదుగురిపై ఇంతవరకు అభియోగ పత్రం దాఖలు చేయలేదు. ప్రధానమంత్రి హత్యకు సంబంధించిన కుట్ర కేసులో దర్యాప్తును మూడు నెలలైనా పూర్తి చేయకపోవడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఒకవేళ నిందితులపై చేసిన అభియో గాలకు సాక్ష్యాధారాలు సరిగ్గా దొరక్కపోతే రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆధారాలు లేకుండా కొందరిని ఎందుకు లక్ష్యంగా చేసుకుని వారిని జైళ్లలో పెట్టారు? వారు ‘పట్టణ నక్సల్స్’ అనీ దేశాన్ని ‘ముక్కలు ముక్కలు’ చేసే ముఠా అని ముద్ర వేసి పదేపదే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వారిని ఇలా వేధించడం, శిక్షించడం స్వయం ప్రకటిత జాతీయ వాదులకు ఆనందాన్ని, ఊరటను ఇస్తోంది. ప్రాతి నిధ్యం, సమన్యాయ పాలన, స్వేచ్ఛా స్వాతం త్య్రాలు– ఈ మూడు కీలకాంశాలపై ఆధారపడి ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. ప్రాతినిధ్యం అంటే కేవలం చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. అధికారంలో ఉన్న వారితో మాట్లా డటం తెలియని, చట్టాలు ఉపయోగించు కోవడంపై అవగాహన లేని నోరులేని ప్రజల తరఫున పని చేయడం కూడా ప్రాతినిధ్యమనే ముఖ్య విషయం కిందకు వస్తుంది. ఆదివాసీలు, దళితులు, కార్మి కులు వంటి బడుగువర్గాల తరఫున న్యాయస్థానాల్లో పోరా డుతున్న లాయర్లు–సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, సురేంద్ర గాడ్లింగ్, ఉపేంద్ర నాయక్ (ఒడిశా), మురుగన్ (తమిళనాడు), సత్యేంద్ర చౌబే (ఛత్తీస్ గఢ్). వీరందరినీ గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వేధి స్తూనే ఉన్నాయి. బలహీనవర్గాల ప్రజల తరఫున వాదించకుండా పారిపోయేలా చేయడానికే లాయ ర్లను అరెస్టు చేయడం లేదా అరెస్టు చేస్తామని బెది రించడం, యూఏపీఏ వంటి ఉగ్రవాద నిరోధక చట్టాలు ప్రయోగించడం జరుగుతోంది. దేశంలో అభివృద్ధి ఏకపక్షంగానే ఉంటుందని, ఇలా కొందరికి ప్రగతి ఫలాలు లభించే ఏకపక్ష అభివృద్ధిని ఎవరూ ప్రశ్నించకుండా చేయడమే ఇలాంటి చట్టాల కింద అభియోగాలు మోపి ఉద్యమకారులను, హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రభుత్వాల ఉద్దేశం. న్యాయపాలన ఎక్కడుంది? ప్రజాస్వామ్యం రెండో ప్రధాన లక్షణం న్యాయ పాలన, చట్టాలు అమలు చేసేవారు జవాబుదారీగా పనిచేయడం. ప్రజల హక్కులు కాపాడటమేగాక, వాటిని హరించే సందర్భాల్లో బాధితులకు తగిన సాయం, ఊరట లభించేలా చేయడమే న్యాయ పాలన లక్ష్యం. ఆదివాసీలు, స్థానిక జాతుల ప్రజలు వారి భూములను కాపాడుకోవడానికి సంబంధించి రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూలులో ప్రత్యేక చట్టాలు, అటవీ హక్కుల చట్టం(2006) ఉన్నాయి. అటవీ, షెడ్యూల్డ్ ప్రాంతాల భూములను రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు జనంతో సంప్ర దింపులు జరపాలి. ఒడిశా నియంగిరిలో డొంగరియా కోంధుల భూమి విషయంలో సుప్రీంకోర్టు ఈ విషయమే తేల్చిచెప్పింది. కాని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలను జవాబుదారీగా, బాధ్య తతో మెలిగేలా చేయడం మీడియా విధి. మారు మూల అటవీ ప్రాంతాల్లో చట్టాల ఉల్లంఘనతో ఆది వాసీలకు అన్యాయం జరిగితే సమాచారం సేకరించి, జాతీయ మీడియాకు అందించే జర్నలిస్టులు అనేక కష్టాలు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి న్యాయమైన సమాచారం జాతీయస్థాయి మీడియా సంస్థలకు చేరకుండా ఆపడానికి అనేక మంది జర్నలిస్టులను ప్రభుత్వాలు, చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వ విభాగాలు నానా వేధింపులకు గురిచేస్తున్నాయి. వారిపై నిఘాతోపాటు వారిని బెది రించడం, అరెస్ట్ చేయడం లేదా పనిచేసే ప్రాంతాల నుంచి పంపించేయడం నిత్యం జరిపే వేధింపుల్లో భాగం. ఛత్తీస్‌గఢ్ ప్రజా భద్రతా చట్టం కింద జర్నలి స్టులు మాలినీ సుబ్రమణ్యం (జగదల్పూర్లోని ఆమె ఇంటిని ధ్వంసం చేశారు, ఊరు వదిలిపోయే వరకూ రాళ్లు విసిరారు), దీపక్ జైస్వాల్, సొమూరూ నాగ్, సంతోష్ యాదవ్‌లను బస్తర్‌లో అరెస్ట్ చేశారు. అంతరిస్తున్న స్వాతంత్య్రాలు అనేక స్వాతంత్య్రాల ద్వారా ప్రజాస్వామ్యం పని చేస్తుంది. మాట్లాడే, భావాన్ని వ్యక్తంచేసే, సంఘాలు పెట్టుకునే, అసమ్మతి తెలిపే స్వాతంత్య్రాలు ప్రధా నమైనవి. జన సమీకరణ, అభిప్రాయాలు, ఎజెం డాల మధ్య పోటీ ద్వారా ప్రజాస్వామ్యం చక్కగా పనిచేస్తుంది. అసమ్మతి వ్యక్తీకరణ ప్రజాస్వామ్యానికి అవసరమనే విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి డీవై చంద్రచూడ్ సూటిగా చెప్పారు. ఉదారవాద ప్రజా స్వామ్య వ్యవస్థను అర్థంచేసుకుని ఆయన ఈ విష యంపై వివరణ ఇచ్చారు. అందుకూ అసమ్మతి ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ అనీ, దాన్ని పని చేయనివ్వకపోతే పేలుడు తప్పదని ఆయన హె^è్చ రించారు. చట్టాలు గౌరవించే ప్రజలందరికీ మేలు చూస్తూ జనరంజకంగా సాగాల్సిన ప్రజాస్వా మ్యంలో తరచూ జనం కోసం పనిచేసే వారిని అరె స్టులు, నిర్బంధాలతో ఎందుకు ప్రభుత్వాలే వేధిస్తు న్నాయి? అలాగే, యూఏపీఏ, దానికి ముందు అమలులో ఉండి రద్దయిన ఉగ్రవాద నిరోధక చట్టం, ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం వంటివి ఎందుకు వస్తున్నాయి? అవి కొనసాగడానికి కారణాలేంటి? చట్టాలు గౌరవించే పౌరులను బోధన, న్యాయవాద వృత్తి, రచన, ఉపన్యాసాలు ఇవ్వడం, వార్తా సేకరణ వంటి తమ వృత్తుల్లో కొన సాగకుండా నిరోధించడానికి నిరంతరం వారిని రాక్షస చట్టాలతో వేధించే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారు? అనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు పాలకులు తప్పక జవాబు చెప్పాలి. హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, లాయర్లపై వేధిం పులు కొనసాగడాన్ని చూస్తే– పాలకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని భావించేవారిని అడ్డుతొల గించుకుంటారని సూత్రీకరించిన అమెరికా సిద్ధాంత కర్త హెన్రీ గిరోక్స్ గుర్తుకొస్తారు. ప్రజలను అణచి వేసే రాజ్యం భారత కార్పొరేట్ సంస్థల ప్రయోజ నాలు కాపాడటానికే పనిచేస్తుంది. అందుకు అవసర మైతే ఆదివాసీలు, పేదలు, బలహీనవర్గాలను మరింత దుర్భర, దారుణ పరిస్థితుల్లోకి నెట్టడానికి కూడా అనుమతిస్తుంది. రాజశ్రీ చంద్ర రాజనీతి శాస్త్ర విభాగం వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, ఢిల్లీలోని జానకీదేవి మెమోరియల్ కాలేజీ -
ఎస్ దుర్గ
గోవాలో వారం రోజులుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఫెస్టివల్ రేపటితో ఎండ్ అవుతోంది. మలయాళీ చిత్రం ‘ఎస్ దుర్గ’ ను స్క్రీనింగ్‌కి ఒప్పుకోం అంటే ఒప్పుకోం అన్నవాళ్లు.. ఈ వారం రోజులు ఆ సినిమా డైరెక్టర్ శశిధరన్ సెంట్రల్ గవర్నమెంట్‌తో ఫైట్ చేస్తే చివరికి ఓకే అన్నారు. ఇవాళ సాయంత్రమే స్క్రీనింగ్. మగలోకం ఎలా ఉందీ ఈ సినిమాలో చూపించారు. ఎలా ఉండకూడదో కూడా చెప్పారు. సంప్రదాయవాదులకు కోపం వచ్చింది. ఒత్తిడి తెచ్చి బ్యాన్ చేయించారు. డైరెక్టర్ గట్టిగా నిలబడి స్క్రీన్ చేయించుకుంటున్నాడు. నార్త్ ఇండియన్ అమ్మాయి, కేరళ అబ్బాయి కలిసి ఒక అర్ధరాత్రి ఊరి నుంచి పారిపోతారు. ఆ జర్నీలో దుర్గ (రాజశ్రీ దేశ్‌పాండే) అనే ఆ అమ్మాయి పరిస్థితులతో పోరాడ్డం సినిమా. మరి మన హీరో పోరాడడా? మగాళ్ల ప్రపంచంలో మగాళ్లు పోరాడ్డం ఏమంత కష్టం చెప్పండి. స్త్రీగా నెగ్గుకు రావడమే.. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. -
ఇచ్చిన మాట కోసమే నటించడం మానేశా!
బాలనటిగా అరంగేట్రం... కథానాయికగా అయిదు భాషల్లో పేరు ప్రతిష్ఠలు... మహామహుల కాంబినేషన్లో సినిమాలు... హీరో కాంతారావుకు హిట్ పెయిర్... ముగ్గురు ముఖ్యమంత్రులతో నటించిన ఘనత... విదేశాల్లో నృత్య ప్రదర్శనలు...