చికిత్స కోసం వస్తే... చూపు పోయేలా...
* పీహెచ్సీ సిబ్బంది నిర్వాకం
* ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు
దుగ్గొండి : కంటికి దురద ఉందని చికిత్స కోసం సర్కారీ దవాఖానకు వెళితే సిబ్బంది ఇచ్చిన చుక్కల మందుతో ఉన్న చూపే పోయే పరిస్థితి నెలకొంది. దుగ్గొండి మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన దళితుడు బోయిన మల్లేష్‌కు కంటి దురదతోపాటు మంట ఉండడంతో ఈ నెల 8న మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడ అప్పటికి వైద్యుడు లేడు. డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు భోజనానికి వెళ్లిన సమయంలో ఆస్పత్రి సిబ్బందికి చూపించుకున్నాడు. వారు ఓపీ రిజిస్టర్లో పేరు రాసి కంటికి సంబంధించిన డిసీజ్‌గా గుర్తించి చుక్కల మందుతో పాటు 10 ఏవిల్ ట్యాబ్లెట్లు ఇచ్చారు.
జెంటామైసిన్ చుక్కల మందుకు బదులు మలేరియా వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్షలో ఉపయోగించే మలేరియా ఏజీ.పీ.ఎప్.పీవీ చుక్కల మందును నిర్లక్ష్యంగా అందించారు. బాధితుడు ఇంటికి వెళ్లి చుక్కల మందు కంట్లో వేసుకున్నాడు. కొంత సేపటి తర్వాత కండ్లు విపరీతంగా మంటలు వచ్చాయి. ఆ తర్వాత మరుసటి రోజు 9న దుగ్గొండి పీహెచ్‌సీకి రాగా సిబ్బంది పరిశీలించి వరంగల్‌కు వెళ్లాలని సెలవిచ్చారు. దీంతో ఆయన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు.
కళ్ల శుక్లాలకు ప్రమాదం ఉందని 10 రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని సూచించాడు. చేతిలో చిల్లిగవ్వలేక తిరిగి ఇంటికి వచ్చి బుధవారం ఉదయం దుగ్గొండి పీహెచ్‌సీకి బంధువులతో కలిసి వచ్చి ఆందోళనకు దిగాడు. వైద్యాధికారి కొంరయ్యతో వాగ్వాదానికి దిగారు. తాను వైద్యం చేయలేదని తప్పుడు వైద్యం అందించిన వ్యక్తిని గుర్తించి చర్య తీసుకుంటానని చెప్పారు. వెంటనే బాధితుడిని 108 వాహనంలో వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రికి పంపించారు. ఈ ఆందోళనలో టీఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ముక సంజీవ, బొట్ల నరేష్, బట్టు సాంబయ్య ఉన్నారు.