Rebels leaders
-
Rajasthan Assembly elections 2023: బీజేపీ గుండెల్లో రె‘బెల్స్’
రాజస్తాన్‌లో తిరుగుబాటు నేతలు బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసిన చరిత్ర వారిది! ఆ ఎన్నికల్లో చివరి క్షణంలో పార్టీ మొండి చేయి చూపడంతో ఆగ్రహించి డజను మంది నేతలు స్వతంత్రులుగా బరిలో దిగారు. తాము ఓడటమే గాక బీజేపీ అభ్యర్థులను కూడా ఓడించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. అదే సమయంలో 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన 13 మందిలో ఏకంగా 12 మంది విజయం సాధించడం విశేషం. పైగా ఫలితాలు వెలువడగానే వారంతా కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. అలా నికరంగా ఆ పార్టీకి పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈసారి కూడా రెండు పార్టీల నుంచీ రెబెల్స్ రంగంలో ఉన్న నేపథ్యంలో వారు ఎవరికి చేటు చేస్తారోనన్న చర్చ జరుగుతోంది...! రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 830 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్, 12 మంది బీజేపీ నేతలున్నారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగరేశారు. కాంగ్రెస్ రెబెల్స్‌లో ఏకంగా 12 మంది గెలవడమే గాక ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి వారిలో 10 మందికి సీఎం అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ టికెట్లు కూడా ఇప్పించారు. మరోవైపు 12 మంది బీజేపీ రెబల్స్‌లో ఒక్కరు కూడా నెగ్గలేదు. కుల్దీప్ ధన్‌ఖడ్, దేవీసింగ్ షెకావత్, ధన్సింగ్ రావత్, హేమ్‌సింగ్ భడానా వంటి పెద్ద నాయకులు కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాకపోతే ఈ 12 మందీ తమ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులందరినీ ఓడించారు. అలా రెబెల్స్ దెబ్బకు బీజేపీ బాగా నష్టపోయింది. బీజేపీకి 73 సీట్లు రాగా కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడం తెలిసిందే. 2013లో కూడా కాంగ్రెస్ రెబెల్స్‌లో చాలామంది నెగ్గగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో అత్యధికులు ఓటమి చవిచూశారు. ఈసారి కూడా రాష్ట్రంలో ఏకంగా 737 మంది స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తమ్మీద 18 మంది బీజేపీ రెబెల్స్, 14 మంది కాంగ్రెస్ రెబెల్స్ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం ఆ పారీ్టలపై ఎలా ఉంటుందన్నది ఫలితాల అనంతరమే తేలనుంది. రాష్ట్రంలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మిగతా 4 రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌ను చీల్చొద్దు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓటమి ఫలితాలపై కాంగ్రెస్‌లో ముఖ్యంగా గాంధీ కుటుంబ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక గాంధీ కుటంబ నాయకత్వం పక్కకు తప్పుకోవాల్సిందేనని జీ23 గ్రూపు నేతలు పెద్ద ఎత్తును డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటమికి.. గాంధీ కుటుంబ నాయకత్వం మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదని అన్నారు. పరాజయం బాధ్యత నుంచి ఎవరు పారిపోవడం లేదని.. ఓటమికి తాము బాధ్యత వహిస్తున్నామని గాంధీ కుటుంబం ప్రకటించిందని గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓటమికి తానూ బాధ్యత వహిస్తున్నానని చిదంబరం తెలిపారు. అదే విధంగా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కూడా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు బాధ్యత వహిస్తున్నారని చెప్పారు. జీ 23 గ్రూప్ నేతలు తమ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేయవద్దని చిదంబరం విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆగస్ట్‌లో జరిగే అవకాశం ఉందని, అప్పటివరకు సోనియా గాంధీనే నాయకత్వం వహిస్తారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై గాంధీ కుటుంటాన్ని నిందించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘ఎవరూ బాధ్యత నుంచి పారిపోరు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర AICC(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) స్థాయిలో నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ బాధ్యత ఉంది. ఎన్నికల ఓటమికి కేవలం ఏఐసీసీ నాయకత్వానిదే బాధ్యత అనడం సరికాదు’ అని చిదంబరం అన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలోకి తీసుకురావడానికి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని జీ23 గ్రూపు నేతల్లో ఒకరైన సీనియర్ నేత కపిల్ డిమాండ్ చేస్తున్నారు. -