ఇన్ని మలుపులు... ఇన్నిన్ని మెరుపులు రాజశ్రీకే సొంతం. నటిగా ఆమెకిది వజ్రోత్సవ సంవత్సరం. తిరుగులేని స్టార్డమ్ చూసిన ఈ తెలుగింటి ఆడపడుచు చెన్నైలో స్థిరపడ్డారు. చాలా ఏళ్లు అజ్ఞాతవాసంలో ఉన్న ఆమెతో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ... మీరేంటి... చాలాకాలంగా సినిమాలకు దూరంగా? అవును. సినిమాలకు దూరమై దాదాపు 33 ఏళ్లు అయ్యింది పెళ్లి తర్వాత నేనసలు ఇటు వైపే రాలేదు. అసలు నేను ఎక్కడున్నానో పరిశ్రమలో చాలా మందికి తెలీదు. వాళ్లు దాదాపు నన్ను మరిచిపోయారు. బయట జనంలో తిరిగినా, ఎవ్వరూ నన్ను గుర్తు పట్టేవారు కాదు. కథానాయికగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే సినిమా పరిశ్రమ నుంచి రిటైర్ కావడం ఎలా అనిపించింది? మా వారిది రాజకీయ రంగం. మా ఇంట్లో ఎప్పుడూ రాజకీయాలు, ఎన్నికల టాపిక్లే. ఎప్పుడైనా సినిమాలకు తీసుకెళ్తుండేవారు. కానీ జనాలు గుర్తు పట్టేసి ఇబ్బందిగా అనిపించేది. మా పెళ్లయిన కొత్తలో ‘ప్రేమించి చూడు’ సినిమాకి వెళ్లాం. ఇంటర్వెల్లో నన్ను జనాలు గుర్తు పట్టేసి, నా చుట్టూ మూగిపోయారు. మావారు వెళ్లిపోదా మంటారు. నేను బలవంతంగా ఆపాను. తర్వాత నుంచి సెకండ్ షోలకు మాత్రమే వెళ్లేవాళ్లం. సినిమా ప్రపంచానికి దూరమైన తొలిరోజుల్లో దూరదర్శన్ నాకు టైమ్‌పాస్. సినిమా వాళ్లు కనపడితే ప్రాణం లేచి వచ్చేది. బాబు పుట్టాక వాడే లోకమయ్యాడు. మీది ప్రేమ వివాహమా? కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లే. మావారి పేరు తోట పాంచజన్యం. ఆయనది చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్లది గుంటూరు దగ్గర పురుషోత్తమ పట్నం. మా బావగారు తోట లక్ష్మయ్యగారు హైకోర్టు జడ్జిగా పనిచేశారు. మా వారు జలగం వెంగళరావు గారి టైమ్‌లో చీఫ్ విప్‌గా పనిచేశారు. మా వారు తొలుత వేరే కథానాయికను చేసుకుందామనుకుని, తర్వాత నన్ను చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటించవద్దని ముందే షరతు విధించారు. నేను కూడా ఒప్పుకున్నా. 1973లో మా అమ్మ చనిపోయాక నేను కూడా సినిమాలు చేయడం తగ్గించేశాను. పెళ్లయ్యాక ఆయనతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయాను. 1977 నుంచి నేను పూర్తిగా సినిమాలకు దూరంగా జరిగిపోయా. 1983లో ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయారు. ఆయన పోయాకా ఇచ్చిన మాట మీదే నిలబడ్డా.మాకు ఒక్కడే కొడుకు. నాగ శేషాద్రి శ్రీనివాస్. వాడి చదువు కోసం హైదరాబాద్, వైజాగ్ల్లో ఉండి, తర్వాత చెన్నై వచ్చేశాం. వాడిప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. చెన్నైలో నేను, మా అక్క ఉంటాం. అప్పుడప్పుడూ అమెరికా వెళ్లి వస్తుంటాను. ఇకపై మీరు నటించరా? సీరియల్స్ చేయమని అడుగుతున్నారు. ఆసక్తి లేదు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసుకున్నానని ఫీల్ కాలేదా? ఎప్పుడూ లేదు. మా బాబు పుట్టాక నేను పూర్తిగా ఆ ప్రపంచం గురించి ఆలోచించడం మానేశాను. మా అబ్బాయే నా ప్రపంచం అయిపోయాడు. మా బాబు 20 ఏళ్ల వయసులో అమెరికాలో