reddy mahagarjana
-
రెడ్డి అనేది కులం కాదు గుణం : గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సాక్షి, సత్తెనపల్లి: రెడ్డి అనేది కులం కాదు గుణం అని, అన్ని వర్గాలను కలుపుకొని వారికి సాయం అందిస్తూ ముందుకు సాగాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని ఏజీకేఎం కళాశాలలో ఆదివారం రెడ్డిజన సేవా సమితి అధ్యక్షుడు బాసు లింగారెడ్డి అధ్యక్షతన రెడ్ల వనసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, మనతో పాటు వచ్చే కులాలు, మతాలను కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారన్నారు.పెన్షన్ నుంచి ఇల్లు కట్టుకునేదాకా ఒక పార్టీకి, ఒక వర్గానికే ఈ రోజు పనులు జరుగుతున్నాయన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని తెలిపారు. గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రెడ్లకు రాజ్యాధికారం రావాలంటే అన్ని కులాలను ప్రేమించే మంచి మనస్సు ఉండాలని, ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే ధనం కావాలన్నారు. వైఎస్సార్ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి రెడ్లు ఎనలేని సేవలు అందించారన్నారు. వారి సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా పుస్తకాలు ప్రచురించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆరిమండ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ రెడ్డి ఒక కులం కాదని, ఒక టైటిల్ అన్నారు. రాబోయే రోజుల్లో అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నలందా ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి ఆరిమండ విజయశారదారెడ్డి, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.గీతాహాసంతి, డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, డాక్టర్ ఎస్.రాజమోహన్‌రెడ్డి, డాక్టర్ షకీలా శ్రీధర్, చెన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వెన్నా సాంబశివారెడ్డి, యేరువ ప్రతాపరెడ్డి, న్యాయవాది మర్రి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. ముందుగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్ఎస్పీ ఏఈగా పనిచేస్తూ మృతి చెందిన ఇనగంటి హిమబిందు మృతికి మౌనం పాటించారు. ఈ సందర్భంగా మహిళలకు వివిధ లక్కీ డిప్లు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ కొమ్మారెడ్డి చెంచిరెడ్డి, ముప్పాళ్ల మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఇందూరి నరిసింహారెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, యాంపాటి కోటిరెడ్డి, అచ్చిరెడ్డి, అల్లు మధుసూదన్‌రెడ్డి, కొమ్మారెడ్డి సాయిరెడ్డి పాల్గొన్నారు. -
80 శాతం నిరుపేదలే
హైదరాబాద్ : రెడ్డి కులస్తులను రోడ్ల మీదకు తీసుకువచ్చింది పాలక వర్గాలేనని గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెడ్ల సమరభేరి కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ మాట్లాడుతూ..80 శాతం రెడ్లు నిరుపేదలేనని వ్యాఖ్యానించారు. విద్య, ఉద్యోగాల్లో రెడ్లకు తీరని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రెడ్లతో పాటు బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, వెలమ, ఇతర అగ్ర కుల నిరుపేదలందరికీ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈబీసీ కుటుంబాలకు విద్య, ఉద్యోగాల్లో న్యాయం చేసే విధంగా రాహుల్ గాంధీకి విన్నవించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపర్చారని పేర్కొన్నారు. కులమే రెడ్డిలకు శత్రువని రెడ్డి పేదలు నిరుత్సాహంతో ఉన్నారని చెప్పారు. రెడ్ల సమరభేరికి మా పార్టీ తరపున పూర్తి మద్ధతు ఇస్తామని తెలిపారు. -
శాసించే స్థాయికి ఎదగాలి
- రెడ్డి మహాగర్జనలో నేతలు - రెడ్డి వర్గానికి రెడ్డి నాయకులే శత్రువులుగా మారారు.. - రూ.వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: రేవంత్‌రెడ్డి మేడ్చల్: రెడ్లు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసి డెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెళ్లిలోని సాకేత్ భూసత్వ వెంచర్లో ఆదివారం రాత్రి రెడ్డి జాతీయ ఐక్య వేదిక ఏర్పాటు చేసిన రెడ్డి మహాగర్జనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘రెడ్లు పది మందికి అన్నం పెట్టేవారు. అలాంటి వర్గం ప్రభు త్వాల నిర్లక్ష్యానికి గురై నేడు ఆశించే స్థాయికి దిగజారింది. రెడ్డి వర్గానికి రెడ్డి నాయకులే శత్రువులుగా మారారు. రెడ్ల ఐక్యత కోసం సమావేశం ఏర్పాటు చేస్తే మెజారిటీ నాయ కులు రాకపోవడం దురదృష్టకరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లకు గుర్తింపు లేకుండా పోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెడ్లు ముందుకు కదిలితే పాలకులు ఎందుకు దిగిరారని ప్రశ్నించారు. రూ.వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే ఆంధ్రలో కాపుల మాదిరి పోరాడి సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కళాశాలలకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విధిగా విడుదల చేయడం వల్ల అధికంగా విద్యాసంస్థలు నడిపే రెడ్డి వ్యా పారులు బాగుపడ్డారని, కాని నేటి ప్రభుత్వం విద్యాసంస్థలు రెడ్లవి అనే అక్కసుతో నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. అర్థం కాని ప్రశ్న..: డీకే అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ, రెడ్ల సమావేశాలకు రెడ్డి నాయకులు రాక పోవ డం అర్థం కాని ప్రశ్నలా ఉందన్నారు. రెడ్డి మహాగర్జన ఎవరికీ వ్యతిరేకం కాదని, రెడ్లకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తడానికి నిర్వహించిందేనని అన్నారు. వైఎస్ హ యాంలో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి సామా జిక వర్గ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పొంది విద్యావంతులయ్యారని చెప్పారు. జేసీ.. కూర్చో..! అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన మార్కు ప్రసంగంతో సభికులను కాసేపు నవ్వించినా.. తర్వాత బోర్ కొట్టడంతో సభి కులు కూర్చో.. కూర్చో.. అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన అలిగి వేదిక దిగి పోతుండగా.. ఐక్యవేదిక నాయకులు బతి మాలగా కాసేపు కూర్చొని వెళ్లిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్‌లో రెడ్లులు సీఎం కాలేరని, వైఎస్ తన మిత్రుడు అంటూనే ఆయన ప్రవేశ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పనికిమాలిన వారంతా ఇంజనీర్లు అయ్యారని అనడంతో సభికులు అసహనానికి గురయ్యారు. ప్రెస్ గ్యాలరీలో కొంతమంది వైఎస్ జగన్ అభిమానులు ‘జై జగన్’ అంటూ నినదించడంతో.. కస్సుబుస్సుమంటూ మైక్ ఇచ్చి వేదికపై ఉన్నవారితో గొడవపడుతూ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, ఐక్య వేదిక నాయకులు హరివర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి, నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు రెడ్డి మహాగర్జన
విజయవంతం చేయాలని జి.కరుణాకర్‌రెడ్డి పిలుపు సాక్షి, హైదరాబాద్: జాతీయ రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 14న హైదరాబాద్‌లోని మేడ్చల్ చెక్‌పోస్టు సమీపంలో ‘రెడ్డి మహాగర్జన’ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రెడ్డి సంఘాల ప్రతినిధులు శుక్ర వారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమై గర్జన ఏర్పాట్లను సమీక్షించారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలకతీతంగా రెడ్ల అభివృద్ధి, వారి సంక్షేమం, ఐక్యత ధ్యేయంగా నిర్వహించే ఈ రెడ్డి మహాగర్జన చరిత్రలో నిలిచిపోతుందని జాతీయ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఏపీలతోపాటు పలు రాష్ట్రాల్లో నివసిస్తున్న రెడ్డి సామాజిక వర్గ ప్రతినిధులను మహాగర్జనకు ఆహ్వానించామన్నారు. ఈ సభను విజయవంతం చేయాలన్నారు. -
14న రెడ్డి మహాగర్జన
కర్నూలు(అర్బన్): హైదరాబాద్ మేడ్చల్ చెక్‌పోస్టు సమీపంలోని సాకేత్ భూసత్వా మైదానంలో ఈ నెల 14వ తేదీన రెడ్డి మహాగర్జన కార్యక్రమం జరుగుతున్నదని జిల్లా రెడ్డి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొనపాటి యల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక గణేష్‌నగర్‌లోని రెడ్డి భవన్లో మహా గర్జనకు సంబంధించిన పోస్టర్లను నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహాగర్జనలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన రెడ్డి ప్రజా ప్రతినిధులందరూ హాజరువుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డి యువజన సంఘం నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి, ఏ హనుమంతరెడ్డి, తూంకుంట ప్రతాపరెడ్డి, ఎదురూరు రాకేష్‌రెడ్డి, పల్లె శశిధర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, సర్వేశ్వరరెడ్డి, సంపతి లక్ష్మికాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.