జనసందోహం మధ్య అంతిమయాత్ర
అనంతపురం సెంట్రల్ : అనంతపురం సాయినగర్ శోకసంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన నాయకుల మృతదేహాలను చూసేందుకు అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కడసారి చూసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. కర్నూలు జిల్లా డోన్ శివార్లలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ యడగూరి రామ్మోహన్‌రెడ్డి, ఆయన భార్య మాధవి, కూమార్తె అనూష మృతి చెందిన విషయం విదితమే. శుక్రవారం సాయంత్రమే పార్థివదేహాలను సాయినగర్ మూడో క్రాస్‌లోని వారి నివాసానికి తీసుకొచ్చారు.
ప్రజల సందర్శనార్థం శనివారం మధ్యాహ్నం వరకూ ఉంచారు. వేలాది మంది అభిమానులు, నేతలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి అంజలి ఘటించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సైతం అనంతపురం చేరుకుని మరణించిన వారి పార్థివదేహాలకు నివాళులర్పించారు. రామ్మోహన్‌రెడ్డి కుమారుడు అనుదీప్రెడ్డిని ఓదార్చారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి ఽగంటకు అంతిమయాత్ర ప్రారంభించారు. సాయినగర్ నుంచి గుత్తి రోడ్డు మీదుగా సోములదొడ్డి, పామురాయి, వడియంపేట, రేగడికొత్తూరు వరకు అంతిమయాత్ర కొనసాగింది. దారి పొడువును వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు సమీపంలోని వారి తోటలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు
అనంత రాజకీయ చరిత్రలో బలపనూరు పుల్లారెడ్డి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయాలకతీతంగా అభిమానులు ఉన్నారు. దీంతో మాజీ కౌన్సిలర్, నీటి సంఘం అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ మాధవి, కుమార్తె అనూష అంతిమయాత్రలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర సమాచారం శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్‌చౌదరి, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, మాజీ ఎంపీ, వైఎస్సాసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఆలూరు సాంబశివారెడ్డి, పేరం నాగిరెడ్డి, తోపుదుర్తి కవితా భాస్కర్‌రెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డి, లింగాల చంద్రశేఖర్‌రెడ్డి, పెన్నోబిలేసు తదితరులు హాజరైన వారిలో ఉన్నారు. రామ్మోహన్‌రెడ్డి మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయాలకతీతంగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని కొనియాడారు.