
ఆర్డీఎఫ్ విద్యుత్‌పై మళ్లీ ఆశలు!
రెండు నెలల్లో ఉత్పత్తి..?
సాక్షి, సిటీబ్యూరో : ఏళ్ల తరబడి కుంటుతోన్న ఆర్డీఎఫ్ (చెత్త నుంచి విద్యుత్ ఉత్పతి) ప్రాజెక్టు మరో రెండునెలల్లో విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఆర్డీఎఫ్‌తో ఐఎల్‌ఎఫ్‌ఎస్ చేయి కలపడంతో ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, జూలై నెలాఖరు వరకు ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కాగలదని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. దీని కోసం గ్రేటర్ నుంచి వెలువడుతున్న చెత్తలో 1100 మెట్రిక్‌టన్నుల చెత్తను అక్కడకు తరలించనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికానుంది. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇటీవల నగరంలోని చెత్త సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సిద్ధమైన అధికారులు ఆర్డీఎఫ్‌పై మరోమారు దృష్టి సారించారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఆర్డీఎఫ్ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా, పలు అవాంతరాలతో ముందుకు కదల్లేదు. ఒప్పందంలో కొద్దిపాటి మార్పుచేర్పులు.. ఐఎల్‌ఎఫ్‌ఎస్ భాగస్వామ్యం తదితర చర్యలతో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి కాగలదని భావిస్తున్నారు.
గ్రేటర్ నుంచి ప్రతిరోజూ వెలువడుతున్న దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తలో 700 మెట్రిక్ టన్నుల చెత్తను వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తికి వుుందుకొచ్చిన ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌తో జీహెచ్‌ఎంసీ(పూర్వపు ఎంసీహెచ్) దశాబ్దం క్రితమే ఒప్పందం కుదుర్చుకుంది. 11 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంట్ ఏర్పాటుకు రూ. 84 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. అందులో 70 శాతం సొమ్మును ఆర్థిక సంస్థల నుంచి సేకరించాలని, మిగతా 30 శాతం ఈక్విటీ షేర్ (రూ25.20కోట్లు)లో 26 శాతం (దాదాపు రూ. 6.55 కోట్లు) జీహెచ్‌ఎంసీ పెట్టుబడిగా పెట్టాలనేది ఒప్పందం. ఒప్పందమైతే కుదిరినప్పటికీ పనుల పురోగతిపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించకపోవడంతో ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.
జీహెచ్‌ఎంసీ తను చెల్లించాల్సిన వాటా సొమ్ములో రూ. 3.75 కోట్లు మాత్రం చెల్లించింది. 2012 ఆరంభం నాటికి విద్యుత్ పనులు ప్రారంభం కాగలవని అంచనా వేసినా అమలుకు నోచుకోలేదు. కేంద్రంలోని ఎంఎన్‌ఆర్‌ఈ చెత్తనుంచి విద్యుత్ పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఇచ్చే రాయితీ, జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన మిగతా వాటా ధనం రానందునే ఉత్పత్తి ప్రారంభించలేదని ఆర్డీఎఫ్ యాజమాన్యం చెబుతూ వచ్చింది. తాజాగా దానిపై అధికారులు శ్రద్ధ చూపడంతో రెండునెల ల్లోగా పనులు చేపట్టేందుకు వీలుగా ఒప్పందంలో కొద్దిపాటి మార్పుచేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరు వరకు పనులు ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ బుధవారం తనను కలిసిన విలేకరులకు తెలిపారు.
ప్రాజెక్టు గురించి సంక్షిప్తంగా..
గ్రేటర్‌లో వెలువడే చెత్తనుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసేందుకు శివార్లలోని నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామంలో విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆర్డీఎఫ్‌కున్న 26 ఎకరాల భూముల్లో ప్లాంట్ పనులు ప్రారంభించారు. గ్రేటర్ నుంచి రోజుకు అక్కడకు తరలించే 700 టన్నుల చెత్తలో పదిశాతం(70 టన్నుల) చెత్త తరలింపునకయ్యే వ్యయం ఆర్డీఎఫ్‌దే కాగా, మిగతా 630 టన్నుల చెత్తను జీహెచ్‌ఎంసీ అక్కడకు తరలిస్తుంది. ఇందుకుగాను టన్నుకు రూ. 25ల వంతున రోజుకు రూ. 15750లను జీహెచ్‌ఎంసీకి ఆర్డీఎఫ్ రాయుల్టీగా చెల్లిస్తుంది. ఒప్పందం మార్పులో భాగంగా రోజుకు సగటున 1100 మెట్రిక్‌టన్నుల చెత్తను జీహెచ్‌ఎంసీయే ప్లాంట్ వద్దకు తరలించనున్నట్లు సమాచారం.