retired army officer
-
Agnipath Scheme: ఈ మార్పులు మేలు
అగ్నిపథ్ పథకంపై రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారే సూచనలు కన్పించడం లేదు. మిలటరీ ఉద్యోగాల కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్న వారికి నాలుగేళ్ల సర్వీసుతోనే రిటైరవ్వా లన్న నిబంధన మింగుడు పడలేదు. ఉద్యోగం లేక, పెన్షనూ రాక రోడ్డున పడతామన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కేంద్రం ఏం చెప్పినా ఫ్రస్ట్రేషన్లో ఉన్న యువత వినే పరిస్థితి లేదు. వారి అసంతృప్తిన చల్లార్చేలా పథకానికి చేయాల్సిన మార్పుచేర్పులను రిటైర్డ్ ఆర్మీ నిపుణులు ఇలా సూచిస్తున్నారు... కాలపరిమితి 12 ఏళ్లకు పెంచాలి అగ్నివీరులకు ప్రస్తుతం పేర్కొన్న నాలుగేళ్ల కాలపరిమితిని కనీసం 10 నుంచి 12 ఏళ్లకు పెంచాలని రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రఫుల్ భక్షి సూచించారు. ‘‘అప్పుడే సైన్యంలో చేరి సేవ చేసేందుకు యువత ముందుకొస్తుంది. పైగా కార్గిల్ వంటి యుద్ధాల్లో సత్తా చాటాలంటే 10–12 ఏళ్లయినా సైన్యంలో చేసి ఉండాలి. అదీగాక కేవలం ఆరు నెలల శిక్షణ కాలం అస్సలు చాలదు. నాలుగేళ్ల సర్వీసంటే గణతంత్ర పెరేడ్లలో పాల్గొనడానికే పనికొస్తారు’’ అన్నారు. సగం మందినైనా పర్మినెంట్ చేయాలి 25 శాతం మందినే పర్మినెంట్ చేయడం సబబు కాదని మేజర్ జనరల్ (రిటైర్డ్) బిఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. ‘‘50 శాతానికైనా పెంచితే మేలు. మిగతా వారికి సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్సెస్, రాష్ట్ర పోలీసు యంత్రాంగాల్లో ఉద్యోగ హామీ ఇవ్వాలి. భవిష్యత్తుకు భరోసా ఉండేలా పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి’’ అని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలి అగ్నిపథ్‌పై భయాందోళనలు నెలకొనడంతో తొలుత కొన్ని రెజిమెంట్లలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, సాదక బాధకాలన్నీ తెలిసొచ్చాక అవసరమైన మార్పుచేర్పులతో పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చని లెఫ్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘కేవలం నాలుగేళ్ల ఉద్యోగానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు? ఎందుకంత రిస్క్ తీసుకుంటారు?’’ అని ఆయనన్నారు. పథకాన్ని సమగ్రంగా ఆలోచించి రూపొందించినట్టు కన్పించడం లేదు. కనుక పైలెట్ ప్రాజెక్టుగా తెచ్చే ముందు కూడా మరిన్ని చర్చలు తప్పనిసరి’’ అన్నారు. మరింత చర్చ తప్పనిసరి పథకంపై మరింతగా చర్చ తప్పనిసరని బీఎస్ఎఫ్ మాజీ ఏడీజీ సంజీవ్ సూద్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత 75 శాతం మందిని ఇంటికి పంపేయడం పథకంలో ప్రధాన లోపమన్నారు. ఇలా ఏటా లక్షల్లో యువకులు సాయుధ బలగాలను వీడితే వారి భవిష్యత్తుతో పాటు దేశ రక్షణా ప్రమాదంలో పడుతుంది. ‘‘ఇంతమందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఇతరత్రా ఉద్యోగాలెలా కల్పిస్తారు? పైగా కేవలం 6 నెలల శిక్షణతో మూడున్నరేళ్లకు సర్వీసుకు తీసుకుంటే ఏ జవానూ పూర్తి సామర్థ్యంతో పని చేయలేడు’’ అన్నారు. పథకాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోవడమో, కొన్ని బెటాలియన్లలో పైలెట్‌గా చేపట్టడమో చేయాలని సూచించారు. సైనిక నియామకాలు... ఏ దేశాల్లో ఎలా? అమెరికా అగ్రరాజ్యంలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే. సైనికులు నాలుగేళ్లు విధుల్లో ఉంటారు. తర్వాత మరో నాలుగేళ్లు వారిని రిజర్వ్‌లో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. నాలుగేళ్లలో ప్రతిభ కనబరిచి మిలటరీనే వృత్తిగా తీసుకొని 20 ఏళ్లు సేవలందించిన వారికి మాత్రమే పింఛను, ఇతర భత్యాలుంటాయి. చైనా డ్రాగన్ దేశంలో నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే. 