'లాడెన్ భుజం మీదుగా మాపై తూటాలు'
జెనీవా: 'ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటూ అమెరికా, ఈయూలు పాకిస్థాన్ కు ఆయుధాలిస్తున్నాయి. వాస్తవం ఏమంటే పాకిస్థానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అల్ కాయిదా లీడర్ బిన్ లాడెన్ ఉదంతంలోనూ ఇది నిజమని తేలింది. ఒకవైపు లాడెన్ ను వేటాడేందుకు అమెరికా పాక్ కు భారీ ఎత్తున ఆయుధాలిచ్చింది. తీరా చూస్తే లాడెన్ పాకిస్థాన్ లోనే ఆశ్రయం పొందడం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. లాడెన్ భుజం మీదుగా పాకిస్థాన్ పేల్చిన తుపాకి తూటాలకు బలైంది మా(బెలూచిస్థాన్) ప్రజలే' అంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల వేదికపై ఉద్వేగంగా ప్రసంగించారు బెలూచిస్థాన్ ప్రతినిధి మెహ్రాన్.
పాకిస్థాన్‌కు అణుసామర్థ్యం గల ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల్ని అమ్మాలన్న అమెరికా నిర్ణయాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తోన్న మెహ్రాన్.. శనివారం జనీవాలో జరిగిన ఐక్యర్యాజ్యసమితి మానవహక్కుల కమిషన్ వార్షిక సమావేశంలోనూ తన వాణిని వినిపించారు. అమెరికా, యురోపియన్ యూనియన్లు అందిస్తోన్న ఆయుధాలను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తున్నదని, బెలూచిస్థాన్ ప్రజలను అంతం చేసేందుకు వాటిని వినియోగిస్తున్నదని మెహ్రాన్ ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రపంచదేశాలు పాకిస్థాన్ కు ఆయుధాలివ్వటం మానేయాలని, ఆమేరకు ఐక్యరాజ్యసమితి కృషిచేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
బెలూచిస్థాన్ బాధేంటి?
పాకిస్థాన్ లోని నాలుగు ఫ్రావిన్స్ లలో బెలూచిస్థాన్ ఒకటి. క్వెట్టా ప్రధాన నగరంగా ఉన్న ఈ ప్రాంతం 1947కు ముందు స్వతంత్ర్య రాజ్యం. ఇండియా నుంచి విడిపోయిన తర్వాత పాక్ సైన్యాలు బెలూచిస్థాన్ ను ఆక్రమించుకున్నాయి(1948 ఏప్రిల్ లో). పాక్ పాలనలో జీవించబోమంటూ బెలూచిస్థాన్ ప్రజలు అనేక ఆందోళనలు చేశారు. అయితే, ఈ ఆందోళనలను పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచి వేస్తూనే ఉంది.
పాక్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే... వారిని, వారి కుటుంబీకులను గుట్టు చప్పుడు కాకుండా, మూడో కంటికి తెలికుండా పాక్ సైన్యం అత్యంత దారుణంగా హతమారుస్తోంది. ఈ క్రమంలోనే వంద మంది చిన్నారులను పాక్ సైన్యం కాల్చి చంపింది. ఈ దారుణం వెలుగు చూడటంతో, బెలూచ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్ర రూపం దాల్చాయి. మీ రాక్షస పాలన మాకు వద్దంటూ, బెలూచ్ ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేశారు.
బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ సైన్యాలు సాగిస్తోన్న అకృత్యాలివి(పాత ఫొటోలు)