రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ మరింత ఆలస్యం కానుంది.
- హైకోర్టులో కేసు కొలిక్కి రాకపోవడమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ మరింత ఆలస్యం కానుంది. సర్వీసు క్రమబద్ధీకరణ విషయంలో హైకోర్టులో కేసు పరిష్కారానికి మరింత ఎక్కువ సమయం పట్టనుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల పెంపునకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. వారికి ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 18 వేల వేతనాన్ని రూ. 27 వేలకు పెంచుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపింది. ఇందుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఆయా లెక్చరర్లకు వేతనాలు పెరగనున్నాయి. అనంతరం డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్లకూ వేతనాలు పెంచే అవకాశం ఉందని బోర్డు వర్గాల సమాచారం.
క్రమబద్ధీకరణ అంత సులభమా?
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో భాగంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2015లోనే జీవో 16 జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఓయూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో క్రమబద్ధీకరణ జరగలేదు. వాస్తవానికి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అమలులో ఉన్న సర్వీసు నిబంధనలు, నోటిఫికేషన్ ఆధారంగానే క్రమబద్ధీకరణ చేయవచ్చని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 2015లో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టింది. 2014 జూన్ 2 నాటికి సర్వీసులో కొనసాగుతూ అన్ని అర్హతలు ఉండి, మంజూరైన పోస్టుల్లో పని చేస్తున్న వారి వివరాలను పంపాలని జిల్లాల అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్టే విధించాలంటూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని తేల్చేవరకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వబోమని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు స్టే ఇవ్వలేదు.
50 శాతం పెంపునకే మొగ్గు
క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 14ను జారీ చేసింది. గతంలో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆ కేడర్‌లో కనీస వేతనాలివ్వాలని జారీ చేసిన జీవో 3ను సవరించి జీవో 14ను జారీ చేసింది. కనీస వేతనంతోపాటు ప్రస్తుత వేతనంలో 50% పెంచాలని, ఆ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని వర్తింపజేయాలని పేర్కొంది. కానీ 50% వేతనా ల పెంపునకే బోర్డు మొగ్గు చూపుతోంది.