
ఉక్కు కోసం యువత ఉద్యమించాలి
బద్వేలు(అట్లూరు): కడప జిల్లాలో ఉక్కు ప్యాక్టరీ స్థాపన కోసం విద్యార్థులు ఉధ్యమించాలని రాయలసీమ అబివృద్ధి వేదిక(ఆర్డీఫ్)డివిజన్ కన్వీనర్ మాధన విజయకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బద్వేలు పట్టణంలోని స్థానిక ఎంవీఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఫ్ కొంత కాలంగా ఉక్కుపరిశ్రమ కోసం ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదని ప్రశ్నించారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటు పరిశీలనకు టాస్క్‌పోర్సు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రెండు నెలలు గడచినా పట్టించుకోవక పోవడం దారుణమన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమతో పాటు పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు డిశంబరు 8వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఎఫ్ డివిజన్ కార్యవర్గ సభ్యుడు చిన్నీ, డివిజన్ నాయకుడు వెంకటరమణ, కళాశాల కరస్పాండెంటు శంకరనారాయణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.