రెబల్స్‌పై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆగ్రహం
‘‘పార్టీ నిర్ణయమే శిరోధార్యం కావాలి.. కాదు.. కూడదంటే వేటు తప్పదు. మిత్రపక్ష పార్టీలకు కేటాయించిన స్థానాల్లో డీఎంకే రెబల్స్ పోటీ చేయడం తగదు. వెంటనే పట్టణ పంచాయతీ అధ్యక్ష, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రాజీనామా చేసి నాతో భేటీ అవ్వండి లేకుంటే తగిన మూల్యం తప్పదు..’’ అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై: డీఎంకే కూటమి కట్టుబాట్లను అతిక్రమించి, పార్టీ అదేశాలను ధిక్కరించి కొందరు నాయకులు పదవులు చేజిక్కించుకోవడాన్ని సహించేది లేదని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. రెబల్స్ అంతా తమ పదవులకు వెంటనే రాజీనామా సమర్పించి ఆ తరువాత తనను కలవాలని హుకుం జారీ చేశారు. కూటమి నేతల నిరసన డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేషన్, మునిసిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల పదవులకు శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు డీఎంకే అధిష్టానం నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు ధిక్కరించారు. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి.. పదవులను కైవసం చేసుకున్నారు. మునిసిపాలిటీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు సంబంధించి 16 స్థానాలను మిత్రపక్ష వీసీకేకు డీఎంకే కేటాయించింది. అయితే ఏడు స్థానాల్లో డీఎంకే రెబల్స్ పోటీచేసి ఆ పదవులను దక్కించుకున్నారు. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక వీసీకే అధ్యక్షుడు తిరుమాంళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ బహిరంగంగానే నిరసన తెలిపారు. కూటమి పా ర్టీలకు కేటాయించిన పదవుల్లో డీఎంకే కౌన్సిలర్లు పోటీ చేసి పీఠం దక్కించుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడిన స్టాలిన్ చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతలతో శుక్రవారం సాయంత్రం çసమావేశమయ్యారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి పదవులు పొందిన డీఎంకే కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకరిద్దరు ఈ ఆదేశాలకు తలొగ్గి రాజీనామా చేసినా.. అధికశాతం మంది ఆలోచనలో పడ్డారు. రాజీనామా చేయకుండానే స్టాలిన్‌ను కలిసి నచ్చజెప్పాలని, తప్పనిసరైన పక్షంలోనే రాజీనామా చేయాలని వారు భావిస్తున్నారు. చెన్నైలో కమిటీల ఎన్నికకు సన్నాహాలు చెన్నై మేయర్‌గా ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్‌గా మహేష్‌కుమార్ ఎన్నిక పూర్తయ్యింది. చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డుల్లో 80 లక్షల మంది నివసిస్తున్నారు. వీరికి తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం తదితర ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు గాను 15 మండల కమిటీలు, ఆరు స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే వీటికి అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవులకు గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉండటంతో అన్ని కమిటీలనూ ఏకగ్రీవం చేయాలని డీఎంకే భావిస్తోంది. -
తెలుగుదేశం పార్టీలో భగ్గుమన్న అసమ్మతి
సాక్షి, మంత్రాలయం: తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ భగ్గుమంది. ప్రాధాన్యత విషయంలో అలకలు రోడ్డెక్కి కూత పెట్టాయి. తీరు మార్చుకో లేకపోతే మద్దతుకు దూరంగా ఉంటామంటూ నినదించాయి. ఎన్నికల నేపథ్యంలో మంత్రాలయం టీడీపీలో సీనియర్ నేతలు అలకబూనారు. కోసిగి మండల కన్వీనర్ పెండ్యాల ఆదినారాయణశెట్టి, మాజీ సర్పంచు ముత్తురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామకృష్ణ, నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, నర్సారెడ్డి, సొట్టయ్య, సాతనూరు మాజీ సర్పంచు మారెప్ప, నేతృత్వంలో కార్యకర్తలతో తిరుగుబావుట ఎగరేశారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడంలో టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి కినుక వహిస్తున్నారంటూ రోడ్డెక్కారు. గురువారం కోసిగి మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆదినారాయణశెట్టి ఇంటి నుంచి ఎల్లెల్సీ అతిథి గృహం వరకు మౌన ర్యాలీ నిర్వహించారు. అక్కడ నేతలు మాట్లాడుతూ నియోజకవర్గంలో