ఇన్ఫోసిస్ టెకీ హత్యలో సంచలన వాస్తవాలు!
ఇన్ఫోసిస్ టెకీ హత్యలో సంచలన వాస్తవాలు!
Published Mon, Feb 6 2017 1:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
''ఎవరో నా చాంబర్‌లోకి వస్తున్నారు.. నేను నీకు మళ్లీ ఫోన్ చేస్తాను'' ఇవీ పుణె ఇన్ఫోసిస్ కార్యాలయంలో హత్యకు గురైన రసీలా రాజు (24) చెప్పిన చివరి మాటలు. ఆరోజు ఆదివారం. నిజానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు శని, ఆదివారాల్లో పనిచేయాల్సిన అవసరం ఉండదు. కానీ, బాస్ తనను తరచు వేధిస్తున్నాడని, బలవంతంగా అదనపు సమయం పనిచేయిస్తున్నాడని ఆమె తన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆరోజు కూడా ఆమె తనకు వరుసకు సోదరి అయ్యే అంజలి నందకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాను బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ అడిగానని, ఫిబ్రవరి మొదటివారంలో ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. కొద్ది సెకండ్లకే ఎవరో వస్తున్నారంటూ ఫోన్ కట్ చేశారు. మెడచుట్టూ కంప్యూటర్ కేబుల్ బిగించి ఆమెను ఎవరో హతమార్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె క్యూబికల్‌లో మృతదేహం బయటపడింది.
ఆమె ముఖం మీద, ఎదమీద పలుసార్లు గట్టిగా కొట్టిన గుర్తులున్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమె ఎడమ భుజం మీద ఎవరో కొరికిన గుర్తులు కూడా ఉన్నాయని, దాన్నిబట్టి చూస్తే అత్యాచారయత్నం జరిగినట్లు.. ఆమె గట్టిగా పోరాడినట్లు తెలిసిందని బీజే మెడికల్ కాలేజికి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు చెప్పారు. ఆమెపై దాడి చేయడానికి ఏదో గట్టి వస్తువును ఉపయోగించారని, దాని గాయాలే ఆమె ముఖం మీద, ఎదమీద ఉన్నాయని తెలిపారు. ఆమె మెడకు పవర్ కేబుల్ ఉన్న స్థితిలోనే మృతదేహాన్ని మార్చురీకి తెచ్చారని, ఆ వైరును బాగా గట్టిగా బిగించడంతో ఆమె నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారిందని, బహుశా అది నిందితుడి దుస్తుల మీద కూడా పడి ఉండొచ్చని వివరించారు. ఇంత ఘోరమైన హత్య జరిగినా పోలీసులు మాత్రం ఫోరెన్సిక్ నిపుణులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లకుండా నేరుగా మృతదేహాన్ని తరలించడం షాకింగ్ అని అన్నారు. ఈ కేసులో ఇన్ఫోసిస్ సెక్యూరిటీ గార్డు సైకియా భాబెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెవైపు చూసినందుకు తిట్టిందన్న కోపంతోనే చంపానని అతడు విచారణలో అంగీకరించాడు. అయితే, కేవలం సెక్యూరిటీ గార్డు మాత్రమే కాదని.. అసలు ఆమెను వేధించింది బాస్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తన టీమ్ మేనేజర్ తన మీద అదనపు ఒత్తిడి పెడుతున్నారని, అతడితో లంచ్‌కి వెళ్లడానికి తాను నిరాకరించినప్పటి నుంచి అలా చేశారని, తాను పెట్టుకున్న ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్‌ను కూడా పెండింగులో పెట్టారని బాధితురాలు.. హత్య జరగడానికి మూడు రోజుల క్రితమే తన తండ్రికి చెప్పింది. ట్రాన్స్‌ఫర్ విషయంలో ఆమె మేనేజర్‌కు, ఆమెకు గొడవ జరిగిందని, అప్పుడే ఆయన ఆమెకు గుణపాఠం చెబుతానని బెదిరించారని రసీలా సోదరుడు లైజిన్ కుమార్ చెప్పారు. 16 రోజుల కర్మకాండలు పూర్తయిన తర్వాత తాము పుణె వెళ్లి మేనేజర్ మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Advertisement