
తిరుగులేని బాణం
టీక్యా తండా... వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరుకు ఆనుకుని ఉండే గిరిజన పల్లె. మాములుగా ఎవరికీ తెలియని ఈ తండాకు ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న గుగులోత్ ప్రణీత సబ్ జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మొదటి స్థానం దక్కించుకుని ఈ గుర్తింపు తెచ్చింది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఇటీవలే పూర్తయిన ఈ పోటీలలో గెలవడం ద్వారా ప్రణీత అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో పాల్గొనే అర్హత సాధించింది. ఒలింపిక్ పోటీల్లో పతకం సాధించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ప్రణీత తన తాజా విజయంతో ఎందరో బాలికలకు స్ఫూర్తిగా నిలిచింది.
గుగులోత్ సీతారాం, బుజ్జమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ప్రణీత మూడో అమ్మాయి. కల్లెడలోని రూరల్ డెవలప్‌మెంట్ ఫోరం(ఆర్డీఎఫ్) నిర్వహిస్తున్న పాఠశాలలోనే నర్సరీ నుంచి టెన్త్ వరకు చదివింది. పాఠశాల వాతావరణంలోనే ఆమెకు ఆర్చరీపై ఆసక్తి ఏర్పడింది. అలా మొదటిసారి 2011లో రాజస్థాన్‌లో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి జట్టులో ప్రణీత పాల్గొంది. ఆ తర్వాత బెంగళూరు, షిల్లాంగ్, అసోం, జార్ఘండ్, మహారాష్ట్ర, విజయవాడలో జరిగిన పలు జాతీయ జూనియర్, సీనియర్ ఆర్చరీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని రాణించింది. చక్కటి ప్రతిభ చూపింది.
తాజాగా జనవరి 21 నుంచి 24 వరకు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన 35వ సబ్‌జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల వ్యక్తిగత విభాగంలో ప్రణీత దేశంలోనే మొదటి స్థానం సాధించింది. 300 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ప్రణీత గురి తప్పకుండా బాణం వేసి టీక్యా తండా ఖ్యాతిని నిలిచింది. రికర్వ్ విభాగంలో 720 పాయింట్లకు ప్రణీత 653 పాయింట్లు సాధించింది. ఈ విభాగంలో ఇన్ని పాయింట్లు సాధించిన మొదటి ఆర్చర్ ప్రణీత మాత్రమే. అదే పోటీలో జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో కూడా వెండి పతకం గెలుచుకుంది. జంషెడ్‌పూర్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచడంతో ప్రణీత అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల ట్రయల్స్‌కు అర్హత సాధించిందని కోచ్ ఆకుల రాజు తెలిపారు.
ఆర్చరీ... ఆర్డీఎఫ్
కల్లెడ సమీప గ్రామాలు, తండాల్లోని పేద పిల్లలకు విద్యను ఉచితంగా అందించడం లక్ష్యంగా ఆర్డీఎఫ్ ఇక్కడ పాఠశాల నిర్వహిస్తోంది. ఇక్కడ విద్యార్థులకు ఒక పూట ఉచితంగా భోజనం పెడతారు. ఆర్డీఎఫ్ స్కూల్లోనే చదివిన ఆకుల రాజు ఇప్పుడు ఇదే స్కూల్‌లో ఆర్చరీ కోచ్‌గా పనిచేస్తున్నారు. ఆర్డీఎఫ్ ఆరంభంలో ప్రబీర్‌దాస్ కోచ్‌గా వ్యవహరించి ఈ పాఠశాల విద్యార్థులకు ఆర్చరీ నేర్పించారు. వర్ధినేని ప్రణీత ఇక్కడే చదివి 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆర్చరీలో సత్తా చూపింది.
ఇదే పాఠశాలకు చెందిన వేమునూరి శారద, నోముల లావణ్యలు చైనా, అమెరికాల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్నారు. వీరి స్ఫూర్తితో ఇక్కడి బాలబాలికలు ఎక్కువ మంది ఆర్చరీలో ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో ఆర్డీఎఫ్‌కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు. ఈ వరుసలో ఇప్పుడు గుగులోత్ ప్రణీత జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటింది.
గర్వపడుతున్నా
నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. ప్రోత్సహిస్తే ఆడపిల్లలు ఏదైనా సాధిస్తారు. ప్రణీత తండ్రిగా నేను గర్వపడుతున్నా. మా బిడ్డ ఇంకా మంచి పేరు సాధించాలి.
- సీతారాం, ప్రణీత తండ్రి
- పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్