చిత్రాల పువ్వమ్మ చిరకాలం బతుకమ్మ
బ్రసెల్స్, ఇంగ్లాండ్... ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే పూల పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దేశాలకు కేవలం ఆ ఫ్లవర్ ఫెస్టివల్స్ కారణంగానే ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే వీటన్నింటినీ మించింది మన బతుకమ్మ. ప్రకృతి సౌందర్యానికి పట్టం గట్టే అద్భుతమైన ఈ వేడుక విశిష్టతను విశ్వవ్యాప్తం చేసే కృషిలో భాగంగా తెలంగాణ చిత్రకారుల సంఘం రవీంద్రభారతిలో బతుకమ్మ చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది.
– ఎస్.సత్యబాబు
ప్రకృతిలోని ప్రతి ఆకు, పువ్వు అందమైనదేనని నిరూపిస్తూ.. మనసులను పూల వనంలా మార్చేంత చక్కని సంప్రదాయం బతుకమ్మ పండుగ. ఈ సంబరాల్లో సున్నితత్వం ఉంది. సృజనాత్మకత ఉంది. అందం ఉంది. అంతకు మించిన ఆధ్యాత్మికత ఉంది. ఒక చిత్రకారుడి మనసు స్పందించడానికి అంతకన్నా కావాల్సిన ముడిసరుకు ఏముంది? అదే విషయాన్ని ఇలా పంచుకున్నారీ చిత్రకారులు...
పాటకు పట్టం కట్టా...
అమ్మమ్మ, నానమ్మ, అమ్మ బతుకమ్మలు చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. పండుగ సెలవుల్లో ముత్యాల పూలు అవీ ఇవీ తెచ్చి కలర్స్ వేస్తూ బతుకమ్మ తయారీలో నిమగ్నమయ్యే దానిని. బతుకమ్మ పేర్చడం ఇప్పటి వారికి చాలా మందికి తెలీదు. అందుకని ఆ పేర్చడం అనేదాన్ని వివరిస్తూ కూడా ఓ చిత్రం గీశాను. అలాగే ‘ఓరుగల్లు చూసి ఉయ్యాలో..’ పాటకు తగ్గట్టుగా నా పెయింటింగ్‌లో తెలంగాణలోని అన్ని ముఖ్యమైన ప్లేసెస్ వచ్చేలా చిత్రం గీశాను.
– సరస్వతి, చిత్రకారిణి
ఢిల్లీలో ఉన్నా మరువలేకున్నా...
గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాం. మా స్వస్థలం చిట్యాల. మా ఊరిలో శివుడి గుడి ఉండేది. అక్కడే బతుకమ్మ ఆడేవాళ్లం. అప్పటి జ్ఞాపకాలు, ఆ సంతోషం మరిచిపోలేం. అవే స్ఫూర్తిగా బతుకమ్మ చిత్రాలు గీస్తున్నాను. గత కొంతకాలంగా దేశ రాజధానిలో సైతం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చాక గతేడాది ఢిల్లీలో 25 మంది మహిళలతో కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేశాం. తెలంగాణ భవన్‌లో కూడా తరచూ జరిగే సంబరాల్లో పాల్గొంటున్నాను.
– అర్పితారెడ్డి. ఢిల్లీ చిత్రకారిణి
కుంచెను కదిలిస్తుంది...
ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాల్సిన పండుగ ఇది. తెలంగాణ ఆర్టిస్ట్, హైదరాబాద్ ఆర్టిస్ట్ ఫోరమ్‌ల ఆధ్వర్యంలో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ‘ఫ్లవర్–ఫిమైన్ అండ్ బతుకమ్మ’ అనే థీమ్ ఎంచుకున్నాం. ప్రతి చిత్రకారుడికీ మహిళ, పుష్పం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. అసలు ఫైనార్ట్స్‌లో మదర్ అండ్ చైల్డ్‌తోనే పాఠం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో 40 మంది చిత్రకారులు బతుకమ్మ స్ఫూర్తిని ఎవరికి వారే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రాలను మేం ప్రదర్శిస్తున్నాం.
– ఎం.వి.రమణారెడ్డి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