రీ- పోస్టుమార్టం నివేదికను మా ముందుంచండి
సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ కేసులో ఆరు మృతదేహాల రీ- పోస్టుమార్టం నివేదికను బుధవారం తమ ముందుంచాలంటూ ఉస్మానియా వైద్య కళాశాల వైద్యుల్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై మృతుల బంధువులు కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే సోమవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా.. ఎన్కౌంటర్లో మృతులకు తిరుపతి డాక్టర్లు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, దానిని తిరిగి సీల్డ్ కవర్లోనే ఉంచి రిజిస్ట్రార్ వద్ద భద్రపరచాలని ఆదేశించింది. రెండో పోస్టుమార్టం నివేదికను బుధవారం కల్లా తమ ముందుంచాలని పోస్టుమార్టం చేసిన ఉస్మానియా వైద్య కళాశాలల డాక్టర్లను ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.