ravindrabharathi
-
Tuktuki Das: ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ
ఎం.ఏ ఇంగ్లిష్ చదివిన అమ్మాయిలు టీచర్ అవుతారు. లెక్చరర్లు కావాలని ప్రయత్నిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు అన్వేషిస్తారు. కాని టుక్టుకీ దాస్ అలా కాదు. ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ పేరుతో టీకొట్టు తెరిచింది. నేను ఉపాధి వెతుక్కోవడం కాదు. వ్యాపార రంగంలో ఎదిగి నలుగురికీ ఉపాధి ఇస్తాను అంటోంది. కుతూహలం రేపుతున్న ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కథ ఏంటి? ‘ఐయామ్ హ్యాపిలీ సేయింగ్ దట్ ఐయామ్ బిజీ’ అంటుంది 26 ఏళ్ల టుక్టుకీదాస్. ఎంత బిజీ ఆ అమ్మాయి? ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ మీద తన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళుతుంది. అప్పటికే ఆమె టీ కోసం కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు. అప్పటి నుంచి రాత్రి 10 వరకూ తన టీకొట్టులోనే ఉంటుంది. వచ్చిన వారందరికీ టీ ఇస్తుంది. వారితో కబుర్లు చెబుతుంది. టీ అన్నీ చోట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆమె దగ్గరికే వచ్చి కొంటారు అనంటే ఆమె టీకొట్టు పేరు ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’. ఎం.ఏ ఇంగ్లిష్ చేసిన ఒక అమ్మాయి తయారు చేసి అమ్ముతున్న టీ కనుక ఇప్పుడు ఈ క్రేజ్. బెంగాల్ అమ్మాయి టుక్టుకీదాస్ది పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణ జిల్లాలోని హాబ్రా. ముగ్గురు పిల్లల్లో తను పెద్దది. తండ్రి వ్యాన్ డ్రైవర్. తల్లికి చిన్న కిరాణాషాపు ఉంది. ‘అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా రెండు విషయాలు వింటూ పెరిగి పెద్దదాన్నయ్యా. ఒకటి:గవర్నమెంట్ ఉద్యోగం, రెండు: పెళ్లి’ అంటుంది టుక్టుకీ దాస్. 2020లో రవీంద్రభారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాక కొన్నాళ్లు ట్యూషన్ చెప్పింది. ‘నాకు టీచింగ్ అంటే ఇష్టమే కాని అది ఒకేచోట ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఏదో సాధించాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’ అంటుంది టుక్టుకీ దాస్. ఎం.బి.ఏ చాయ్‌వాలా స్ఫూర్తి ఎం.బి.ఏ చాయ్‌వాలా పేరుతో ప్రఫుల్ బిల్లోర్ అనే ఎంబిఏ కేండిడేట్ తెరిచిన వరుస టీకొట్లు హిట్ అయ్యాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉప్మా విర్ది అనే ఆమె చాయ్వాలీ పేరుతో టీ అమ్ముతూ ఫేమస్ అయ్యింది. ‘నేను కూడా వారిలాగే చాయ్ దుకాణం తెరుద్దామని అనుకున్నాను. నేను ఎం.ఏ ఇంగ్లిష్ చదివాను కనుక ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ పేరుతో టీకొట్టు తెరిచాను. దీనికి ముందు ఎక్కడ టీకొట్టు పెట్టాలా అని ఆలోచిస్తే కాలేజీల వద్ద, హాస్పిటల్స్ వల్ల లేదా రైల్వే స్టేషన్లో అనే ఆప్షన్స్ కనిపించాయి. కాలేజీలు కరోనా వల్ల సరిగ్గా నడవడం లేదు. హాస్పిటల్స్ దగ్గర మనుషులు తాగడం లేదు. అందుకని రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నాను’ అంటుంది టుక్టుకీ దాస్. ఆ షాపు తెరవడానికి గత సంవత్సరం ట్యూషన్ చెప్పి దాచుకున్న 10 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. ‘అమ్మా నాన్నలకు నేను చాయ్ దుకాణం పెడతానని చెప్తే వద్దనలేదు కాని ఆశ్చర్యపోయారు. పైగా రైల్వేస్టేషన్ అనేసరికి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని వారి మద్దతుతో ముందుకే వెళ్లాను’ అంటుందామె. మొదటిరోజే ఉచితంగా నవంబర్ 1, 2021న హాబ్రా రైల్వేస్టేషన్లో కొంతమంది మిత్రుల మధ్య, మైక్‌లో వినిపిస్తున్న అనౌన్స్మెంట్ల మధ్య ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ దుకాణాన్ని తెరిచింది టుక్టుకీదాస్. దానికి ముందు నుంచే ఆమె బ్లాగింగ్ కూడా చేస్తుండటం వల్ల తన రోజువారీ అనుభవాలను కూడా వీడియో తీసి బ్లాగ్‌లో ఉంచడం మొదలెట్టింది. ఈ పేరు కొత్తగా ఉండటం, ఫేస్బుక్లో ఆమె రోజూ వీడియోలు పెడుతుండటంతో వెంటనే గుర్తింపు వచ్చేసింది. జనం కుతూహలంతో ఆమె షాపుకు వచ్చి టీ తాగడం మొదలెట్టారు. ‘అక్కా.. టీ ఇవ్వు. అలాగే ఒక సెల్ఫీ కూడా’ అని కాలేజీ పిల్లలు అడగడం మొదలైంది. మొదటి రోజు రెండు గంటల పాటు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా టీ ఇచ్చింది టుక్టుకీ దాస్. ఆ తర్వాత డబ్బులు అవే గల్లాపెట్టెలో పడటం మొదలయ్యాయి. ఏదీ తక్కువ కాదు రైల్వే స్టేషన్లో టీ అమ్మే అమ్మాయిని చూసి అక్కడి పోర్టర్లే మొదట చులకనగా చూశారు టుక్టుకీ దాస్‌ని. ‘ఏ పనైనా గౌరవప్రదమైనదే అని మన దేశంలో గ్రహించరు. అమ్మాయిలు శ్రమ చేసి తమ కాళ్ల మీద తాము నిలబడటాన్ని చూసి హర్షించాలి’ అంటుంది టుక్టుకీ దాస్. అయితే ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు. సాయం వద్దు టుక్టుకీ దాస్ చాయ్ దుకాణం పాపులర్ అయ్యేసరికి కొంతమంది పెద్దలు వచ్చి సాయం చేస్తామన్నారు. ‘నేను సున్నితంగా వారించాను. నేను పైకి వస్తే నా వల్లే రావాలి తప్ప వేరొకరి సాయంతో కాదు. నేను ఇప్పుడు నా చాయ్ దుకాణంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నేను ఈ బ్రాండ్‌తో కోల్కటాలో దుకాణాలు తెరవాలి. కాని ఈ దుకాణం మాత్రం మూసేయను. ఇది మొదటిది. నా సెంటిమెంట్‘ అంటుంది టుక్టుకీ దాస్. టుక్టుకీ దాస్ రోజూ చాలా బిజీగా ఉంటోంది. చాలామంది ఫుడ్బ్లాగర్స్ ఆమెతో వీడియోలు చేస్తున్నారు. ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో టీ అమ్ముతూ ఉండటం సంతోషంగా ఉండటం అందరికీ ఎందుకు నచ్చదు. భిన్నంగా ఆలోచిస్తే మామూలు టీ కూడా ఇలా బ్రాండ్ అయి కూచుంటుంది. -
బాలె.. అదిరె
-
చిత్రాల పువ్వమ్మ చిరకాలం బతుకమ్మ
బ్రసెల్స్, ఇంగ్లాండ్... ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే పూల పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దేశాలకు కేవలం ఆ ఫ్లవర్ ఫెస్టివల్స్ కారణంగానే ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే వీటన్నింటినీ మించింది మన బతుకమ్మ. ప్రకృతి సౌందర్యానికి పట్టం గట్టే అద్భుతమైన ఈ వేడుక విశిష్టతను విశ్వవ్యాప్తం చేసే కృషిలో భాగంగా తెలంగాణ చిత్రకారుల సంఘం రవీంద్రభారతిలో బతుకమ్మ చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. – ఎస్.సత్యబాబు ప్రకృతిలోని ప్రతి ఆకు, పువ్వు అందమైనదేనని నిరూపిస్తూ.. మనసులను పూల వనంలా మార్చేంత చక్కని సంప్రదాయం బతుకమ్మ పండుగ. ఈ సంబరాల్లో సున్నితత్వం ఉంది. సృజనాత్మకత ఉంది. అందం ఉంది. అంతకు మించిన ఆధ్యాత్మికత ఉంది. ఒక చిత్రకారుడి మనసు స్పందించడానికి అంతకన్నా కావాల్సిన ముడిసరుకు ఏముంది? అదే విషయాన్ని ఇలా పంచుకున్నారీ చిత్రకారులు... పాటకు పట్టం కట్టా... అమ్మమ్మ, నానమ్మ, అమ్మ బతుకమ్మలు చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. పండుగ సెలవుల్లో ముత్యాల పూలు అవీ ఇవీ తెచ్చి కలర్స్ వేస్తూ బతుకమ్మ తయారీలో నిమగ్నమయ్యే దానిని. బతుకమ్మ పేర్చడం ఇప్పటి వారికి చాలా మందికి తెలీదు. అందుకని ఆ పేర్చడం అనేదాన్ని వివరిస్తూ కూడా ఓ చిత్రం గీశాను. అలాగే ‘ఓరుగల్లు చూసి ఉయ్యాలో..’ పాటకు తగ్గట్టుగా నా పెయింటింగ్‌లో తెలంగాణలోని అన్ని ముఖ్యమైన ప్లేసెస్ వచ్చేలా చిత్రం గీశాను. – సరస్వతి, చిత్రకారిణి ఢిల్లీలో ఉన్నా మరువలేకున్నా... గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాం. మా స్వస్థలం చిట్యాల. మా ఊరిలో శివుడి గుడి ఉండేది. అక్కడే బతుకమ్మ ఆడేవాళ్లం. అప్పటి జ్ఞాపకాలు, ఆ సంతోషం మరిచిపోలేం. అవే స్ఫూర్తిగా బతుకమ్మ చిత్రాలు గీస్తున్నాను. గత కొంతకాలంగా దేశ రాజధానిలో సైతం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చాక గతేడాది ఢిల్లీలో 25 మంది మహిళలతో కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేశాం. తెలంగాణ భవన్లో కూడా తరచూ జరిగే సంబరాల్లో పాల్గొంటున్నాను. – అర్పితారెడ్డి. ఢిల్లీ చిత్రకారిణి కుంచెను కదిలిస్తుంది... ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాల్సిన పండుగ ఇది. తెలంగాణ ఆర్టిస్ట్, హైదరాబాద్ ఆర్టిస్ట్ ఫోరమ్‌ల ఆధ్వర్యంలో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ‘ఫ్లవర్–ఫిమైన్ అండ్ బతుకమ్మ’ అనే థీమ్ ఎంచుకున్నాం. ప్రతి చిత్రకారుడికీ మహిళ, పుష్పం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. అసలు ఫైనార్ట్స్‌లో మదర్ అండ్ చైల్డ్తోనే పాఠం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో 40 మంది చిత్రకారులు బతుకమ్మ స్ఫూర్తిని ఎవరికి వారే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రాలను మేం ప్రదర్శిస్తున్నాం. – ఎం.వి.రమణారెడ్డి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ -
అక్కినేని గొప్ప నటుడు: స్పీకర్
సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గొప్ప నటుడని స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అక్కినేని జయంతి వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటి జయచిత్రకు ‘అభినయ చంద్రిక’ బిరుదు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రి చందూలాల్, ఎంపీ మురళీమోహన్, వంశీ రామరాజు, ‘కళ’ పత్రిక సంపాదకులు మహ్మద్ రఫీ, ఆర్ఎన్ సింగ్, జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆమని బృందం నిర్వహించిన సినీ సంగీత లహరి అలరించింది. -
స్వర్ణోత్సవ వైభవం
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని రవీంద్రభారతి ప్రాంగణంలో గల ఘంటసాల వేదికపై ‘కళావేదిక స్వర్ణోత్సవ వైభవం’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మోహనకృష్ణ మిమిక్రీ ఆకట్టుకుంది. జంగయ్య గౌడ్ పౌరాణిక పద్యాలతో అలరించారు. వెంకటప్ప బృందం తోలుబొమ్మలాటను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. వేణుమాధవ్ శాస్త్రీయ సంగీతం రమణీయంగా సాగింది. సంకల్ప ఆర్ట్స్ థియేటర్ ప్రదర్శించిన యేటికొప్పాక బొమ్మల ప్రదర్శన ముచ్చటగొల్పింది. కళావేదిక నిర్వాహకురాలు ఆర్వీ భువను వివిధ రంగాల ప్రముఖులు అభినందించారు. వేదిక వ్యవస్థాపకులు దివంగత ఆర్వీ రమణమూర్తి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌బీసీఎల్ ఎమ్డీ ఆర్.వి.చంద్రవదన్, శర్మ తదితరులు పాల్గొన్నారు.