rasila raju
-
సీబీఐ విచారణకు డిమాండ్
పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో తమ కుమార్తె రసీలా రాజు (24) దారుణ హత్యకు గురైన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేరళ డీజీపీకి వారు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కుమార్తె మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. దర్యాప్తు సరైన కోణంలోనే జరుగుతోందా.. సరైన నిందితుడినే అరెస్టు చేశారా లేదా అన్న విషయంలో తమకు అనుమానాలు ఉన్నట్లు ఆమె తండ్రి రాజు చెప్పారు. తన కుమార్తెను ఆమె మేనేజర్ మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని, బెంగళూరు బదిలీ కోరినా ఇవ్వకుండా అదనపు గంటలు పనిచేయించారని చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన సెక్యూరిటీ గార్డు అసలు ఆ భవనంలో పనిచేయడని, అలాంటప్పుడు అతడు ఆమె ఆఫీసులోకి, అందులోనూ క్యూబికల్ వరకు ఎలా రాగలిగాడని రాజు ప్రశ్నించారు. ఐడీ కార్డులు స్వైప్ చేస్తే తప్ప ఎవరూ క్యాంపస్‌లోకి కూడా వెళ్లలేరని, అలాంటిది ఒక సెక్యూరిటీ గార్డు అక్కడకు ఎలా వెళ్లిపోయాడని అన్నారు. టీమ్ లంచ్‌కి రానని చెప్పినందుకు ఆదివారాలు కూడా రాత్రి వరకు ఒక అమ్మాయితో పనిచేయించడం ఏంటని అడిగారు. ఇప్పటికి తన కుమార్తె మరణించి 11 రోజులైనా ఇప్పటికీ పుణె పోలీసులు తమను సంప్రదించలేదని, కుటుంబ సభ్యులను ఎలాంటి వివరాలు అడగలేదని అన్నారు. ఇప్పటివరకు తాము ఆమె అంత్యక్రియలలో బిజీగా ఉన్నామని, ఇప్పుడు అక్కడకు వెళ్లి అసలు ఏం జరుగుతోందో చూస్తామని రాజు చెప్పారు. కేవలం ఒక్క సెక్యూరిటీ గార్డు మాత్రమే ఇదంతా చేశాడంటే నమ్మేలా లేదని, అసలు ఏం జరిగిందన్న విషయంపై తమకు స్పష్టమైన సమాధానం కావాలని అన్నారు. పుణెలోని ఇన్ఫోసిస్ భవనం తొమ్మిదో అంతస్థులో గల కాన్ఫరెన్స్ రూంలో తన క్యూబికల్ వద్ద రసీలా హత్యకు గురైన విషయం తెలిసిందే. కంప్యూటర్ కేబుల్‌ను ఆమె పీకకు బిగించి చంపేశారు. ఈ కేసులో భాబెన్ సైకియా అనే సెకయూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. -
ఇన్ఫోసిస్ టెకీ హత్యలో సంచలన వాస్తవాలు!