డిగ్రీ చదవడానికి వెళ్లిన ప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. మా అక్క, నేను టీవీ పెట్టుకుని అలా చూస్తూ కూర్చుండే వాళ్లం. ఇంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే ఉండేవాళ్లం. అన్ని తలుపులకీ తాళాలు వేసుకుని అలా ఇంట్లోనే ఉండేవాళ్లం. అలా చాలా జీవితం గడిచిపోయింది. మరి మీ గురించి బయటి ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? ఓసారి యాదృచ్ఛికంగా జయలలిత గారిని కలిశా. ఇద్దరం చాలాసేపు పాత విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 2004లో ఎమ్జీఆర్ అవార్డు ఇస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చింది. ఆ ఫంక్షన్లోనే నా గురించి మళ్లీ అందరికీ తెలిసింది. మీ సొంత ఊరు వైజాగ్ కదూ! అవును. కానీ, అక్కడ ఉన్నది తక్కువ. మా నాన్న గారు ఎం. సూర్యనారాయణరెడ్డి రైల్వేలో స్టేషన్ మాస్టర్. అందుకే, విజయవాడ, ఏలూరుల్లో ఎక్కువ పెరిగాను. అమ్మ పేరు లలితాదేవి. నాకో అక్క. పేరు నిర్మలాదేవి. తనకీ నాకూ 20 ఏళ్ల గ్యాప్. ఆమెకి ఇప్పుడు 90 ఏళ్లు. మా అక్కకి పెళ్లయ్యి ఇద్దరు కొడుకులు పుట్టాక, నేను పుట్టాను. అందుకే వాళ్లని నేను బ్రదర్స్ అనే పిలుస్తాను. అసలు మీరు సినిమా ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు? అదంతా ఓ పెద్ద కథ. అక్క వాళ్ల అత్తయ్యగారికి ఆరోగ్యం బాగోకపోతే అనుకోకుండా మేమంతా మద్రాసు వచ్చేశాం. అప్పటికే నాన్న చనిపోయారు. నన్ను మద్రాసులోని కేసరి హైస్కూల్లో చేర్పించారు. ఇప్పటి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అప్పట్లో స్కూల్లో నాకు సీనియర్. అల్లు రామలింగయ్యగారు, జమునగారు, చలం గారు, కృష్ణకుమారి వీళ్లంతా మా వీధిలోనే ఉండేవాళ్లు. జమున గారింట ఏటా జరిగే బొమ్మల కొలువుకి నేను వెళ్తుండే దాన్ని. ఊహించని విధంగా 1955లో ‘నాగుల చవితి’ (1956లో విడుదలైంది)లో చిన్నప్పటి జమునగా అవకాశం వచ్చింది. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయి. సరదాగా బంధువులతో కలిసి ఏవీయమ్ స్టూడియోకి వెళ్తే, ఏవీయమ్ చెట్టియార్కి నేను నచ్చి, ఈ వేషం ఇచ్చారు. తర్వాత ఏవీయమ్ వారు నన్ను స్టాఫ్ ఆర్టిస్టుగా తీసుకుని స్టూడియోలోనే నాట్యం, డైలాగ్ కోచింగ్ ఇచ్చారు. వాళ్లు తీసిన సినిమాల్లో చిన్నా చితకా వేషాలు వేశాను. ‘మహామంత్రి తిమ్మరుసు’లో చిన్నవేషం వేసినట్లున్నారు... అప్పటికి నేను హీరోయిన్ను కాలేదు. నాది చిన్న వయసు. అందులో నాది సోది చెప్పే అమ్మాయి పాత్ర. మాంగల్యం, నిత్య కల్యాణం - పచ్చతోరణం, శబరి, ఇంద్రజిత్, సతీ సులోచన’... ఇలా చాలా సినిమాల్లో నావి చిన్న చిన్న వేషాలే. ‘శబరి’లో