
ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ముందడుగు పడింది. క్రమబద్ధీకరణకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలను శాఖల వారీగా వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు లేఖలు రాసింది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించేం దుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది.
వాస్తవా నికి 2016 ఫిబ్రవరి 26న కూడా ఇదే తరహాలో ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులను కోరింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ కొం దరు హైకోర్టును ఆశ్రయించడంతో 2017 ఏప్రిల్ 26న కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కార ణంగా ఈ ప్రక్రియకు అంతరాయం కలిగింది. అయితే 2021 డిసెంబర్ 7న హైకోర్టు రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, ఇకపై కాం ట్రాక్టు పద్ధతిలో నియామకాలు ఉండబోవని ప్రక టించారు.