ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
ఆళ్లగడ్డ(కర్నూలు జిల్లా): అక్రమంగా 21 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎనిమిది మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బుధవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఆహోబిలం అటవీ ప్రాంతంలో జరిగింది.
వివరాలు.. ఆహోబిలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి ఎనిమిది మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 5లక్షలు విలువ చేసే 21 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.