Ravi vayalar
-
సారూ...డబ్బులివ్వండి..!
వయలార్‌కు అసెంబ్లీ అభ్యర్థుల వేడుకోలు ఓడిపోయే స్థానాలకు డబ్బులెందుకన్న రవి హైదరాబాద్: ‘‘సార్.. మాకు పార్టీ నుంచి ఒక్క పైసా అందలేదు. పోలింగ్ సమయం దగ్గరకొచ్చింది. ఇప్పటికే సొంత డబ్బుతో ప్రచారం చేశాం. ఇప్పుడైనా పార్టీ నిధులివ్వండి’’.. అని హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులు సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు వయలార్ రవికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి సామ కృష్ణారెడ్డితో కలిసి బహుదూర్‌పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట అభ్యర్థులు సోమవారం గాంధీభవన్‌కు వచ్చి వయలార్‌ను కలిశారు. తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ. కోటిన్నర చొప్పున పార్టీ నిధులు పంపినట్లు తెలిసిందని.. తమకు మాత్రం ఇంతవరకు అందలేదని వయలార్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా నేతలు చెప్పిందంతా విన్న వయలార్ అసహనంతో ‘‘మీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. ఓడిపోయే వాటికి డబ్బులెందుకు ఇవ్వాలి? అలాంటివేమీ లేవు.. వెళ్లండి’’అనడంతో వారంతా నోరెళ్లబెట్టారు. చేసేదేమీలేక ఆయా అభ్యర్థులు ‘నువ్వైనా మాకు డబ్బులివ్వా’లంటూ ఎంపీ అభ్యర్థిని నిలదీశారు. నా దగ్గర డబ్బులెక్కడివని ఆయనా చేతులెత్తయడంతో ‘‘చేతగానప్పుడు ఎంపీగా నిలబడడం ఎందుకు? డబ్బులున్న వ్యక్తి సీటు తెచ్చుకునే వాడు కదా?’’అని రుసరుసలాడుతూ వెళ్లిపోయినట్లు సమాచారం. -
ఆ ముగ్గురూ ఇక్కడే..
కీలక ఎన్నికల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో అనుబంధం ఉన్న ముగ్గురు ఏఐసీసీ నేతలను తెలంగాణకు తరలించింది. దిగ్విజయ్, వయలార్ రవి, గులాంనబీ అజాద్ హైదరాబాద్‌లో మకాంవేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆజాద్ రోజుకు నాలుగు లేదా ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. శనివారం పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించేం దుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జహీరాబాద్ సభలో కూడా పాల్గొంటానని నాయకులకు సూచించారు. 27న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, వనపర్తి, షాద్‌నగర్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. అలాగే దిగ్విజయ్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. శనివారం ప్రధాని మన్మోహన్ హాజరుకానున్న భువనగిరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. వయలార్ రవి మాత్రం హైదరాబాద్‌లో ఉండి ఎన్నికలప్రచార సరళి, అభ్యర్థుల వ్యవహారాలు, పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.