తిక్కారెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తూ సీనియర్ నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇతర పార్టీ నుంచి పార్టీలో చేరిన కొత్త నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ పాత క్యాడెర్‌కు అన్యాయం చేస్తున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన కోసిగి ఆంజనేయస్వామి ట్రస్టుబోర్డు చైర్మన్ నాడిగేని అయ్యన్నకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం సరికాదన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభానికి సైతం తమను పిలవకుండా చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొత్త ముఖాలకు లభిస్తున్న ప్రాధాన్యం పార్టీలో తమకు లేదని మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే ఎన్నికల్లో తమ సహాయ సహకారాలు ఉండబోవని తేల్చి చెప్పారు. పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నా తిక్కారెడ్డి మూలంగా సరైన గుర్తింపు లేకపోయిందన్నారు. ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసి ఇళ్లకే పరిమిత మవుతామన్నారు. ఎల్లెల్సీ అతిథి గృహంతో సమావేశమైన విషయాన్ని తెలుసుకున్న తిక్కారెడ్డి అక్కడికి చేరుకున్నారు. పాత నాయకుల గోడు విని చూస్తాం చేస్తామన్నారు. అయితే లెక్కలేని విధంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ నన్ను నిందించడం సరికాదన్నారు. ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేస్తే బాగుంటుందని హెచ్చరిక దోరణిలో సూచించారు. తర్వాత నాయకులు రాసుకున్న అసమ్మతి పత్రం ఆయనకు అందజేశారు. -
తిరుగుబాటు బావుటా
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ రెండు పార్టీల టికెట్ ఆశించిన నాయకులు నామినేషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లోనూ.. కాంగ్రెస్ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్‌తో పాటు, మహేష్‌కుమార్‌గౌడ్, రత్నాకర్‌లు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు, పార్టీకి అందించిన సేవలు, సర్వే నివేదికల ఆధారంగా అధిష్టానం అర్బన్ టికెట్‌ను డీసీసీ అధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్‌కు ఖరారు చేసింది. దీంతో ఈ టికెట్ ఆశించిన రత్నాకర్ కూడా సోమవారం నామినేషన్ వేయడం జిల్లా కేంద్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను అర్బన్ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని ఆదివారం మీడియాకు రత్నాకర్ సమాచారం అందించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి సమయంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రత్నాకర్ నామినేషన్ వేసేందుకు కార్యాలయంలోకి వెళ్లారు. పార్టీ అధిష్టానంతో పాటు, జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో తాహెర్‌కు అందరివాడుగా పేరుంది. టికెట్ రేసులో ఉన్న మహేష్‌కుమార్‌గౌడ్ కూడా తాహెర్‌కు మద్దతు పలికారు. మహేష్ త్యాగం చేయడంతోనే తనకు అభ్యర్థిత్వం దక్కిందని తాహెర్ పేర్కొన్నారు. ఈ తరుణంలో రత్నాకర్ తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి షాక్. రెబల్స్ బెడద బీజేపీకి కూడా తప్పడం లేదు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ టికెట్ ఆశించిన ధన్పాల్ సూర్యనారాయణగుప్త సోమవారం నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ధన్పాల్ శివసేన టికెట్‌పై బరిలోకి దిగాలని నిర్ణయించారు. దీంతో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థి బెడద కొనసాగనుంది. అర్బన్ స్థానం బీజేపీ అభ్యర్థిత్వం మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణకు లభించింది. ఈ టికెట్ కోసం ధన్ పాల్ గట్టి ప్రయత్నాలు చేసి విఫలమయ్యా రు. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసిన ధన్పాల్ చివరకు పోటీ చేయాలని నిర్ణయించారు. నాయుడు ప్రకాశ్ సైతం నామినేషన్ జుక్కల్ బీజేపీ టికెట్ విషయంలో తనకు అన్యాయం చేశారని నిరసిస్తూ ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి నాయుడు ప్రకాష్ సైతం శనివారం నిజామాబాద్ అర్బన్ స్థానానికి నామినేషన్ వేసిన విషయం విదితమే. అయి తే నాయుడు ప్రకాష్‌కు బీజేపీ అధిష్టానం బా న్సువాడ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఆయన బాన్సువాడ స్థా నానికి కూడా నామినేషన్ వేశారు. అర్బన్ స్థానానికి ఆయన వేసిన నామినేషన్‌ను ఉప సంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నా యి. జిల్లాలో బీజేపీకి పట్టున్న స్థానాల్లో ఒకటైన నిజామాబాద్అర్బన్లో రెబల్ అభ్యర్థి బరిలోకి దిగడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇలా తిరుగుబాటు బావు టా ఎగురవేసిన అభ్యర్థులు పార్టీ బుజ్జగింపులకు తలొగ్గి నామినేషన్లను ఉపసంహరించుకుంటారా..? లేక బరిలో ఉంటారా..? అనే అంశం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 22 తర్వాతే తేలనుంది. -
భగ్గుమన్న అసమ్మతి
టికెట్లు అమ్ముకున్నారంటూ అధినేత చంద్రబాబుపై టీడీపీ నేతల విమర్శలు టికెట్ దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నేడు నామినేషన్ దాఖలుకు సన్నాహాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చివరి రోజున నామినేషన్‌ను దాఖలు చేయడానికి సిద్ధమవుతోండడం టీడీపీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్లుగా వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న టీడీపీ ఉనికిని సార్వత్రిక ఎన్నికల్లో చాటిచెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని భావించిన ఆయన.. ప్రజావ్యతిరేకతను ధనాస్త్రంతో ఎదుర్కోవాలని ఎత్తు వేశారు. ఆ క్రమంలోనే ధనబలం ఉన్న నేతలకు తన కోటరీలోని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనాచౌదరి, గరికపాటి మోహన్‌రావుల ద్వారా వల విసిరారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు ఇదే రీతిలో వల విసిరారు. బండారు రవికుమార్‌నూ ఇలాగే దగ్గరకు తీశారు. సొంత పార్టీలో ప్రజాబలం లేకపోయినా.. ధనబలం ఉన్న వారికే టికెట్లు ఇచ్చారు. ఇది దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకున్న నేతలకు మింగుడుపడకుండా చేసింది. తనను కాదని రాయదుర్గం టికెట్ కాలవ శ్రీనివాసులుకు ఇవ్వడంతో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డి తేనెతుట్టెను కదిపారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారని దీపక్‌రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది. ఇప్పుడు అనంతపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్ కూడా అదే రీతిలో స్పందించారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నిన్నటి వరకూ ఉప్పునిప్పుగా ఉన్న మహాలక్ష్మి శ్రీనివాస్, ప్రభాకర్‌చౌదరిలు ఇద్దరూ సంయుక్తంగా కార్యకర్తల సమావేశం నిర్వహించి.. పార్టీని నమ్ముకుని పనిచేస్తోన్న వారిని కాదని మరొకరికి టికెట్ ఇస్తే తమలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని హెచ్చరించారు. టీడీపీని నమ్ముకుంటే బజారున పడాల్సిందేనని ఆరోపించారు. మహాలక్ష్మి శ్రీనివాస్, ప్రభాకర్ చౌదరి ఏకమవడం వెనుక ఓ కారణం ఉంది. వీరిద్దరినీ కాదని అనంతపురం టీడీపీ అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్, ధనవంతుడైన అమిలినేని సురేంద్రబాబుకు టికెట్ ఇవ్వాలని సీఎం రమేష్ ప్రతిపాదించారు. అమిలినేని సురేంద్రబాబు నుంచి భారీ ఎత్తున డబ్బు దండుకోవడం వల్లే సీఎం రమేష్ ఆయన పేరును ప్రతిపాదించారన్నది ఆ ఇద్దరి వాదన. సీఎం రమేష్ ద్వారా బేరసారాలు సాగిస్తోన్న చంద్రబాబు.. అమిలినేని సురేంద్రబాబు వైపు మొగ్గడమే ఆ ఇద్దరు నేతలను అసంతృప్తికి గురిచేసింది. తమను కాదని మరొకరికి టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ఆ ఇద్దరూ స్పష్టీకరించారు. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ప్రభాకర్ చౌదరి, శాసనసభ స్థానం నుంచి మహాలక్ష్మి శ్రీనివాసులు శనివారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చివరి నిముషంలో టికెట్‌ను నిరాకరించడంతో బండారు రవికుమార్ సైతం శనివారం శింగనమల నుంచి రెబల్‌గా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. రాయదుర్గం నుంచి దీపక్‌రెడ్డి, మడకశిర నుంచి వెంటకటస్వామిలు రెబల్స్‌గా బరిలోకి దిగడం ఖాయం. ధర్మవరం టీడీపీ టికెట్‌ను ఆశించిన గోనుగుంట్ల విజయ్‌కుమార్.. టికెట్ దక్కకపోవడంతో శనివారం రెబెల్‌గా నామినేషన్ వేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా గుంతకల్లును బీజేపీకి కేటాయించారు. ఈ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన సాయినాథ్‌గౌడ్ సోదరుడు జితేందర్‌గౌడ సైతం శనివారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. బేరసారాల ద్వారా ధనవంతులకు టీడీపీ టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు సొంతపార్టీ నేతల నుంచే వస్తోండటంతో టీడీపీ ఇరకాటంలో పడింది. టికెట్లు అమ్ముకోవడంపై ప్రజలు చీదరిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.