- టికెట్లు అమ్ముకున్నారంటూ అధినేత చంద్రబాబుపై టీడీపీ నేతల విమర్శలు
- టికెట్ దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నేడు నామినేషన్ దాఖలుకు సన్నాహాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చివరి రోజున నామినేషన్‌ను దాఖలు చేయడానికి సిద్ధమవుతోండడం టీడీపీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్లుగా వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న టీడీపీ ఉనికిని సార్వత్రిక ఎన్నికల్లో చాటిచెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని భావించిన ఆయన.. ప్రజావ్యతిరేకతను ధనాస్త్రంతో ఎదుర్కోవాలని ఎత్తు వేశారు. ఆ క్రమంలోనే ధనబలం ఉన్న నేతలకు తన కోటరీలోని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనాచౌదరి, గరికపాటి మోహన్‌రావుల ద్వారా వల విసిరారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు ఇదే రీతిలో వల విసిరారు.
బండారు రవికుమార్‌నూ ఇలాగే దగ్గరకు తీశారు. సొంత పార్టీలో ప్రజాబలం లేకపోయినా.. ధనబలం ఉన్న వారికే టికెట్లు ఇచ్చారు. ఇది దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకున్న నేతలకు మింగుడుపడకుండా చేసింది. తనను కాదని రాయదుర్గం టికెట్ కాలవ శ్రీనివాసులుకు ఇవ్వడంతో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డి తేనెతుట్టెను కదిపారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారని దీపక్‌రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది.
ఇప్పుడు అనంతపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్ కూడా అదే రీతిలో స్పందించారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నిన్నటి వరకూ ఉప్పునిప్పుగా ఉన్న మహాలక్ష్మి శ్రీనివాస్, ప్రభాకర్‌చౌదరిలు ఇద్దరూ సంయుక్తంగా కార్యకర్తల సమావేశం నిర్వహించి.. పార్టీని నమ్ముకుని పనిచేస్తోన్న వారిని కాదని మరొకరికి టికెట్ ఇస్తే తమలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని హెచ్చరించారు.
టీడీపీని నమ్ముకుంటే బజారున పడాల్సిందేనని ఆరోపించారు. మహాలక్ష్మి శ్రీనివాస్, ప్రభాకర్ చౌదరి ఏకమవడం వెనుక ఓ కారణం ఉంది. వీరిద్దరినీ కాదని అనంతపురం టీడీపీ అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్, ధనవంతుడైన అమిలినేని సురేంద్రబాబుకు టికెట్ ఇవ్వాలని సీఎం రమేష్ ప్రతిపాదించారు. అమిలినేని సురేంద్రబాబు నుంచి భారీ ఎత్తున డబ్బు దండుకోవడం వల్లే సీఎం రమేష్ ఆయన పేరును ప్రతిపాదించారన్నది ఆ ఇద్దరి వాదన.
సీఎం రమేష్ ద్వారా బేరసారాలు సాగిస్తోన్న చంద్రబాబు.. అమిలినేని సురేంద్రబాబు వైపు మొగ్గడమే ఆ ఇద్దరు నేతలను అసంతృప్తికి గురిచేసింది. తమను కాదని మరొకరికి టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ఆ ఇద్దరూ స్పష్టీకరించారు. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ప్రభాకర్ చౌదరి, శాసనసభ స్థానం నుంచి మహాలక్ష్మి శ్రీనివాసులు శనివారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
చివరి నిముషంలో టికెట్‌ను నిరాకరించడంతో బండారు రవికుమార్ సైతం శనివారం శింగనమల నుంచి రెబల్‌గా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. రాయదుర్గం నుంచి దీపక్‌రెడ్డి, మడకశిర నుంచి వెంటకటస్వామిలు రెబల్స్‌గా బరిలోకి దిగడం ఖాయం. ధర్మవరం టీడీపీ టికెట్‌ను ఆశించిన గోనుగుంట్ల విజయ్‌కుమార్.. టికెట్ దక్కకపోవడంతో శనివారం రెబెల్‌గా నామినేషన్ వేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా గుంతకల్లును బీజేపీకి కేటాయించారు.
ఈ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన సాయినాథ్‌గౌడ్ సోదరుడు జితేందర్‌గౌడ సైతం శనివారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. బేరసారాల ద్వారా ధనవంతులకు టీడీపీ టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు సొంతపార్టీ నేతల నుంచే వస్తోండటంతో టీడీపీ ఇరకాటంలో పడింది. టికెట్లు అమ్ముకోవడంపై ప్రజలు చీదరిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.