reservation list
-
29లోపు ‘పంచాయతీ’ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంటోంది. ముఖ్యంగా పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో జిల్లా, మండల యంత్రాంగాలు నిమగ్నమయ్యాయి. రాష్ట్రస్థాయిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే స్పష్టత వచ్చిన నేపథ్యంలో మండలాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన లెక్కలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన ఫార్ములాపై జిల్లా పంచాయతీ అధికారుల (డీపీఓ)కు పంచాయతీరాజ్ కమిషనర్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈనెల 29లోగా ఈ ప్రక్రియను ముగించేందుకు జిల్లా కలెక్టర్లు, డీపీఓలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత ఏర్పడని దృష్ట్యా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా పుంజుకోవడం లేదు. జిల్లా, మండల స్థాయిల్లో రిజర్వేషన్లను ప్రకటించాక ప్రచారం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గ్రామస్థాయిల్లో బరిలో నిలిచేందుకు ఎంత మంది ముందుకు వస్తారన్నది, ఏ మేరకు పోటీ ఏర్పడుతుందనేది వేచి చూడాల్సి ఉంది. ఏకగ్రీవాలకు ఆర్థిక చేయూత.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏకగ్రీవ ఎన్నికలూ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎన్నిక ఏకగ్రీవమైతే మంచిదనే చర్చ కూడా కొన్ని వర్గాల్లో సాగుతోంది. గతంలో మాదిరిగానే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ఆర్థిక చేయూత కింద నిధులు అందుతాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లోనూ ఐదువేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, ఐదువేల కంటే తక్కువగా ఉన్న గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తారు. ఈ నిధులను గ్రామీణాభివృద్ధి పనుల కోసం ఆయా పంచాయతీలు వెచ్చించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పంచాయతీల సంఖ్య 12,751కు పెరిగింది. తక్కువ జనాభా ఉన్న గ్రామాలు, తండాలు పంచాయతీలుగా మారిన నేపథ్యంలో ఏకగ్రీవాల సంఖ్యకూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఏపీలో 2013లో పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో 8,778 పంచాయతీలున్నాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో 451 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ప్రోత్సాహం కింద ఈ పంచాయతీలకు నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగినా ప్రకటించిన మేర నిధులు కేటాయించారు. -
వేగంగా ‘పంచాయతీ’ రిజర్వేషన్ల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు కసరత్తు ఊపందుకుంది. ఈ నెల 27లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా అందించాల్సి ఉండటంతో ఈ ప్రక్రియలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. రెండు మూడ్రోజుల్లోపే ఈ రిజర్వేషన్లకు తుదిరూపు ఇవ్వవచ్చునని తెలుస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలన్న కోర్టు నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపునకు చర్యలు ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల ఖరారు అధికారులకు కత్తి మీద సాముగా మారింది. 2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 60.55% (బీసీలకు 34%) అమలయ్యాయి. ఇప్పు డు 50 శాతానికి ఈ రిజర్వేషన్లను పరిమితం చే యాల్సి ఉండటంతో ప్రస్తుతం సవరణలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో బీసీలకు 24% మించకుండా రిజర్వేషన్లు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. అప్పుడు మిగతా 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ లకు పంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంæ ఏర్పడ్డాక తొలిసారిగా రిజర్వేషన్లకు సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికల్లో కొత్త రొటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. జనాభా మేరకు రిజర్వేషన్లు.. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. వాటిలో 17 పంచాయతీల కాలపరిమితి మరో ఏడాది పాటు ఉండటంతో ప్రస్తుతం 12,734 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొత్తం 12,751 పంచాయతీలకు కోటా నిర్ణయించి తదనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే సర్పంచ్ పదవుల శాతాన్ని తేల్చనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ ల జనాభాను లెక్కించాల్సి ఉంటుంది. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతా ల్లో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తీశాకే రాష్ట్ర స్థాయి జనాభా కోటాకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత మంది ఉన్నారనే లెక్కల ప్రకారం జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. బీసీ వర్గాల రిజర్వేషన్లను మాత్రం ఓటర్ల జాబితాలో మండలం, గ్రామం వారీగా ఎంత మంది బీసీ ఓటర్లు, వారి ఓట్ల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 1,308 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు చేయడం తప్పనిసరి. అలాగే వంద శాతం ఎస్టీ వర్గం వారున్న 1,326 గ్రామ పంచాయతీలను ఈ వర్గం వారికే కేటాయిస్తారు. ఇవికాకుండా మైదాన ప్రాంతం గ్రామ పంచాయతీల్లోని మొత్తం జనాభా ఆధారంగా ఆ కేటగిరీకి రిజర్వేషన్ ఉంటుంది. అయితే రిజర్వేషన్ల జాబితా అందగానే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మూడు విడతల్లో ఎన్నికలు! మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒక్కో విడతకు మధ్యలో రెండు మూడ్రోజుల విరామం ఇచ్చి విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్టు సమాచారం. జిల్లాల్లో స్థానికంగానే ఈ ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేస్తారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10 లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు
కడపసిటీ, న్యూస్‌లైన్ : మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. జిల్లా పరిషత్ సీఈఓ మాల్యాద్రి ఆధ్వర్యంలో రూపొందించిన జాబితాను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ శనివారం రాత్రి విడుదల చేశారు. జిల్లాలో 50 మండల ప్రజా పరిషత్‌లున్నాయి. షెడ్యూలు తెగలు 1, షెడ్యూలు కులాలకు 7, వెనుకబడిన తరగతులకు 13, ఇతరులకు 29 ఎంపీపీ స్థానాలు ఖరారు చేశారు. షెడ్యూలు తెగలు జనరల్ పులివెందుల షెడ్యూలు కులాలు మహిళలు కమలాపురం, చెన్నూరు, చిట్వేలి షెడ్యూలు కులాలు జనరల్ మైదుకూరు, రాజంపేట, శ్రీ అవధూతేంద్ర కాశినాయన, వీరబల్లి బీసీ మహిళలు సంబేపల్లి, పెద్దముడియం, ఖాజీపేట, ముద్దనూరు, చాపాడు, కోడూరు. బీసీ జనరల్ రాయచోటి, రామాపురం, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, పెనగలూరు, అట్లూరు,లక్కిరెడ్డిపల్లె, జనరల్ మహిళలు మైలవరం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,దువ్వూరు, టి.సుండుపల్లి, కొండాపురం, నందలూరు, ఎర్రగుంట్ల, కలసపాడు, పెండ్లిమర్రి, చక్రాయపేట, వేముల, సింహాద్రిపురం, రాజుపాలెం. జనరల్ (అన్రిజర్వ్డ్) గాలివీడు, చిన్నమండెం, ిసీకేదిన్నె, వేంపల్లి, పోరుమామిళ్ల, సిద్ధవటం, వీఎన్‌పల్లి, తొండూరు, బి.కోడూరు, వల్లూరు, లింగాల, బద్వేలు, గోపవరం, పుల్లంపేట, ఓబులవారిపల్లె. -
మందమర్రి మున్సిపాల్టీని వీడని గ్రహణం
మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : మందమర్రి మున్సిపాలిటీకి పట్టిన ఎన్నికల గ్రహణం వీడటం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామ పంచాయతీగా ఉన్న మందమర్రి కొన్ని రాజకీయ కారణాల వల్ల 1993లో నోటిఫైడ్ ఏరియాగా మారింది. ఆ తర్వాత 1995 మే 8వ తేదీన మందమర్రిని గ్రేడ్-3 మున్సిపాలిటీ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 58 వేల జనాభా ఉన్న మందమర్రి మున్సిపాలిటీలో 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని 24 వార్డులుగా విభజించి 1998 మే 21వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థి పదవికి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. దీంతో నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల కోలాహలం సాగుతున్న సమయంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న మందమర్రి గ్రామ పంచాయతీ 7/70 చట్ట పరిధిలో ఉన్న కారణంగా ఇక్కడ ఎన్నికలు నిలిపేయాలని అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మద్ది రాంచందర్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేశారు. ఒక వేళ ఎన్నికలు జరపవలసి వస్తే ఎస్టీలకు మాత్రమే చైర్మన్ పదవి కేటాయించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికలు నిలిపేస్తూ జూన్, 18, 1998న హైకోర్టు స్టే జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తు ఆశానిర్మల కోర్టును ఆశ్రయించారు. కానీ వాది, ప్రతివాదుల తరుఫున ఎవ్వరు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఏప్రిల్, 5, 2005లో కేసును డిస్మిస్ చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణపై ఈసీ కేంద్రానికి లేఖ ఫిబ్రవరి, 3, 1999లో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల వ్యవ హారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ మున్సిపాలిటీ పరిపాలన కార్యదర్శికి లేఖ ద్వారా వివ రించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాల్లో వివాదాలు వస్తే దాన్ని కేవలం పార్లమెంటు జోక్యం తీసుకుంటుందని, షెడ్యూల్ ఏరియాల విభాగాల చట్టం ప్రకారం బిల్లు ఆమోదించవలసి ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు పీటముడి బిగుసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నికల కోసం పోరాటాలు చేస్తున్న ప్రయోజనం లేదు. మున్సిపాలిటీకి ఎన్నికలు లేక 16 ఏళ్లు.. జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపలి,్ల బైంసా, మందమర్రితో కలిసి ఏడు మున్సిపాలిటీలు ఉండగా కేవలం మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక 16 ఏళ్లవుతోంది. దీంతో ప్రజా ప్రతినిధులు లేక, ప్రశ్నించే వారు కానరాక మున్సిపాలిటీ పాలనా అస్తవ్యస్తంగా మారింది. అధికారులు తమ ఇష్టారాజ్యాంగా వ్యవహరించడం. అందినంత దండుకోవడం, నిధుల దుర్వినియోగం చేయడంతోపాటు పట్టణ ప్రజలకు కనీస వసతులు కల్పించలేని పరిస్థితులో మందమర్రి మున్సిపాలిటీ కోట్టుమిట్టాడుతుంది. పన్నుల వసూలులో పురోగతి లేక పోవడంతో కార్యాలయానికి ఆదాయం తగ్గింది. ఇప్పటి వరకు మున్సిపాలిటీ కట్టవలసిన విద్యుత్ చార్జీలు రూ.70 లక్షలకు పేరుకుపోయాయి. కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకోంది. 2004లో రూ.24 కోట్ల హ డ్కో నిధులతో ప్రారంభించిన గోదావరి మంచినీటి పథకం ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో పట్టణంలోని హై లేవల్జోన్ ప్రాంతవాసులకు తాగునీరు అందకుండా పోతుంది. వేతనాలను ఇవ్వలేక చాలినంత సిబ్బందిని సమకూర్చుకోలేక పారిశుధ్యం పడకేసింది. రోడ్లు, డ్రెయినేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం 3వ గ్రేడ్ మున్సిపాలిటీ అని ప్రకటించినా ఎన్నికలు లేక, ప్రజ లకు కనీస మౌలిక వసతులు అందక మందమర్రి మున్సిపాలిటీ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతుం ది. ఇప్పటివరకు పదవుల్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై సరైన ఒత్తిడి చేయలేక పోవడం వల్లనే ఎన్నికలు జరుగకుండా పోతున్నాయని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. వెంటనే ఎన్నికల ప్రక్రియకు తగిన కృషి చేయాలని వారు కోరుతున్నారు. -
‘స్థానిక’ పోరుకు సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు ముందే పురపాలక, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సోమవారం పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పురపాలక ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జాప్యం కావడంతో ఎట్టకేలకు న్యాయస్థానం ఆదేశం మేరకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇక స్థానిక చర్చ సందడి మొదలైంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులకు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం కానున్నాయి. ఓ పక్క పురపాలక ఎన్నికల పనుల్లో నిమగ్నమైన యంత్రాంగం జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఈ నెల 5లోగా సిద్ధం చేయాలని ఆదేశాలు అందాయి. రిజర్వేషన్లను ఖరారు చేయడంలో అధికారులు తలమునకలు అయ్యారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు(జెడ్పీటీసీ)లు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ)ల రిజర్వేషన్ల ఖరారులో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తేలియాడుతున్నారు. జెడ్పీటీసీల రిజర్వేషన్ల ఖరారు జిల్లా స్థాయి అధికారులు చేపట్టగా, ఎంపీటీసీల రిజర్వేషన్లు మండల అభివృద్ధి అధికారులు(ఎంపీడీవో)లు సిద్ధం చేస్తున్నారు. అయితే రెండు టర్మ్‌లుగా కేటాయించిన ఎంపీటీసీ రిజర్వేషన్ల దస్త్రాలు ముందు పెట్టుకొని ఖరారు చేయాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలకే రిజర్వేషన్లు ఎక్కువ దక్కే అవకాశం కన్పిస్తోంది. జాబితా తయారీలో యంత్రాంగం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు జాబితా తయారు చేయడంలో యం త్రాంగం నిమగ్నమైంది. ఇందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి న అనంతరం అధికారులు ప్రభుత్వానికి జాబితా పంపనున్నారు. ఈ జాబితా ప్ర కారం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జాబితాను పరిశీలన చేసిన అనంతరం ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేస్తుంది. గెజిట్ విడుదలైతే రిజర్వేషన్లు ఖరారైనట్లే..రిజర్వేషన్ల వివరాలను గెజిట్‌లో పొందుపరుస్తారు. జిల్లాలో 52 జెడ్పీటీసీ స్థానాలు, 52 అధ్యక్ష స్థానాలు, 636 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన అభ్యర్థుల పదవీ కాలం 2011తో ముగిసింది. గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలు 52ఉండగా, ఎంపీటీసీ స్థానాలు 569 ఉండేవి. ఎనిమిది నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో అప్పుడు ఎంపీటీసీ స్థానాల సంఖ్య 636కు చేరింది. అంటే కొత్తగా జిల్లాలో 67 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో గ్రామీణా ప్రాంతాల్లో చర్చమొదలైంది. పోటీ చేసే అభ్యర్థులు సైతం ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నారు. ఏదేమైనా మున్సిపల్. స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠగా మారనున్నాయి.