విద్యార్థుల జీవితాలతో ఆటాడుతున్న ప్రభుత్వం
షరతుల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలామ్ బాబు
నెల్లూరు (సెంట్రల్): విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సలామ్‌బాబు ధ్వజమెత్తారు. ఎలాంటి షరతుల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. సలామ్‌బాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎలాంటి షరతుల్లేకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారన్నారు.
ఈ పథకంపై ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్‌పై టీడీపీ ప్రభుత్వం దెబ్బకొడుతోందని మండిపడ్డారు. ఆధార్‌కార్డు, పాన్‌కార్డు తదితర షరతులతో లబ్ధిదారులను తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పథకాన్ని దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలు సమయానికి అందడం లేదన్నారు.
గడువును నెల రోజులు పెంచాలని కోరారు. విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల జారీకి తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికలకు ముందు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని బీరాలు పలికిన చంద్రబాబు తనకు అధికారం చేతికి రాగానే విద్యార్థులపై కక్ష సాధింపు ధోరణితో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
అనంతరం జేసీ రేఖారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్, నాయకులు, ఎస్.విశ్వ, బి.సత్య, హరి, పి.అకిల్, ఎస్కే హాజీ, శివ, బి శివ, ఎస్కే కరిముల్లా, జగదీష్, తులసి, నికిల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.