అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?
ఈ నెల 22న జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌కు చెందిన 57 ఏళ్ల నాటి సీతారాముల స్టాంపు ఒకటి బయటపడింది. సరిగ్గా ఏప్రిల్ 18, 1967న శ్రీరామ నవమి (రాముడి పుట్టినరోజు) సందర్భంగా ఈ స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంప్‌పై నేపాల్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ్ సంవత్ 2024 సంవత్సరం ఉంది.
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1967లో విడుదలైన ఈ స్టాంప్‌పై ఈ ఏడాది రాసి ఉంది. అలాగే హిందువులు అనుసరించే విక్రమ్ సంవత్, గ్రెగోరిన్ క్యాలెండర్ కంటే 57 ఏళ్లు ముందుంటుంది. సరిగ్గా అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఈ స్టాంప్ బయటపడటం రకరకాల ఊహాగానాలుకు తెరతీసింది. అంతేగాదు ఇప్పుడు అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవాన్ని నేపాల్ 57 ఏళ్ల క్రితమే ఊహించిందా?.. అంటూ చర్చలకు దారితీసింది. అదికూడా సరిగ్గా ఈ టైంలో వెలుగులోకి వచ్చిన ఈ స్టాంప్‌పై ఉన్న సంవత్సరం ఈ ఏడాదిని పోలి ఉండటం అందర్నీ ఆలోచింపచేసేలా ఆశ్చర్యానికి గురి చేసింది.
ముఖ్యంగా ఈ స్టాంప్ విడుదలైన సంవత్సరం ఆలయ ప్రతిష్టాపన సంవత్సరంతో సరిపోలింది. 2024లో రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకి తిరిగి వస్తాడని 57 ఏళ్ల కిత్రం నేపాల్‌లో ఈ స్టాంప్ విడుదలైనప్పుడు ఎవరూ ఊహించి ఉండరు కదా!. ఇదిలా ఉండగా, ఈనెలలో జరగనున్న రామ ప్రాణప్రతిష్టాపన కోసం 56 అంగుళాల పొడవుతో సింహగర్జనతో కూడిన డ్రమ్ అయోధ్యకు పెద్ద ఊరేగింపుగా వచ్చింది. దీన్ని ఆలయంలో ఉంచుతారు.
అలాగే ఎనిమిది లోహాలతో కూడిన శంఖం కూడా ప్రాణ ప్రతిష్టాపన సమయంలో బాల రాముడి పాదాల వద్ద ఉంటుంది. ఈ శంఖాన్ని అలీఘర్ నివాసి విరాళంగా ఇచ్చారు. కాగా, ఈ నెల 22న జరగనున్న భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు ఏడు వేల మంది ప్రముఖ ఆహ్వానితులలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు ఉన్నారు.
(చదవండి: రూ. 500 నోట్లపై శ్రీరాముడ ముఖచిత్రం..వైరల్)