సీతగా కనిపిస్తా. ‘సతీ సులోచన’లో కాంతారావు శ్రీరామునిగానూ, నేను సీతగానూ చేశాం. అప్పట్లో నేను కాంతారావు గారిని ‘అన్నయ్యా’ అని పిలిచేదాన్ని. ఎక్కువ ఆయనకు చెల్లెలి పాత్రలు చేసేదాన్ని కదా. హీరోయిన్గా చేసినప్పుడు కూడా ‘అన్నయ్యా’ అని పిలు స్తుంటే, ‘అలా పిలవకు ఇప్పుడు... సీన్ మూడ్ పాడవుతుంది’ అనేవారు. ఆ తర్వాత ‘ఏవండీ’ అని పిలవడం మొదలుపెట్టా. హీరోయిన్గా ఛాన్సెప్పుడొచ్చింది? గౌరీ ఫిలివ్ు్స అధినేత భావనారాయణగారు ‘తోటలో పిల్ల - కోటలో రాణి’ (1964)లో హీరోయిన్గా తొలి అవకాశం ఇచ్చారు. అందులో కాంతా రావుగారు హీరో. ‘‘నా పక్కన చెల్లెలి వేషాలు వేసింది. హీరోయిన్గా బావుంటుందా?’’ అని కాంతారావుగారన్నారట. భావ నారాయణగారు మాత్రం ఏం ఫరవాలేదన్నారట! ఆ తర్వాత విఠలాచార్య ‘అగ్గి పిడుగు’లో ఛాన్సిచ్చారు. మీ అసలు పేరును ‘రాజశ్రీ’గా మార్చింది ఎవరు? నా అసలు పేరు - కుసుమకుమారి. తమిళ దర్శక, నిర్మాత ఆర్.ఆర్. చంద్రన్ మార్చారు. అప్పట్లో కుసుమకుమారి పేరుతో మరో తమిళతార ఉండేది. శ్రీ, రా... ఇలా కొన్ని అక్షరాలు చెప్పి వాటితో మొదలయ్యే పేరు పెట్టుకోమంటే, ‘రాజశ్రీ’ అని పెట్టుకున్నా. దక్షిణాదిలో అప్పటి టాప్ స్టార్సందరితో నటించారు... దక్షిణాదిలోనే కాదు, హిందీలో కూడా టాప్‌స్టార్స్‌తో మూడు సినిమాలు చేశాను. ‘ప్యార్ కియే జా’, ‘పాయల్ కీ ఝంకార్’, ‘నసీహత్’. తమిళ ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమానే శ్రీధర్‌గారు హిందీలో ‘ప్యార్ కియే జా’గా తీశారు. కిశోర్ కుమార్ హీరో. ‘పాయల్ కీ ఝంకార్’లో శశికపూర్ హీరో. ఈ రెండు సినిమాల షూటింగ్స్ మద్రాసులోనే జరిగాయి. ‘నసీహత్’ మాత్రం పూర్తి బొంబాయి సినిమా. దారాసింగ్ హీరో. మరెందుకని బాలీవుడ్‌పై శ్రద్ధ చూపలేదు? అప్పట్లో నా కెరీర్ నిర్ణయాలన్నీ అక్క తీసుకునేది. తను ఎలా చెబితే, నేనలా చేసేదాన్నంతే. చిన్నా పెద్దా చూసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశమూ అక్క ఒప్పేసు కునేది. ఇక్కడ పెద్ద హీరోలతో అవకాశం వచ్చిన ప్పుడు, నేను ఎక్కడో మలయాళంలో చేస్తుండేదాన్ని. దాంతో వేరే హీరోయిన్ని పెట్టేసుకునేవారు. అలా తమిళ, హిందీల్లో చాలా మిస్సయిపోయాయి. విదేశాల్లో నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చినట్టున్నారు? అవును. చిన్నతనంలో నరసింహారావు మాస్టారి దగ్గర నాట్యం అభ్యసించాను. ఏవీయమ్ వారి సినిమాలకు పని చేసే దండాయుధ పాణిగారి దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నా. అది సినిమాలకు చాలా ఉపయోగపడింది. ‘కోవలన్ కన్మణి’ అనే తమిళ సినిమాలో కరుణానిధి గారితో నటించా. అది పూర్తిగా డాన్స్ కేరెక్టర్. నాకు చాలా పేరొచ్చింది. నేను సినిమా రంగం నుంచి విరమించే ముందు మలయాళ నటీ నటులతో కలిసి విదేశాల్లో అనేక డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. 1977లో నటనతో పాటు నృత్యాన్నీ వదిలేశా. ఆర్టిస్టుగా మీరు హ్యాపీయేనా? అసంతృప్తులున్నాయా? ఎలాంటి అసంతృప్తులూ లేవు. మనిషి ఎంతో సాధించినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఏదైనా ఈ వయసులో ఇంకా ఏం చేయగలం. అయినా అప్పటి ఫీల్డ్ వేరు. ఇప్పటి ఫీల్డ్ వేరు. సీనియర్లని ఇప్పటి పరిశ్రమ గుర్తు పెట్టుకోవడంలేదు. అదొక్కటే బాధ. అదే తమిళ పరిశ్రమ వాళ్లయితే బాగా గౌరవిస్తారు. మొన్న వందేళ్ల భారతీయ సినిమా ఫంక్షన్‌కి కూడా పిలిచి సత్కరించారు. తెలుగు నాట జరిగిన 75 ఏళ్ల వేడుకకు పిలిచారా? లేదు. అదే నా బాధ. కృష్ణ కుమారిగారి తర్వాత జానపద సినిమాలు ఎక్కువ చేసింది నేనే. పిలిచి చిన్న సత్కారం కూడా చేయలేదు. ఏం చేసినా బతికుండగా చేయాలి. చనిపోయాక వాళ్ల పేరు పెట్టి అవార్డు ఇస్తే లాభమేంటి? ⇒ నేను చేసిన చిత్రాలు సుమారు 200 వరకు ఉంటాయి. కాంతారావుగారితో, ఎన్టీఆర్ గారితో ఎక్కువ నటించా. శోభన్‌బాబు, హరనాథ్, రామకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు... ఇలా అందరు హీరోల పక్కనా చేశాను. ఏయన్నార్ గారితో మాత్రం ‘ప్రేమించి చూడు, గోవుల గోపన్న, ఆత్మగౌరవం’ చేయగలిగా. వచ్చిన ప్రతి సినిమా చేసేయడంతో చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయగలిగాను. ⇒ తమిళంలో 50 సినిమాల వరకూ చేశాను. ‘కాదలిక్క నేరమిల్లై’ (1965) నా తొలి సినిమా. శివాజీ గణేశన్, ఎమ్జీఆర్, జెమినీ గణేశన్, రవిచంద్రన్, జయశంకర్, ముత్తు రామన్... ఇలా అక్కడి అగ్రనటులు అందరితో నటించాను. ⇒ కన్నడంలో సుమారు 30 సినిమాలు చేశా. రాజ్‌కుమార్, ఉదయ్ కుమార్, కల్యాణ్ కుమార్, శ్రీనాథ్ లాంటి హేమాహేమీల పక్కన నటించా. కన్నడంలో నా తొలి సినిమానే రాజ్ కుమార్‌తో చేశాను. ‘కంతెర దనోడు’లో ఆయన చెల్లెలిగా కనిపిస్తా. ప్రసిద్ధ దర్శకులు బీఆర్ పంతులు, బి.ఎస్.రంగా, పుట్టణ్ణ గారి సినిమాల్లో నటించే అదృష్టం దక్కింది. ⇒ మలయాళంలో మధు, సత్యన్, ప్రేమ్ నజీర్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేశాను. అక్కడి వాళ్లకి రాజశ్రీ అంటే తెలీదు. గ్రేసీ అంటేనే గుర్తు పడతారు. నా తొలి మలయాళ సినిమాలో నా పాత్ర పేరు అది. అప్పట్లో నా పేరుని అలాగే ప్రచారం చేయడంతో అదే పాపులరైంది. హిందీలో కూడా టాప్‌స్టార్స్‌తో మూడు సినిమాలు చేశా. కిశోర్‌కుమార్‌తో ‘ప్యార్ కియే జా’, శశికపూర్‌తో‘పాయల్ కీ ఝంకార్’, దారా సింగ్‌తో ‘నసీహత్’ చేశా. మూడూ మంచి పేరు తెచ్చాయి. - పులగం చిన్నారాయణ