పరిశ్రమల నిరాశ-రియల్టర్ల పెదవి విరుపు
ఆర్బీఐ రెపో రేటు పెంపు నిర్ణయం పట్ల పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రియల్టర్లు సైతం ఈ ప్రభావం పరిశ్రమపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ సీజన్లో హౌసింగ్ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేటు పెంచకుండా ఉండాల్సిందన్నారు.
మరోవైపు, ఆర్బీఐ నిర్ణయం తీవ్రంగా నిరాశపర్చేదిగా ఉందని పార్శ్వనాథ్ డెవలపర్స్ చైర్మన్ ప్రదీప్ జైన్ తెలిపారు. రెపో రేటు పెంపు వల్ల డెవలపర్ల ఫైనాన్స్ వ్యయాలు పెరిగి, వారి లాభాల మార్జిన్‌పై ప్రభావం పడుతుందని కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె ఇండియా చైర్మన్ అనుజ్ పురి అభిప్రాయపడ్డారు. వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణం కట్టడికి విధాన నిర్ణేతలు తగిన చర్యలు తీసుకోవాలని క్రెడాయ్ డిమాండ్ చేసింది. పెట్టుబడులకు, వృద్ధికి రెపోరేటు పెంపు విఘాతం కలిగిస్తుందని ఫిక్కీ, సీఐఐ పేర్కొన్నాయి.