నా మీద ఎలాంటి దాడి జరగలేదు: దానం
హైదరాబాద్ : తనపై ఎలాంటి దాడి జరగలేదని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఉప్పల్లో జెండా ఆవిష్కరణ సందర్భంగా స్థానికంగా ఉండే రెండు వర్గాల మధ్య తోపులాట మాత్రమే జరిగిందన్నారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని ఆయన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో భిన్నభిప్రాయాలు సహజమేనని.. అందరం కూర్చోని సమస్యలు పరిష్కరించుకుంటామని దానం పేర్కొన్నారు.
కాగా సోమవారం ఉప్పల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. దానం నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది. దానం నాగేందర్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రమేనని, గ్రేటర్ పరిధిలోని తమ జిల్లాలోకి రావొద్దని కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా పార్టీ జెండా ఎగురవేసేందుకు దానం ప్రయత్నించడంతో ఆయనపై కోడిగుడ్లతో కార్యకర్తలు దాడి చేశారు.