దుమ్మురేపిన కోలకతా ఐఐఎం
కోల్‌కతా : దేశంలోని అతిపెద్ద కోలకతా ఐఐఎం విద్యార్థులు అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీలతో మరోసారి దుమ్ము రేపారు. మూడు రోజుల రిక్రూట్ మెంట్ ప్రక్రియలో మొత్తం 100 శాతం ప్లేస్‌మెంట్స్‌తో బీ స్కూల్ రికార్డు సృష్టించినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఫిబ్రవరి రెండవ వారంలో మొత్తం 474 టాప్ జాబ్ లను సాధించినట్టు ఐఐఎం కలకత్తా ఒక ప్రకటనలో తెలిపింది . అలాగే 2017 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఈ ఏడాదికి అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీని అందుకున్నామన్నారు. రూ. 63 లక్షలు (90,000యూరోల) భారీ వేతన ఆఫర్ తమ విద్యార్థి సాధించినట్టు చెప్పారు. అలాగే దేశీయంగా అత్యధిక ప్యాకేజీ రూ.70లక్షల(సంవత్సరానికి)ని తెలిపారు.
ఫైనాన్షియల్ సెక్టార్స్‌లో అత్యధికంగా 29 శాతం ఆఫర్లు వచ్చాయి. అవెందూస్, ఎడెల్వీస్, గోల్డ్‌మ్యాన్ సాచీ, హెఎస్ బీసీ టాప్ రిక్రూటర్లుగా నిలిచాయి. కన్సల్టింగ్ సెక్టార్ లో 22 శాతంతో రెండవస్థానంలో నిలచింది. ఈ రంగం లో యాక్సెంచర్, ఏటీ కీర్నే, బైన్, బీసీజీ అండ్ మెకిన్సే ఉన్నాయి. బీజీ, సికె బిర్లా, టీఏఎస్ లాంటి టాప్ జనరల్ మేనేజ్మెంట్ సంస్థలు 15శాతం నియమించుకున్నాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ 12శాతం హెచ్ యూఎల్, ఐటిసి, ప్రోక్టర్ అండ్గ్యాంబుల్, రెక్కిట్ బెంకైజెర్ వంటి సంస్థల ఉన్నాయి. వీటితోపాటుగా, అమెజాన్, విప్రో లాంటి ఇతర కామర్స్, ఐటి సంస్థలు కూడా 14శాతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టు బీ స్కూల్ వెల్లడించింది.