18 ఏళ్లు పైబడిన మగవాళ్లంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చేరి రెండేళ్లు విధిగా పని చేయాలి. పూర్తికాలం సైనికులుగా చేసి రిటైరైన వారికి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి డిస్కౌంట్‌తో రుణాలు, పన్ను రాయితీలు ఇస్తారు. ఫ్రాన్స్ సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. ముందు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి క్రమంగా ఐదేళ్ల దాకా పొడిగిస్తారు. 19 ఏళ్లు సర్వీసులో ఉంటే పెన్షన్ ఇస్తారు. రష్యా సైన్యంలో నియామకాలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. నిర్బంధ, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలుంటాయి. నిర్బంధంగా చేరిన వారికి ఏడాది శిక్షణ, ఏడాది సర్వీసు ఉంటుంది. తర్వాత వారు రిజర్వ్‌లో ఉంటారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న సైనికులకు కాంట్రాక్ట్ ముగిశాక సైనిక విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇజ్రాయెల్ పురుషులతో పాటు మహిళలు కూడా నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిం దే. మగవారు 32 నెలలు, మహిళలు 24 నెలలు పని చేయాలి. వీరిలో 10% మందిని పూర్తి స్థాయి సైనికులుగా నియమిస్తారు. ఏడేళ్ల కాంట్రాక్ట్ ఉంటుంది. ప్రతిభ కనబరిచిన వారు 12 ఏళ్లు పదవిలో ఉంటారు. వారికే పెన్షన్ అందుతుంది. పాకిస్తాన్ నియామకాలు స్వచ్ఛందమే. 17–25 ఏళ్ల వారిని పోటీ పరీక్షల ద్వారా తీసుకుంటారు. పూర్తికాలం పని చేసిన వారికే పెన్షన్, ఇతర భత్యాలు. కొందరిని రిజర్వ్‌లో ఉంచుతారు. వారికి బెనిఫిట్సేమీ ఉండవు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
యోధులారా వందనం : సీఎం జగన్
సాక్షి, తిరుపతి : ‘యోధులారా వందనం.. భారత సైన్యానికి వందనం.. 135 కోట్ల మంది ప్రజానీకం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు కారణమైన వీర సైనికులకు వందనం’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎండ, చలి, వర్షాన్ని లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల సేవలు అజరామరం అని కొనియాడారు. తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో గురువారం ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని గుర్తించని, గౌరవించనని నియంతృత్వ పరిస్థితిలో మన దేశం, మన ఆర్మీ కారణంగా 50 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను చేపట్టారని చెప్పారు. 2020 డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా వెలిగించిన విజయోత్సవ జ్యోతి తిరుపతికి చేరుకున్నందున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. వేణుగోపాల్‌తో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ 4 వేల మంది భారత సైనికుల ప్రాణ త్యాగం ♦బంగ్లాదేశ్ ఉందంటే అది మన ఆర్మీ గౌరవంగా చెప్పవచ్చు. 1947 ఆగస్టు 15న మనకు, పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం వచ్చింది. తూర్పు పాకిస్తాన్.. పశ్చిమ పాకిస్తాన్ ప్రజల తీర్పును గౌరవించకుండా తిరస్కరించడంతో మనదేశం, మన ఆర్మీ అండగా నిలిచింది. ♦పశ్చిమ పాకిస్తాన్లో షేక్ ముజీబుర్ రెహ్మాన్ 160 స్థానాలు సాధించారు. తూర్పు పాకిస్తాన్లో జుల్ఫ్కర్ ఆలీ బుట్టో 134 స్థానాలకు 80 స్థానాలు గెల్చుకున్నారు. సగానికి పైగా సీట్లు ముజీబుర్ రెహ్మాన్‌కు లభించినా కూడా తూర్పు పాకిస్తాన్ అధికారం అప్పగించేందుకు ఒప్పుకోలేదు. అప్పట్లో సహాయం కోరడంతో భారతదేశం స్పందించింది. ♦1971లో భారత్–పాకిస్తాన్ యుద్ధం తలెత్తింది. ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక యుద్ధంగా నిలిచిపోయింది. డిసెంబర్ 3న ప్రారంభమైన యుద్ధం డిసెంబర్ 16న ముగిసింది. 4 వేల మంది భారత సైనికులు ప్రాణ త్యాగం చేశారు. 1971 డిసెంబర్ 22న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. ♦బంగ్లాదేశ్ విమోచన కోసం మన ఆర్మీ చేసిన త్యాగాలెన్నో ఉన్నాయి. వాటిని గుర్తు చేస్తూ విజయ జ్యోతి జ్వాల తిరుపతికి వచ్చింది. పోరాట యోధులకు నమస్కరిస్తోంది. జాజుల సన్యాసి గారి సతీమణి చిన్నతల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ♦నాడు యుద్ధంలో ఎందరో పాల్గొన్నారు. వారిలో కొందరు ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. యుద్ధంలో పాల్గొన్న హీరోలను స్మరించుకుంటూ, సత్కరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. త్యాగధనులు, భరతమాత ముద్దు బిడ్డలకు ఏమి ఇవ్వగలం? ♦వీర సైనికులకు మరణం లేదు. వారు ఎప్పుడూ చిరంజీవులుగా ఉంటారు. నాగాలాండ్ యుద్ధ స్థూపం మీద ఓ స్లోగన్ ఉంది. ‘మీ రేపటి కోసం, మేము ఇవాల్టి రోజు త్యాగం చేస్తున్నాం’ అని రాసి ఉంది. ఆర్మీలో చేస్తున్నవి ఉద్యోగాలు కావు, మన కోసం, మన దేశం కోసం సేవ చేస్తున్నారు. గుర్తించుకోండి.. ఆర్మీలో చేరేందుకు యువత ముందుకు రావాలి. విజయజ్వాలను వేదికపైకి తీసుకువస్తున్న సీఎం వైఎస్ జగన్ విజయ జ్వాలకు వందనం ♦ఇండో పాక్ యుద్ధంలో భారత విజయానికి చిహ్నంగా గత ఏడాది డిసెంబర్ 16న న్యూఢిల్లీలో ప్రధాని నాలుగు విజయ జ్వాలలను వెలిగించారు. ఇవి దేశ నాలుగు దిక్కులా ప్రయాణం చేశాయి. ఇండో – పాక్ యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికుడిని కలిసి ‘యోధుడా సలాం’ అని పలకరిస్తూ వచ్చాయి. ♦దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయాణం చేసిన విజయ జ్వాల బుధవారం తిరుపతికి చేరింది. రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ ఇంటి మీదుగా పోలీస్ పరేడ్ మైదానానికి చేరింది. ఈ జ్వాలకు సీఎం వైఎస్ జగన్ గౌరవ వందనం చేశారు. ♦కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ నివాసంలో మొక్కను నాటుతున్న సీఎం వైఎస్ జగన్ సైనికుల త్యాగాలు మరువలేనివి పరమవీర చక్ర, అశోక చక్ర పతకాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు రూ.10 లక్షలు చెల్లించేది. సైనికుల త్యాగాలు మరువ లేనివని, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. పరమ వీర చక్ర పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆ మొత్తాన్ని పది రెట్లు పెంచి రూ.1 కోటి ఇస్తుంది. మహా వీర చక్ర, కీర్తి చక్ర పురస్కారాలకు ఇది వరకు రూ.8 లక్షలు ఇచ్చేవారు. ఇకపై పది రెట్లు పెంచి రూ.80 లక్షలు ఇస్తుంది. వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షలు నజరానా అందించేది. ఇక నుంచి రూ.60 లక్షలు అందిస్తాం. సైనికులు వీర మరణం పొందితే రూ.50 లక్షలు పరిహారం అమలు చేస్తున్నాం. నజరానా పెంపుపై జీఓ విడుదల ఇదిలా ఉంటే.. పరమవీర చక్ర, అశోక్చక్ర తదితర అవార్డు గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నజరానాకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని పెంచుతామని తిరుపతిలో గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన వెంటనే సర్కారు రాత్రికల్లా జీఓ విడుదల చేసింది. ముఖ్యమంత్రి మాటలను అధికారులు వెంటనే అమల్లోకి తీసుకురావడం గమనార్హం. దివంగత జాజుల సన్యాసి సతీమణి చిన్నతల్లి, కుమారుడికి జ్ఞాపిక అందిస్తున్న సీఎం యుద్ధ వీరుడికి సీఎం ఘన సన్మానం ♦1971లో భారత్–పాక్ యుద్ధంలో విశేష సేవలందించిన మహా వీరచక్ర, పరమ విశిష్ట సేవా మెడల్ గ్రహీత, యుద్ధ వీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్(95)ను సీఎం జగన్ సత్కరించారు. వేణుగోపాల్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో సీఎం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వేణుగోపాల్ ఇంటి వద్ద సీఎం ఓ మొక్కను నాటారు. ♦అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని బెటాలియన్ కమాండెంట్ దివంగత జాజుల సన్యాసి సతీమణి చిన్నతల్లి, కుమారుడు హవాల్దార్ గంగరాజును సత్కరించారు. ♦కాకినాడకు చెందిన కేజే క్రిష్టఫర్ తరఫున లెప్టినెంట్ జనరల్ అరుణ్‌కుమార్, మేజర్ జనరల్ రాకేష్‌కుమార్ సింగ్‌లను సీఎం సన్మానించారు. వేణుగోపాల్ ఇంటి నుంచి తీసుకెళ్లిన మట్టిని విజయ జ్వాలతో పాటు నేషనల్ వార్ మ్యూజియంలో పెట్టనున్నట్లు రాకేష్ కుమార్ సింగ్ ప్రకటించారు. గౌరవంగా భావిస్తున్నా.. సీఎం సన్మానాన్ని గౌరవంగా భావిస్తున్నానని, దేశ పౌరుడిగా తన వంతు సేవ చేసినందుకు సంతృప్తికరంగా ఉందని యుద్ధ వీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ అన్నారు. 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొనడం ద్వారా దేశ సేవ చేసే అవకాశం వచ్చినందుకు గర్విస్తున్నానని తన సహయకుడి ద్వారా తెలియజేశారు. -
సరిహద్దుల్లో చిన్న అలజడి రేగినా రక్తం మరిగిపోతుంది
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): ఆయన వయసు 95 ఏళ్లు.. పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. అయినా.. నిత్యం దేశం కోసమే ఆలోచిస్తారు. దేశ సరిహద్దుల్లో ఏవైనా అలజడులు తలెత్తినట్టు తెలిస్తే మదనపడిపోతారు. ఆ రోజూ భోజనం కూడా సరిగా చేయరు. ఆయన పేరు సి.వేణుగోపాల్.. రిటైర్డ్ మేజర్ జనరల్. ఆర్మీలో పని చేస్తున్నప్పుడు శత్రు దేశాలను వణికించారు. భారత్–పాక్ యుద్ధ సమయంలో భారత జవాన్ల సత్తా ఏమిటో శత్రు సైన్యానికి రుచి చూపించిన ఆ మహాయోథుడు తిరుపతిలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని తిరుపతి కేంద్రంగా గురువారం ‘స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్నారు. నాటి యుద్ధంలో పాల్గొన్న ప్రధాన అధికారుల్లో ఒకరైన రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్‌ను ఆయన ఇంటికి వెళ్లి సీఎం సత్కరించనున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆయన ఏమన్నారంటే.. దేశం కోసం పోరాడాలనే ఆలోచనే.. మాది తిరుపతి సరోజినిదేవి రోడ్డు ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం. 1927 నవంబర్ 14న పుట్టాను. మా తల్లిదండ్రులు చిన్నస్వామి, రుక్మిణమ్మలకు మేం 9 మంది సంతానం. నేను రెండో వాడిని. అందరూ వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి దేశ సేవ చేయాలనే తపన ఒక్కటే ఉండేది. ఎలాగైనా సైన్యంలో చేరాలని ఆరాటపడేవాడిని. ఆర్మీలో హవల్దార్‌గా చేరి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (డెహ్రాడూన్)లో సీటు సాధించాను. కఠోర శిక్షణ పొంది గుర్కా రైఫిల్స్‌లో చేరి లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాకు ఎదిగాను. ఈశాన్య రాష్ట్రాల్లో గుర్కా రైఫిల్స్ మలౌన్ రెజిమెంట్‌లో పనిచేస్తూ మేజర్ జనరల్ హోదాలో పదవీ విరమణ చేశాను. 1971 డిసెంబర్ 4న శుత్రు సైన్యం సరిహద్దులోని వుథాలి, దర్శన ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా.. ఇండో–పాక్ యుద్ధం జరిగింది. అందులో నేను సభ్యుడిగా.. బెటాలియన్‌కు నాయకుడిగా ఉంటూ సైన్యాన్ని అప్రమత్తం చేసి విజయం సాధించాం. దేశసేవకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పరమ్ విశిష్ట్ సేవా మెడల్’ (పీవీఎస్ఎం), మహావీర్ చక్ర (ఎంవీసీ) అవార్డులు అందుకున్నాను. 1950 నుంచి 1986 వరకు సుమారు 36 ఏళ్లు ఆర్మీలో కొనసాగాను. ఇప్పటికీ దేశ సరిహద్దులో శత్రుసైన్యాలు అలజడి చేస్తే రక్తం మరిగిపోతుంది. 95 ఏళ్ల వయసులో శరీరం సహకరించకపోయినా దేశం కోసం పోరాడాలనే ఆలోచనే తప్ప మరో వ్యసనం లేదు. అందుకే వివాహం చేసుకోలేదు. ఎవరికైనా సరే వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యం కాదు. దేశ ప్రయోజనాల కోసం ఆలోచించే సమాజం కావాలి. అందుకు యువత నడుం కట్టాలి. టెక్నాలజీ మాత్రమే ప్రపంచం కాదు. దేశమే ప్రధానం.. ఆ తరువాతే టెక్నాలజీ. ప్రతి పౌరుడూ రోజుకు కనీసం 5 నిమిషాలపాటు దేశం కోసం ఆలోచన చేయాలి. అప్పుడే దేశం మనకు కోరిన కోర్కెలను తీరుస్తుంది. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ ముగించారు. నేటి నుంచి తిరుపతిలో సాయుధ దళాల స్వర్ణోత్సవాలు సాక్షి, తిరుపతి/సాక్షి,అమరావతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతి సాయుధ దళాల స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. దాయాది పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాల అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష’ కార్యక్రమాల్లో భాగంగా తిరుపతిలో గురువారం నుంచి శనివారం వరకు స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 1971 డిసెంబర్ 4న బంగ్లాదేశ్ విముక్తికి పాక్‌తో జరిగిన యుద్ధంలో భారత్ చిరస్మరణీయమైన విజయం సాధించింది. ఆ యుద్ధంలో పాల్గొని పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డులు పొందిన రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్(95). వీరచక్ర అవార్డు పొందిన విశాఖకు చెందిన సన్యాసినాయుడు, కాకినాడకు చెందిన కేజే క్రిస్టోఫర్ కుటుంబ సభ్యులను సీఎం సన్మానిస్తారు. తిరుపతికి చేరుకున్న విజయ జ్వాల స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో బయలుదేరిన విజయ జ్వాల (విక్టరీ ప్లేమ్) హైదరాబాద్ నుంచి బుధవారం తిరుపతికి చేరింది. విజయ జ్వాలకు ఆర్మీ అధికారులు తిరుపతి ఎస్వీ వర్సిటీ పరిపాలనా భవనం వద్ద ఘన స్వాగతం పలికారు. -
డబ్బులు తీసుకుని పాత ఆయుధాలిచ్చారు
చండీగఢ్: రెండు దశాబ్దాల క్రితం కార్గిల్ యుద్ధ సమయంలో ఆకస్మిక సైనిక అవసరాలను తీర్చడానికి అవసరమైన ఉపగ్రహ చిత్రాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం కొన్ని దేశాలు భారత్ నుంచి అధిక చార్జీలు వసూలు చేశాయని రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో వీపీ మాలిక్ భారత సైన్యానికి నాయకత్వం వహించారు. మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్లో ‘మేక్ ఇన్ ఇండియా అండ్ ది నేషన్స్ సెక్యూరిటీ’పై చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ‘కార్గిల్ యుద్ధ సమయంలో ఇతర దేశాల నుంచి అత్యవసరమైన ఆయుధాల కొనుగోళ్లలో వారు మమ్మల్ని దోపిడీ చేశారు. మేము తుపాకుల కోసం ఒక దేశాన్ని సంప్రదించినప్పుడు వారు మొదట్లో ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పాత ఆయుధాలను ఆధునీకరించి సరఫరా చేశారు. మందుగుండు సామగ్రి కోసం మరొక దేశాన్ని సంప్రదించినప్పుడు 1970 నాటి పాతకాలపు మందుగుండు సామగ్రిని ఇచ్చారు’అని తెలిపారు. అలాగే కార్గిల్ సమయంలో భారతదేశం కొనుగోలు చేసిన ప్రతి ఉపగ్రహ చిత్రానికి రూ.36 వేలు చెల్లించాల్సి వచ్చిందని, ఆ చిత్రాలు కూడా తాజావి కావని, మూడేళ్ల క్రితం చిత్రాలని వీపీ మాలిక్ పేర్కొన్నారు. -
చుట్టూ నీళ్లు.. సాయం కోసం 9 గంటల పాటు కేకలు
చెన్నై: రిటైర్డ్ లెప్టినెంట్ కల్నల్ జీ వెంకటేషన్, ఆయన భార్య గీత చెన్నై శివార్లలోని ఓ చిన్న గృహంలో నివసిస్తున్నారు. వాళ్ల ఇల్లు అడయర్ నదికి 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. డిసెంబర్ 1కి ముందు రోజు సహచర బ్రిగేడియర్ రాజగోపాలన్‌తో కలిసి వెంకటేషన్ సాయంత్రపు నడకకు కూడా వెళ్లివచ్చారు. కానీ ఒక్కసారిగా కురిసిన వర్షాలతో డిసెంబర్ 1న రాత్రి అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నీళ్లు ఒక్కసారిగా ఇంట్లోకి తోసుకొని వచ్చేశాయి. 12 అడుగుల లోతు నీళ్లు.. ఎటు కదలడానికీ లేదు. వెంకటేషన్, ఆయన భార్య ఓ టేబుల్‌పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. టేబుల్ మీద బిక్కుబిక్కుమని గడుపుతూ దాదాపు తొమ్మిది గంటలపాటు సాయం కోసం అర్థించారు. తమను రక్షించాలని కేకలు పెట్టారు. కానీ వారిని కాపాడేందుకు ఎవరూ సాహసించలేదు. అందుబాటులో చిన్న పడవులున్నా.. 12 అడుగుల లోతు వరకు వచ్చిన నీళ్లలో వెళ్లి వారిని కాపాడటం సాధ్యపడలేదు. 9 గంటలపాటు ప్రాణాల కోసం పోరాడిన ఆ దంపతులు చివరకు నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచారని బ్రిగేడియర్ రాజగోపాలన్ తెలిపారు. సాయం కోసం తమ అల్లుడికి వారు ఫోన్ చేశారని, వరదనీళ్లలో ఇంటివరకు అతను రాలేకపోయాడని చెప్పారు. తమ ఇంటికి చేరువగా ఉన్న అడయర్ నదిలోకి సెంబత్రబాకం సరస్సు నుంచి 18వేల క్యూసెక్కులు నీళ్లు వదిలినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే అంతకుమించి ఎక్కువస్థాయిలో సరస్సు నీళ్లు విడువటం వల్ల నదికి ఎగువప్రాంతంలో ఉన్న తమ ఇల్లు మునిగిపోయి ఉంటుందని, ఆ స్థాయిలో వరద ఉధృతి ఉంటుందని తామెప్పుడు భావించలేదని ఆ దంపతుల కూతురు నిత్యశ్రీ తెలిపారు. చెన్నైని అతలాకుతలం చేసిన వరదల్లో మొత్తం 347మంది చనిపోయిన సంగతి తెలిసిందే.