సమీక్షణం: రాయలవారు ఏం చేసేవారంటే...
పేజీలు: 136
వెల: 120
ప్రతులకు:
క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్; ఫోన్:
9848065658
పుస్తకం : రాయవాచకము
జానర్ : నాన్ఫిక్షన్
రచన : విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి
నేపథ్యం : తండ్రి నాగమనాయుని ఓడించే కొడుకని వీరగాథ ప్రచారంలో ఉన్న విశ్వనాథ నాయకుడి కొలువులో ఒక ఉద్యోగం ఈ స్థానాపతి. పేరు తెలియని ఈ స్థానాపతి ‘విజయనగరం’లో ఉండి, (కృష్ణదేవరాయల మీద) తన ప్రభువుకు అందించిన ‘నివేదిక’ ఈ రాయవాచకం. ‘రమారమి 1520 నాటిది కావొచ్చు.’
విషయం: రాయల పట్టాభిషేకం, అప్పాజీ లాంటి మంత్రులు ‘రాజనీతి యుపదేశిం’చడం, పొద్దుటి రాజు దినచర్య, రాత్రి పట్టణ శోధన, అధికారులు మాట విననప్పుడు అలిగైనా పనులు సాధించుకోవడం, గజపతి మీదకు దండెత్తడం, అప్పాజీ చాతుర్యం, తిరుమలలో మొక్కు తీర్చుకోవడం లాంటి ఘట్టాలన్నీ రాయల నైజాన్నీ, చరిత్రనూ చెబుతాయి. కథా గమనాన్ని బట్టి స్థానాపతి విషయం చెప్పగలవాడే తప్ప, ‘రచయిత’ కాదని అర్థమవుతుంది. ఇదే విషయాన్ని పుస్తకం కూడా ప్రకటిస్తుంది. విరామచిహ్నాలు పాటించని తెంపులేని వాక్యాలు చదవాలంటే, ‘శ్రీకృష్ణదేవరాయల మీద రక్తి’ ఏదో ఉండాల్సిందే!
అయితే, ‘యెరుక శాయగా ఆగ్రహబడి’ ‘బ్రాంహ్మణ’, ‘వింద్దురు’, ‘సరి వుంన్నదా’, ‘ముంద్దుగానే’, ‘అంద్దుండ్డి’, ‘నడిపించ్చమని’, ‘కాకితములు అంప్పి’ లాంటి మాటల్లో వినబడే వత్తుల తెలుగు ముచ్చటేస్తుంది. అలాగే, ఐదువందల ఏళ్ల నాటి రచన కాబట్టి దీనికి కచ్చితమైన చారిత్రక విలువ ఉంది. నగరి కట్టము (యుద్ధంలో గెలిచినవాళ్లు చేసే లూటీ), బోనకత్తె (రాజు భోజన అవసరాలు చూసే పరిచారిక), కొత్తళం (కోట బురుజు), సంప్రతి (పెద్ద కరణం), కుంద్దకం (బాకీ) లాంటి సుమారు రెండు వందల తెలియని మాటల్ని ఫుట్‌నోట్స్‌లో వివరించాడు సంపాదకుడు. ముందుకూ, వెనక్కీ, లోతుగా చూస్తూ, సంపాదక ధర్మాలు చక్కగా నిర్వర్తిస్తూ, నిబద్ధతతో పాత పుస్తకాలను పునర్ముద్రిస్తున్న మోదుగుల రవికృష్ణ నిక్కమైన ప్రశంసార్హుడు.
- ఆర్.ఆర్.
జానపద కళల వైశిష్ట్యం
పేజీలు: 272
వెల: 200
ప్రతులకు:
తాతా జానకి, 14/161-2, స్టేషన్ రోడ్, గుడివాడ; ఫోన్:
9441518715
పుస్తకం : తెలుగు జానపద కళ
సంపాదకుడు : తాతా రమేశ్‌బాబు
విషయం : అంతరించిపోతున్న జానపద కళలపై వెలుతురు పువ్వులు జల్లడానికి, ఈ ప్రజాకళారూపాలపై కుర్రకారులో ఆసక్తి అంకురింపజేయడానికి ఆ మధ్య ఓ మహత్తర ప్రయత్నం జరిగింది. వివిధ జానపద కళాప్రదర్శన సంఘాలతో కలిసి గుడివాడ నుంచి అద్దంకి వరకూ తాతా రమేశ్‌బాబు బృందం ‘జానపద కళాయాత్ర’ నిర్వహించింది. ఆ యాత్ర తాలూకు విశేషాలు, ప్రముఖుల వ్యాసాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ముఖ్యంగా ప్రముఖ రచయిత ఆరుద్ర ఎంతో పరిశోధించి రాసిన ‘తెలుగు ప్రజల కళారూపాలు’ ఆర్టికల్ ఈ పుస్తకానికి సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చింది. శ్రమలోంచి, శ్రమ కోసం పుట్టిన కళల గురించి, ఆ కళలపై ఆధారపడిన రకరకాల జాతుల గురించి విశ్లేషణ ఆసక్తికరంగా అనిపిస్తుంది.
- శ్రీబాబు
వినుడి వినుడి శౌర్యచరితం!
పేజీలు: 176 వెల: 80
ప్రతులకు: రచయిత, 9-14/1,
రవీంద్ర నగర్ కాలనీ, హబ్సిగూడ, హైదరాబాద్-7
పుస్తకం : రుద్రమదేవి
జానర్ : చరిత్ర ఆధారిత నవల
రచన : ఎస్ ఎమ్ ప్రాణ్‌రావు
విషయం : ‘రుద్రమ’ పేరులోనే శౌర్యం ప్రతిధ్వనిస్తుంది. ‘స్ఫూర్తి’ కాంతి వెల్లివెరుస్తుంది. ఆమెను గురించి వినడమైనా, చదవడమైనా గొప్ప ఉత్తేజాన్ని నింపుకోవడమే. ప్రాణ్‌రావ్ నవల అలాంటి అనుభవాన్ని ఇస్తుంది.
చారిత్రక నవలకు ‘కల్పనే’ ముడిసరుకు కాదు. చరిత్ర అధ్యయనమూ ముఖ్యమే. ‘కల్పన’ ఎక్కువై ‘చరిత్ర’ తక్కువైనా, ‘చరిత్ర’ ఎక్కువై ‘కల్పన’ తక్కువైనా కష్టమే. ఇందులో అలాంటి కష్టమేది కనిపించదు. జనశృతులు, ఊహలు, వాస్తవాలను ఆధారం చేసుకొని రాసిన ఈ నవల ఆకట్టుకునేలా ఉంది.
‘రుద్రమదేవి నవల యథాతథంగా చరిత్ర కాదు’ అన్నారు రచయిత. చారిత్రక దృష్టిని పక్కన పెడితే తప్పక మనల్ని మెప్పిస్తుంది.
- డి. చారులత
కొత్త పుస్తకాలు
రాష్ట్రంలో నదీజలాలు
రచన: సారంపల్లి మల్లారెడ్డి
పేజీలు: 232; వెల: 100
ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌజ్, హైదరాబాద్
చాణక్య నీతి మాలికలు
అనుసృజన: యల్లాప్రగడ ప్రభాకరరావు
భావార్థం: పంగులూరి హనుమంతరావు
పేజీలు: 128; వెల: 120;
ప్రతులకు: పంగులూరి హనుమంతరావు, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-36; 040-24141560
ఆమె వేకువ (కవిత్వం)
డా. ఎ.వి.వీరభద్రాచారి
పేజీలు: 124
వెల: 100
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు