ఇలా నిద్రపోతే అల్జీమర్స్ దరిచేరదు!
న్యూయార్క్: వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేదు. అందుకే అది రాకుండా ముందుగానే జాగ్రత్త వహించడం మేలు. దీనికోసం నిపుణులు ఓ సలహా ఇస్తున్నారు. పడుకునేటప్పుడే ఏదైనా ఓ పక్కకు తిరిగిపడుకుంటే అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చని వారి అధ్యయనంలో తేలింది. వెల్లకిలా, లేదా బోర్లా పడుకోవడం కన్నా ఏదైనా ఓ పక్కకు తిరిగి పడుకుంటే అల్జీమర్స్, పార్కిన్సన్, ఇతర నరాల సంబంధిత సమస్యలు దరిచేరకుండా నిరోధించవచ్చని అధ్యయనం సూచించింది.
మెదడునుంచి విడుదలయ్యే కొన్ని హానికర, వ్యర్థ రసాయనాలు అల్జీమర్స్, ఇతర నరాల వ్యాధులకు కారణమవుతాయి. దీనివల్ల నిద్రలేమి సమస్యలు కూడా చుట్టుముడతాయి. అయితే పక్కకు తిరిగి పడుకోవడం వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ఈ రసాయనాలు తొలగిపోయే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని న్యూయార్క్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకులు తెలిపారు. నిద్ర పోయే విధానం కూడా అల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడుతుందని తాము గుర్తించామని మైకెన్ అనే పరిశోధకుడు అన్నాడు. ఎంఆర్ఐ విధానాన్ని ఉపయోగించి సాగించిన అధ్యయనం ద్వారా వారు ఈ విషయాన్ని కనుగొన్నారు.