RDF
-
ఉక్కు కోసం యువత ఉద్యమించాలి
బద్వేలు(అట్లూరు): కడప జిల్లాలో ఉక్కు ప్యాక్టరీ స్థాపన కోసం విద్యార్థులు ఉధ్యమించాలని రాయలసీమ అబివృద్ధి వేదిక(ఆర్డీఫ్)డివిజన్ కన్వీనర్ మాధన విజయకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బద్వేలు పట్టణంలోని స్థానిక ఎంవీఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఫ్ కొంత కాలంగా ఉక్కుపరిశ్రమ కోసం ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదని ప్రశ్నించారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటు పరిశీలనకు టాస్క్‌పోర్సు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రెండు నెలలు గడచినా పట్టించుకోవక పోవడం దారుణమన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమతో పాటు పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు డిశంబరు 8వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఎఫ్ డివిజన్ కార్యవర్గ సభ్యుడు చిన్నీ, డివిజన్ నాయకుడు వెంకటరమణ, కళాశాల కరస్పాండెంటు శంకరనారాయణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఎఫ్ విద్యుత్‌పై మళ్లీ ఆశలు!
రెండు నెలల్లో ఉత్పత్తి..? సాక్షి, సిటీబ్యూరో : ఏళ్ల తరబడి కుంటుతోన్న ఆర్డీఎఫ్ (చెత్త నుంచి విద్యుత్ ఉత్పతి) ప్రాజెక్టు మరో రెండునెలల్లో విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఆర్డీఎఫ్తో ఐఎల్ఎఫ్ఎస్ చేయి కలపడంతో ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, జూలై నెలాఖరు వరకు ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కాగలదని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. దీని కోసం గ్రేటర్ నుంచి వెలువడుతున్న చెత్తలో 1100 మెట్రిక్‌టన్నుల చెత్తను అక్కడకు తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికానుంది. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇటీవల నగరంలోని చెత్త సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సిద్ధమైన అధికారులు ఆర్డీఎఫ్‌పై మరోమారు దృష్టి సారించారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఆర్డీఎఫ్ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా, పలు అవాంతరాలతో ముందుకు కదల్లేదు. ఒప్పందంలో కొద్దిపాటి మార్పుచేర్పులు.. ఐఎల్ఎఫ్ఎస్ భాగస్వామ్యం తదితర చర్యలతో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి కాగలదని భావిస్తున్నారు. గ్రేటర్ నుంచి ప్రతిరోజూ వెలువడుతున్న దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తలో 700 మెట్రిక్ టన్నుల చెత్తను వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తికి వుుందుకొచ్చిన ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌తో జీహెచ్ఎంసీ(పూర్వపు ఎంసీహెచ్) దశాబ్దం క్రితమే ఒప్పందం కుదుర్చుకుంది. 11 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంట్ ఏర్పాటుకు రూ. 84 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. అందులో 70 శాతం సొమ్మును ఆర్థిక సంస్థల నుంచి సేకరించాలని, మిగతా 30 శాతం ఈక్విటీ షేర్ (రూ25.20కోట్లు)లో 26 శాతం (దాదాపు రూ. 6.55 కోట్లు) జీహెచ్ఎంసీ పెట్టుబడిగా పెట్టాలనేది ఒప్పందం. ఒప్పందమైతే కుదిరినప్పటికీ పనుల పురోగతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించకపోవడంతో ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. జీహెచ్ఎంసీ తను చెల్లించాల్సిన వాటా సొమ్ములో రూ. 3.75 కోట్లు మాత్రం చెల్లించింది. 2012 ఆరంభం నాటికి విద్యుత్ పనులు ప్రారంభం కాగలవని అంచనా వేసినా అమలుకు నోచుకోలేదు. కేంద్రంలోని ఎంఎన్ఆర్ఈ చెత్తనుంచి విద్యుత్ పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఇచ్చే రాయితీ, జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన మిగతా వాటా ధనం రానందునే ఉత్పత్తి ప్రారంభించలేదని ఆర్డీఎఫ్ యాజమాన్యం చెబుతూ వచ్చింది. తాజాగా దానిపై అధికారులు శ్రద్ధ చూపడంతో రెండునెల ల్లోగా పనులు చేపట్టేందుకు వీలుగా ఒప్పందంలో కొద్దిపాటి మార్పుచేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరు వరకు పనులు ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ బుధవారం తనను కలిసిన విలేకరులకు తెలిపారు. ప్రాజెక్టు గురించి సంక్షిప్తంగా.. గ్రేటర్లో వెలువడే చెత్తనుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసేందుకు శివార్లలోని నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామంలో విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆర్డీఎఫ్కున్న 26 ఎకరాల భూముల్లో ప్లాంట్ పనులు ప్రారంభించారు. గ్రేటర్ నుంచి రోజుకు అక్కడకు తరలించే 700 టన్నుల చెత్తలో పదిశాతం(70 టన్నుల) చెత్త తరలింపునకయ్యే వ్యయం ఆర్డీఎఫ్‌దే కాగా, మిగతా 630 టన్నుల చెత్తను జీహెచ్ఎంసీ అక్కడకు తరలిస్తుంది. ఇందుకుగాను టన్నుకు రూ. 25ల వంతున రోజుకు రూ. 15750లను జీహెచ్ఎంసీకి ఆర్డీఎఫ్ రాయుల్టీగా చెల్లిస్తుంది. ఒప్పందం మార్పులో భాగంగా రోజుకు సగటున 1100 మెట్రిక్‌టన్నుల చెత్తను జీహెచ్ఎంసీయే ప్లాంట్ వద్దకు తరలించనున్నట్లు సమాచారం. -
తిరుగులేని బాణం
టీక్యా తండా... వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరుకు ఆనుకుని ఉండే గిరిజన పల్లె. మాములుగా ఎవరికీ తెలియని ఈ తండాకు ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న గుగులోత్ ప్రణీత సబ్ జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మొదటి స్థానం దక్కించుకుని ఈ గుర్తింపు తెచ్చింది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఇటీవలే పూర్తయిన ఈ పోటీలలో గెలవడం ద్వారా ప్రణీత అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో పాల్గొనే అర్హత సాధించింది. ఒలింపిక్ పోటీల్లో పతకం సాధించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ప్రణీత తన తాజా విజయంతో ఎందరో బాలికలకు స్ఫూర్తిగా నిలిచింది. గుగులోత్ సీతారాం, బుజ్జమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ప్రణీత మూడో అమ్మాయి. కల్లెడలోని రూరల్ డెవలప్మెంట్ ఫోరం(ఆర్డీఎఫ్) నిర్వహిస్తున్న పాఠశాలలోనే నర్సరీ నుంచి టెన్త్ వరకు చదివింది. పాఠశాల వాతావరణంలోనే ఆమెకు ఆర్చరీపై ఆసక్తి ఏర్పడింది. అలా మొదటిసారి 2011లో రాజస్థాన్‌లో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి జట్టులో ప్రణీత పాల్గొంది. ఆ తర్వాత బెంగళూరు, షిల్లాంగ్, అసోం, జార్ఘండ్, మహారాష్ట్ర, విజయవాడలో జరిగిన పలు జాతీయ జూనియర్, సీనియర్ ఆర్చరీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని రాణించింది. చక్కటి ప్రతిభ చూపింది. తాజాగా జనవరి 21 నుంచి 24 వరకు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన 35వ సబ్‌జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల వ్యక్తిగత విభాగంలో ప్రణీత దేశంలోనే మొదటి స్థానం సాధించింది. 300 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ప్రణీత గురి తప్పకుండా బాణం వేసి టీక్యా తండా ఖ్యాతిని నిలిచింది. రికర్వ్ విభాగంలో 720 పాయింట్లకు ప్రణీత 653 పాయింట్లు సాధించింది. ఈ విభాగంలో ఇన్ని పాయింట్లు సాధించిన మొదటి ఆర్చర్ ప్రణీత మాత్రమే. అదే పోటీలో జరిగిన ఎలిమినేషన్ రౌండ్లో కూడా వెండి పతకం గెలుచుకుంది. జంషెడ్పూర్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచడంతో ప్రణీత అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల ట్రయల్స్‌కు అర్హత సాధించిందని కోచ్ ఆకుల రాజు తెలిపారు. ఆర్చరీ... ఆర్డీఎఫ్ కల్లెడ సమీప గ్రామాలు, తండాల్లోని పేద పిల్లలకు విద్యను ఉచితంగా అందించడం లక్ష్యంగా ఆర్డీఎఫ్ ఇక్కడ పాఠశాల నిర్వహిస్తోంది. ఇక్కడ విద్యార్థులకు ఒక పూట ఉచితంగా భోజనం పెడతారు. ఆర్డీఎఫ్ స్కూల్లోనే చదివిన ఆకుల రాజు ఇప్పుడు ఇదే స్కూల్లో ఆర్చరీ కోచ్‌గా పనిచేస్తున్నారు. ఆర్డీఎఫ్ ఆరంభంలో ప్రబీర్‌దాస్ కోచ్‌గా వ్యవహరించి ఈ పాఠశాల విద్యార్థులకు ఆర్చరీ నేర్పించారు. వర్ధినేని ప్రణీత ఇక్కడే చదివి 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆర్చరీలో సత్తా చూపింది. ఇదే పాఠశాలకు చెందిన వేమునూరి శారద, నోముల లావణ్యలు చైనా, అమెరికాల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్నారు. వీరి స్ఫూర్తితో ఇక్కడి బాలబాలికలు ఎక్కువ మంది ఆర్చరీలో ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో ఆర్డీఎఫ్కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు. ఈ వరుసలో ఇప్పుడు గుగులోత్ ప్రణీత జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటింది. గర్వపడుతున్నా నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. ప్రోత్సహిస్తే ఆడపిల్లలు ఏదైనా సాధిస్తారు. ప్రణీత తండ్రిగా నేను గర్వపడుతున్నా. మా బిడ్డ ఇంకా మంచి పేరు సాధించాలి. - సీతారాం, ప్రణీత తండ్రి - పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్