అమర జవాన్ భార్యను అవమానించిన అఖిలేష్
సాక్షి, లక్నో: సమాజ్ వాదీ పార్టీ యువ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమర జవాన్ కుటుంబాన్ని అవమానించాడంటూ విమర్శలు మొదలయ్యాయి. ఒకరికి బదులుగా మరోకరికి సన్మానం చేయటమే అందుకు కారణం.
1965 ఇండో-పాక్ యుద్ధంలో అబ్దుల్ హమీద్ అనే జవాన్ చనిపోగా, ఆరు రోజుల తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అజంఘడ్ జిల్లా నాథ్‌పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమీద్ భార్య రసూలన్ బీబిని అఖిలేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అయితే ఆ వార్తను టీవీల్లో చూసిన హమీద్ అసలు భార్య రసూలన్ షాక్‌కి గురైంది. అఖిలేష్ సన్మానం చేసింది ఎవరికోనని, అసలు ఆ రోజంతా తాను ఇంట్లోనే ఉన్నానని 90 ఏళ్ల రసూలన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆమె మనవడు కూడా ధృవీకరించాడు.
ఇక విషయం ఆ నోటా ఈ నోటా పాకి బీజేపీ చెవిన పడటంతో అఖిలేష్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ వీరుడి కుటుంబాన్ని ఘోరంగా అవమానించారంటూ సమాజ్ వాదీ చీఫ్ పై మండిపడింది. అంతేకాదు సెప్టెంబర్ 10న రసూలన్ను తాము ఘనంగా సత్కరించబోతున్నామని బీజేపీ ప్రకటించింది.
తప్పు జరిగిపోయింది: సమాజ్‌వాదీ పార్టీ
సన్మాన కార్యక్రమంలో తప్పు జరిగిపోయిందన్న విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ఒప్పుకుంది. నిజానికి అక్కడ రామ్ సముజ్ యాదవ్ అనే అమర జవాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించాం. రసూలన్ బిబి పేరు జాబితాలో ఉండగా మైక్‌లో నిర్వాహకులు పేరు చదివారు. వెంటనే ఓ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు వేదికపైకి రావటంతో ఆమెకు అఖిలేష్ సన్మానం చేశారు. ఆమె రసూలన్ అవునో.. కాదో... నిర్ధారణ చేసుకోకపోవటం మా తప్పే. ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నాం అని ఎస్పీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంతేకాదు త్వరలో పార్టీ తరపున ఆమెను ఘనంగా సత్కరించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.