ఏళ్ల తరబడి దినసరి బతుకులే
సాక్షి, పాడేరు (విశాఖపట్నం): ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని వసతిగృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు రెగ్యులరైజేషన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలంటూ అనేక సార్లు పోరాట చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు మినహా గత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వీరి గోడు అరణ్యరోదనగా మిగిలిపోయింది. ఏజెన్సీ 11 మండలాల్లోని 122 ఆశ్ర మ ఉన్నత పాఠశాలల వసతిగృహాలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు అనుసంధానంగా 49 పోస్టుమెట్రిక్ హాస్టళ్లను గిరిజన సంక్షేమశాఖ నిర్వహిస్తోంది. వీటిలో ఏటా 44వేల మంది గిరిజన విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆశ్రమోన్నత పాఠశాలల వసతిగృహాల్లో 360 నుంచి 500 మంది వరకు ఒక్కోదానిలో ఉంటున్నారు.
విద్యార్థుల సంఖ్యకనుగుణంగా సిబ్బంది లేరు. ఒక్కో హాస్టల్లో ముగ్గురేసి ఉంటున్నారు. ఒక హాస్టల్‌కు కుక్, కమాటీ, వాచ్మెన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆశ్రమ వసతిగృహాలకు స్వీపర్ పోస్టులు మంజూరు కాలేదు. 500 మంది విద్యార్థులున్న హాస్టళ్లలో సిబ్బంది, వర్కర్ల కొరత సమస్య ఎక్కువగా ఉంటోంది. ఇటువంటి వాటిల్లో కనీసం ఆరుగురు వర్కర్లు ఉండాలి. ఉన్న ముగ్గురుతోనే నెట్టుకొస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరు అనారోగ్యానికి గురైనా ఆ రోజు విద్యార్థులకు సకాలంలో భోజనం అందని దుస్థితి నెలకొంటోంది. ప్రస్తుతం ఈ వసతిగృహాల్లో రెగ్యులర్ వర్కర్లు 125 మంది మాత్రమే ఉన్నారు. డైలీవేజ్‌పై 107 మంది, ఔట్‌సోర్సింగ్‌పై 248 మంది పనిచేస్తున్నారు. మంజూరైన వర్కర్ పోస్టుల్లో ఇంకా 80 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది.
కనీస వేతనానికి దూరం..
ఒక్కరోజు కూడా విరామం లేకుండా హాస్టళ్లలో పనిచేస్తున్న వీరు కనీస వేతనానికి నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఆశ్రమాల్లో పనిచేస్తున్న 107 మంది డైలీవేజ్ వర్కర్లకు కలెక్టర్ గెజిట్ ప్రకారం నెలకు రూ.12,400లు, ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న 248 మంది క్యాజువల్ వర్కర్లకు 151 జీవో ప్రకారం నెలకు రూ.12వేల వేతనం పొందుతున్నారు. వీరితో పాటు సమానంగా వసతిగృహాల్లో విధులు నిర్వర్తించే రెగ్యులర్ వర్కర్లకు సీనియారిటీని బట్టి నెలకు సుమారు రూ.25వేలు నుంచి రూ. 50వేలు వరకు వేతనం పొందుతున్నారు. ఇలా దీర్ఘకాలంగా డైలీవేజ్‌పై పనిచేస్తున్న వర్కర్లకు సర్వీస్ క్రమబ ద్దీకరణ విషయంలో, వేతనాల చెల్లింపులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ వర్కర్లలో ఎవరైనా అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రయోజనం చేకూరడంలేదు. ఉపాధి కల్పించడం లేదు. ఇలా వీరు దిక్కుతోచని స్థితితో ఎదుగూబొదుగూ లేకుండా ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారు.
వర్కర్లకు పనిభారం..
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వర్కర్లకు పనిభారం ఏటేటా పెరిగిపోతోంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, పిల్లల సంఖ్య పెరగడంతో ఉన్నవారిపై పని ఒత్తిడి పడుతోంది. నాలుగైదేళ్లలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా ఆంగ్ల మాద్యమంలో విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందుకు తగ్గట్టుగా వర్కర్ పోస్టులు అదనంగా మంజూరు కాలేదు. దీనికి తోడు విద్యార్థులకు పెట్టే మెనూ కూడా పెంచారు. ఉదయం అల్పాహారంతో పాటు రెండు పూటలా భోజనం, సాయంత్రం స్నాక్స్ వండి వడ్డించడంతో వర్కర్లపై పనిభారం పడుతోంది.
డైలీవేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి..
ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలి. జీవో నంబర్ 212 ప్రకారం అర్హత కలిగిన డైలీవేజ్ వర్కర్లు 100 మందికి పైగా ఉన్నాం. మృతి చెందిన డైలీవేజ్ వర్కర్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు. తాము పర్మినెంట్‌కు నోచుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం. అన్ని విధాల మాకు అన్యాయం జరుగుతోంది. వేసవి సెలవుల్లో డ్యూటీలు, వేతనాలు ఉండవు. జీతాలు ప్రతినెలా సక్రమంగా అందడం లేదు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో వర్కర్లను పెంచాలి.
–పి.బాలన్న, డైలీవేజ్ వర్కర్, సీఏహెచ్ స్కూల్, తలారిసింగి
రెగ్యులరైజేషన్‌కు ప్రతిపాదించాం
212 జీవో ప్రకారం అర్హులైన డైలీవేజ్ వర్కర్ల రెగ్యులరైజేషన్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. హాస్టళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరాం. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక వర్కర్ చొప్పున అదనంగా వర్కర్లను నియమించేందుకు ప్రతిపాదించాం.
–జి.విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, ఐటీడీఏ, పాడేరు.