డేరా చీఫ్‌పై రేప్ కేసులో నేడే తీర్పు
♦ పంచకులకు చేరుకున్న వేలాది మంది గుర్మీత్ మద్దతుదారులు
♦వ్యతిరేక తీర్పు వస్తే అల్లర్లు జరుగుతాయని అనుమానం భారీగా బలగాల మోహరింపు
చండీఘర్/న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులో శుక్రవారం తీర్పు వెలువడనుండటంతో హరియాణా, పంజాబ్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. సాధారణంగా ప్రశాంతంగా ఉండే హరియాణాలోని పంచకులలో ఈ తీర్పు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. గుర్మీత్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు గుర్మీత్ మద్దతుదారులు, అభిమానులు దాదాపు లక్ష మంది వరకూ పంచకుల చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పంచకులతో పాటు పంజాబ్, హరియాణాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులకుతోడు 15 వేలమంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించారు. డేరా సచ్చా సౌదాకు పంజాబ్, హరియాణాల్లో లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరు రాష్ట్రాల్లోనూ 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై అధికారులు నిఘా పెట్టారు. పంచకులకు వెళ్లే బస్సులు, రైళ్లపై ఆంక్షలు విధించారు. పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కోర్టుకు హాజరవుతా: గుర్మీత్
తీర్పు నేపథ్యంలో శుక్రవారం తాను సీబీఐ న్యాయస్థానానికి హాజరవుతానని గుర్మీత్ రామ్‌రహీం సింగ్ ట్వీటర్లో ప్రకటించారు. తన మద్దతుదారులు, అభిమానులు శాంతంగా ఉండాలని సూచించారు. ‘‘నాకు చట్టంపై గౌరవం ఉంది. నేను వెన్నునొప్పితో బాధపడుతున్నా.. చట్టానికి కట్టుబడే ఉంటాను. గురువారం కోర్టుకు హాజరవుతాను. నాకు దేవునిపై పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ శాంతంగా ఉండాలి’’అని ట్వీటర్లో గుర్మీత్ ట్వీట్ చేశారు. ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ రామ్‌రహీం సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డేరా చీఫ్‌పై కేసు నమోదు చేసింది. తీర్పు నేపథ్యంలో సిస్రాలోని 3 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు.