ఏపీని అన్ని విధాలా ఆదుకోండి
- ప్రత్యేక హోదా ఇవ్వండి.. రాష్ట్రపతికి జగన్ విజ్ఞప్తి
- వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయండి
- పోలవరాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలి
- పట్టిసీమను నిలిపివేయమని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలి
- రాజధాని పేరుతో పంటపొలాలను గుంజుకున్నారు
- ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి
- నూతన రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించాలి
- పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించాలి
- రెండు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు నిధులు ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్సార్సీపీ విజ్ఞప్తిచేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో కూడిన బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ఆ వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ..
- ఐదేళ్లపాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హామీ ఇచ్చారు. దీనిని అమలుచేయాలని నాటి ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని కూడా ఆదేశించింది. కానీ ఈ దిశగా ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు.
- అపాయింటెడ్ డే నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అందేవరకు ఈ రెవెన్యూ లోటును భర్తీచేసేందుకు వీలుగా 2014-15 సాధారణ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చట్టంలో హామీ ఇచ్చారు. అయితే రెవెన్యూ లోటు భర్తీ కోసం కేంద్రం ఇటీవల రూ. 500 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. కొత్త రాష్ట్రం సమస్యలను ఇది ఎంతమాత్రం తీర్చలేదు. అందువల్ల వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయగలరు. అయితే ఐదేళ్లపాటు రెవెన్యూలోటు గ్రాంట్లను రూ. 22 వేల కోట్ల మేర ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసును ఆమోదించినందుకు ధన్యవాదాలు.
- చట్టప్రకారం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లో భాగంగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ.. చాలా స్వల్ప మొత్తంలో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున కేటాయించారు. ప్రకాశం జిల్లా వంటి తక్కువ తలసరి ఆదాయం ఉన్న ఇతర జిల్లాలకు కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
- పోలవరం జాతీయ ప్రాజెక్టును విభజన అనంతరం మూడేళ్లలో కేంద్రమే నిర్మాణం పూర్తిచేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం అంతుపట్టని అంశం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు రెండో చాప్టర్ క్లాజ్-7లో పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చిన వెంటనే.. కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్రలకు ఉంటుందన్న నిబంధన ఉంది.
అలాగే 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని పోలవరం నుంచి కృష్ణాకు మళ్లిస్తే.. అధికంగా మళ్లించిన నీటిని మూడు రాష్ట్రాలకు అదే దామాషాలో పంచాలన్న నిబంధనలు ఉన్నాయి. దీనివల్ల గోదావరి నుంచి చుక్క నీరు మళ్లించకముందే రాష్ట్రం 70 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పట్టిసీమ లిఫ్ట్ నుంచి కృష్ణా నది వరకు ఎక్కడా నీటి నిల్వకు అవకాశం లేదు. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా... టెండర్లలో నిబంధనలు మార్చేసి తన వారికే టెండర్లు దక్కేలా చేసింది. ఎక్కువగా కోట్ చేసిన మొత్తాన్ని బోనస్‌గా పేర్కొంది. పట్టిసీమకోసం భారీగా ప్రజాధనం వృథాచేయడానికి బదులుగా.. పోలవరాన్ని మూడేళ్లలో పూర్తిచేయాలి. సాంకేతికంగా ఆచరణ సాధ్యం కాని పట్టిసీమ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతున్నాం.
- రాజధాని అవసరాలకు డీగ్రేడెడ్ అటవీ భూములను డీనోటిఫై చేస్తానని చట్టం ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణ విధానం ద్వారా రాజధానిని నిర్మించేందుకు బహుళ పంటలు సాగయ్యే, కెనాల్ తదితర సాగునీటి వసతి ఉన్న దాదాపు 30 వేల ఎకరాలను సేకరిస్తోంది. అదే జిల్లాలో వేలాది ఎకరాల డీగ్రేడెడ్ అటవీ భూములు ఉన్నప్పటికీ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్‌లోని పలు ప్రయివేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 10 వేల ఎకరాలను ఉచితంగా ఆ కంపెనీలకు కట్టబెడతారట. దీనికి ప్రతిఫలంగా ఆ కంపెనీలు ఉచితంగా రాజధాని నిర్మించి ఇస్తాయట. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అటు చట్ట సభల్లో గానీ, ఇటు బయటగానీ చర్చించే ందుకు నిరాకరిస్తోంది. ఇప్పటివరకు సామాజిక ప్రభావ అధ్యయనం కూడా జరగలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి.
ళి కొత్త రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు అవసరమవుతాయన్న విషయాన్ని చట్టంలో చెప్పలేదు.
కేంద్రం ఏమేర ఇస్తుందన్న విషయం పేర్కొనలేదు. ఎప్పటిలోగా విడుదల చేస్తుందో చెప్పలేదు. విభజనను మేం కోరుకోకపోయినా, మా తప్పేమీ లేకపోయినా మేం రాజధాని కోల్పోయినందున కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం వచ్చే ఐదేళ్లపాటు ఇతోధికంగా సాయం చేయాల్సిన అవసరం ఉంది. అయితే 2015-16 కేంద్ర సాధారణ బడ్జెట్లో కేంద్రం ఈ దిశగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. దయచేసి నూతన రాజధాని నిర్మాణానికి భారీమొత్తంలో నిధులు కేటాయించేలా చూడాలని కోరుతున్నాం.
- చట్టప్రకారంగా పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించడంలో భాగంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 15 శాతం అదనపు డిప్రిసియేషన్, 15 శాతం పెట్టుబడి అలవెన్స్‌ను ప్రకటించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి సరిపోవు. అందువల్ల హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను మాకు కూడా ప్రకటించేలా చూడండి.
- పన్ను ప్రోత్సాహకాలను కేవలం వెనకబడిన జిల్లాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఉపయోగంలేదు. 974 కి.మీ. పొడవు గల కోస్తాతీరం వెంట అంతర్జాతీయ స్థాయి గల ఓడరేవులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేవారు నౌకాశ్రయాలకు సమీపంలోనే తమ పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. అందువల్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రకటించేలా చూడండి.
- కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ, విజయవాడ మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడం వంటి అంశాలను చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే చిత్తూరు జిల్లాలోని ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ మన్నవరం ప్రాజెక్టును కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చూడండి.
- రెండు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాల్సిన విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు ఇతోధికంగా నిధులు కేటాయించి సత్వర నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోండి.