సారూ...డబ్బులివ్వండి..! | congress candidate asking the money to highcomend | Sakshi
Sakshi News home page

సారూ...డబ్బులివ్వండి..!

Published Tue, Apr 29 2014 1:38 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

సారూ...డబ్బులివ్వండి..! - Sakshi

సారూ...డబ్బులివ్వండి..!

వయలార్‌కు అసెంబ్లీ అభ్యర్థుల వేడుకోలు
ఓడిపోయే స్థానాలకు డబ్బులెందుకన్న రవి

 హైదరాబాద్: ‘‘సార్.. మాకు పార్టీ నుంచి ఒక్క పైసా అందలేదు. పోలింగ్ సమయం దగ్గరకొచ్చింది. ఇప్పటికే  సొంత డబ్బుతో ప్రచారం చేశాం. ఇప్పుడైనా పార్టీ నిధులివ్వండి’’.. అని హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులు సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు వయలార్ రవికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి సామ కృష్ణారెడ్డితో కలిసి బహుదూర్‌పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట అభ్యర్థులు సోమవారం గాంధీభవన్‌కు వచ్చి వయలార్‌ను కలిశారు. తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ. కోటిన్నర చొప్పున పార్టీ నిధులు పంపినట్లు తెలిసిందని..

తమకు మాత్రం ఇంతవరకు అందలేదని వయలార్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా నేతలు చెప్పిందంతా విన్న వయలార్ అసహనంతో ‘‘మీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. ఓడిపోయే వాటికి డబ్బులెందుకు ఇవ్వాలి? అలాంటివేమీ లేవు.. వెళ్లండి’’అనడంతో వారంతా నోరెళ్లబెట్టారు. చేసేదేమీలేక ఆయా అభ్యర్థులు ‘నువ్వైనా మాకు డబ్బులివ్వా’లంటూ ఎంపీ అభ్యర్థిని నిలదీశారు. నా దగ్గర డబ్బులెక్కడివని ఆయనా చేతులెత్తయడంతో ‘‘చేతగానప్పుడు ఎంపీగా నిలబడడం ఎందుకు? డబ్బులున్న వ్యక్తి సీటు తెచ్చుకునే వాడు కదా?’’అని రుసరుసలాడుతూ వెళ్లిపోయినట్లు సమాచారం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement