రాజుగారు అప్పుడు వస్తారహో!
‘‘ప్రేమకథలతో అమ్మాయిల మనసు దోచిన మన్మథుడు, కుటుంబ కథాచిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని అందగాడు, ప్రయోగాత్మక చిత్రాలు–కొత్త కథలకు ఎప్పుడూ పట్టంకట్టే మా రాజుగారు అలియాస్ నాగార్జున మా సినిమాతో అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తారహో!!’’ అని ‘రాజుగారి గది–2’ టీమ్ ప్రకటించింది.నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలనుకుంటున్నారు.
‘‘ఇందులో నాగార్జున స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. ‘రాజుగారి గది’ మంచి హిట్టవ్వడం, సీక్వెల్లో నాగార్జునగారు నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. ‘రాజుగారి గది’ అక్టోబర్‌లో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ సీక్వెల్‌ను కూడా అక్టోబర్‌లోనే విడుదల చేస్తాం’’ అన్నారు చిత్రనిర్మాతలు. సమంత, సీరత్‌కపూర్, అశ్విన్, నరేశ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ఎస్.ఎస్. తమన్, కళ: ఏఎస్ ప్రకాశ్, కెమెరా: దివాకరన్, మాటలు: అబ్బూరి రవి.