''ఎవరో నా చాంబర్లోకి వస్తున్నారు.. నేను నీకు మళ్లీ ఫోన్ చేస్తాను'' ఇవీ పుణె ఇన్ఫోసిస్ కార్యాలయంలో హత్యకు గురైన రసీలా రాజు (24) చెప్పిన చివరి మాటలు. ఆరోజు ఆదివారం. నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శని, ఆదివారాల్లో పనిచేయాల్సిన అవసరం ఉండదు. కానీ, బాస్ తనను తరచు వేధిస్తున్నాడని, బలవంతంగా అదనపు సమయం పనిచేయిస్తున్నాడని ఆమె తన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆరోజు కూడా ఆమె తనకు వరుసకు సోదరి అయ్యే అంజలి నందకుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. తాను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అడిగానని, ఫిబ్రవరి మొదటివారంలో ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. కొద్ది సెకండ్లకే ఎవరో వస్తున్నారంటూ ఫోన్ కట్ చేశారు. మెడచుట్టూ కంప్యూటర్ కేబుల్ బిగించి ఆమెను ఎవరో హతమార్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె క్యూబికల్లో మృతదేహం బయటపడింది. ఆమె ముఖం మీద, ఎదమీద పలుసార్లు గట్టిగా కొట్టిన గుర్తులున్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమె ఎడమ భుజం మీద ఎవరో కొరికిన గుర్తులు కూడా ఉన్నాయని, దాన్నిబట్టి చూస్తే అత్యాచారయత్నం జరిగినట్లు.. ఆమె గట్టిగా పోరాడినట్లు తెలిసిందని బీజే మెడికల్ కాలేజికి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు చెప్పారు. ఆమెపై దాడి చేయడానికి ఏదో గట్టి వస్తువును ఉపయోగించారని, దాని గాయాలే ఆమె ముఖం మీద, ఎదమీద ఉన్నాయని తెలిపారు. ఆమె మెడకు పవర్ కేబుల్ ఉన్న స్థితిలోనే మృతదేహాన్ని మార్చురీకి తెచ్చారని, ఆ వైరును బాగా గట్టిగా బిగించడంతో ఆమె నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారిందని, బహుశా అది నిందితుడి దుస్తుల మీద కూడా పడి ఉండొచ్చని వివరించారు. ఇంత ఘోరమైన హత్య జరిగినా పోలీసులు మాత్రం ఫోరెన్సిక్ నిపుణులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లకుండా నేరుగా మృతదేహాన్ని తరలించడం షాకింగ్ అని అన్నారు. ఈ కేసులో ఇన్ఫోసిస్ సెక్యూరిటీ గార్డు సైకియా భాబెన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెవైపు చూసినందుకు తిట్టిందన్న కోపంతోనే చంపానని అతడు విచారణలో అంగీకరించాడు. అయితే, కేవలం సెక్యూరిటీ గార్డు మాత్రమే కాదని.. అసలు ఆమెను వేధించింది బాస్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన టీమ్ మేనేజర్ తన మీద అదనపు ఒత్తిడి పెడుతున్నారని, అతడితో లంచ్‌కి వెళ్లడానికి తాను నిరాకరించినప్పటి నుంచి అలా చేశారని, తాను పెట్టుకున్న ట్రాన్స్ఫర్ అప్లికేషన్‌ను కూడా పెండింగులో పెట్టారని బాధితురాలు.. హత్య జరగడానికి మూడు రోజుల క్రితమే తన తండ్రికి చెప్పింది. ట్రాన్స్ఫర్ విషయంలో ఆమె మేనేజర్‌కు, ఆమెకు గొడవ జరిగిందని, అప్పుడే ఆయన ఆమెకు గుణపాఠం చెబుతానని బెదిరించారని రసీలా సోదరుడు లైజిన్ కుమార్ చెప్పారు. 16 రోజుల కర్మకాండలు పూర్తయిన తర్వాత తాము పుణె వెళ్లి మేనేజర్ మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ఆ ఇన్ఫోసిస్ ఉద్యోగినికి సీనియర్ వేధింపులు!
కోజికోడ్: పుణేలో ఆదివారం తన కార్యాలయంలోనే హత్యకు గురైన ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని రశీల రాజు (23)ను ఆఫీసులో ఆమె సీనియర్ ఒకతను తరచూ వెంటపడి వేధించేవాడని రశీల తండ్రి ఆరోపించారు. కావాలని ఆదివారం ఆమెను ఒంటరిగా ఆఫీసుకు పిలిపించి, తగినంత భద్రత లేకుండా చేసి హత్య చేయించారని రశీల తండ్రి రాజు పేర్కొన్నారు. రశీల అంత్యక్రియలు మంగళవారం కేరళలోని ఆమె స్వస్థలంలో ముగిశాయి. అంతిమ యాత్రకు వందలాది ప్రజలు తరలి వచ్చారు. రశీల మృతికి నష్టపరిహారంగా రూ.కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఆమె కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఇన్ఫోసిస్ ఒప్పుకున్నట్లు సమాచారం. పుణెలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌లో ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయంలోఆదివారం మధ్యాహ్నం పనిచేయడానికి వెళ్లిన రశీలను సాయంత్రం 9వ అంతస్తులో సెక్యూరిటీ గార్డు హత్య చేయడం తెలిసిందే. సెక్యూరిటీ గార్డును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రశీల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రమేష్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు.