యోధులారా వందనం : సీఎం జగన్‌ | CM YS Jagan Attends Swarnim Vijay Varsh Celebrations At Tirupati | Sakshi
Sakshi News home page

యోధులారా వందనం : సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Feb 19 2021 3:20 AM | Last Updated on Fri, Feb 19 2021 10:11 AM

CM YS Jagan Attends Swarnim Vijay Varsh Celebrations At Tirupati - Sakshi

తిరుపతిలో రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి. వేణుగోపాల్‌కు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, తిరుపతి : ‘యోధులారా వందనం.. భారత సైన్యానికి వందనం.. 135 కోట్ల మంది ప్రజానీకం స్వేచ్ఛా వాయువులు  పీల్చుకునేందుకు కారణమైన వీర సైనికులకు వందనం’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎండ, చలి, వర్షాన్ని లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల సేవలు అజరామరం అని కొనియాడారు. తిరుపతిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమంలో గురువారం ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని గుర్తించని, గౌరవించనని నియంతృత్వ పరిస్థితిలో మన దేశం, మన ఆర్మీ కారణంగా 50 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను చేపట్టారని చెప్పారు. 2020 డిసెంబర్‌ 16న ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా వెలిగించిన విజయోత్సవ జ్యోతి తిరుపతికి చేరుకున్నందున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. 


వేణుగోపాల్‌తో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌  

4 వేల మంది భారత సైనికుల ప్రాణ త్యాగం 
♦బంగ్లాదేశ్‌ ఉందంటే అది మన ఆర్మీ గౌరవంగా చెప్పవచ్చు. 1947 ఆగస్టు 15న మనకు, పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం వచ్చింది. తూర్పు పాకిస్తాన్‌.. పశ్చిమ పాకిస్తాన్‌ ప్రజల తీర్పును గౌరవించకుండా తిరస్కరించడంతో మనదేశం, మన ఆర్మీ అండగా నిలిచింది. 
♦పశ్చిమ పాకిస్తాన్‌లో షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ 160 స్థానాలు సాధించారు. తూర్పు పాకిస్తాన్‌లో జుల్ఫ్‌కర్‌ ఆలీ బుట్టో 134 స్థానాలకు 80 స్థానాలు గెల్చుకున్నారు. సగానికి పైగా సీట్లు ముజీబుర్‌ రెహ్మాన్‌కు లభించినా కూడా తూర్పు పాకిస్తాన్‌ అధికారం అప్పగించేందుకు ఒప్పుకోలేదు. అప్పట్లో సహాయం కోరడంతో భారతదేశం స్పందించింది. 
♦1971లో భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం తలెత్తింది. ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక యుద్ధంగా నిలిచిపోయింది. డిసెంబర్‌ 3న ప్రారంభమైన యుద్ధం డిసెంబర్‌ 16న ముగిసింది. 4 వేల మంది భారత సైనికులు ప్రాణ త్యాగం చేశారు. 1971 డిసెంబర్‌ 22న బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఏర్పడింది. 
♦బంగ్లాదేశ్‌ విమోచన కోసం మన ఆర్మీ చేసిన త్యాగాలెన్నో ఉన్నాయి. వాటిని గుర్తు చేస్తూ విజయ జ్యోతి జ్వాల తిరుపతికి వచ్చింది. పోరాట యోధులకు నమస్కరిస్తోంది. జాజుల సన్యాసి గారి సతీమణి చిన్నతల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 


♦నాడు యుద్ధంలో ఎందరో పాల్గొన్నారు. వారిలో కొందరు ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. యుద్ధంలో పాల్గొన్న హీరోలను స్మరించుకుంటూ, సత్కరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. త్యాగధనులు, భరతమాత ముద్దు బిడ్డలకు ఏమి ఇవ్వగలం?
♦వీర సైనికులకు మరణం లేదు. వారు ఎప్పుడూ చిరంజీవులుగా ఉంటారు. నాగాలాండ్‌ యుద్ధ స్థూపం మీద ఓ స్లోగన్‌ ఉంది. ‘మీ రేపటి కోసం, మేము ఇవాల్టి రోజు త్యాగం చేస్తున్నాం’ అని రాసి ఉంది. ఆర్మీలో చేస్తున్నవి ఉద్యోగాలు కావు, మన కోసం, మన దేశం కోసం సేవ చేస్తున్నారు. గుర్తించుకోండి.. ఆర్మీలో చేరేందుకు యువత ముందుకు రావాలి.


విజయజ్వాలను వేదికపైకి తీసుకువస్తున్న సీఎం వైఎస్‌ జగన్

విజయ జ్వాలకు వందనం 
♦ఇండో పాక్‌ యుద్ధంలో భారత విజయానికి చిహ్నంగా గత ఏడాది డిసెంబర్‌ 16న న్యూఢిల్లీలో ప్రధాని  నాలుగు విజయ జ్వాలలను వెలిగించారు. ఇవి దేశ నాలుగు దిక్కులా ప్రయాణం చేశాయి. ఇండో – పాక్‌ యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికుడిని కలిసి ‘యోధుడా సలాం’ అని పలకరిస్తూ వచ్చాయి.
♦దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయాణం చేసిన విజయ జ్వాల బుధవారం తిరుపతికి చేరింది. రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ వేణుగోపాల్‌ ఇంటి మీదుగా పోలీస్‌ పరేడ్‌ మైదానానికి చేరింది. ఈ జ్వాలకు సీఎం వైఎస్‌ జగన్‌ గౌరవ వందనం చేశారు.
♦కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.


రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌ నివాసంలో మొక్కను నాటుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సైనికుల త్యాగాలు మరువలేనివి
పరమవీర చక్ర, అశోక చక్ర పతకాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు రూ.10 లక్షలు చెల్లించేది. సైనికుల త్యాగాలు మరువ లేనివని, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. పరమ వీర చక్ర పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆ మొత్తాన్ని పది రెట్లు పెంచి రూ.1 కోటి ఇస్తుంది. మహా వీర చక్ర, కీర్తి చక్ర పురస్కారాలకు ఇది వరకు రూ.8 లక్షలు ఇచ్చేవారు. ఇకపై పది రెట్లు పెంచి రూ.80 లక్షలు ఇస్తుంది. వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షలు నజరానా అందించేది. ఇక నుంచి రూ.60 లక్షలు అందిస్తాం. సైనికులు వీర మరణం పొందితే రూ.50 లక్షలు పరిహారం అమలు చేస్తున్నాం.

నజరానా పెంపుపై జీఓ విడుదల
ఇదిలా ఉంటే.. పరమవీర చక్ర, అశోక్‌చక్ర తదితర అవార్డు గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నజరానాకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని పెంచుతామని తిరుపతిలో గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన వెంటనే సర్కారు రాత్రికల్లా జీఓ విడుదల చేసింది. ముఖ్యమంత్రి మాటలను అధికారులు వెంటనే అమల్లోకి తీసుకురావడం గమనార్హం. 


దివంగత జాజుల సన్యాసి సతీమణి చిన్నతల్లి, కుమారుడికి జ్ఞాపిక అందిస్తున్న సీఎం

యుద్ధ వీరుడికి సీఎం ఘన సన్మానం
♦1971లో భారత్‌–పాక్‌ యుద్ధంలో విశేష సేవలందించిన మహా వీరచక్ర, పరమ విశిష్ట సేవా మెడల్‌ గ్రహీత, యుద్ధ వీరుడు రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌(95)ను సీఎం  జగన్‌ సత్కరించారు. వేణుగోపాల్‌ అనారోగ్యంతో బాధపడుతుండటంతో సీఎం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వేణుగోపాల్‌ ఇంటి వద్ద సీఎం ఓ మొక్కను నాటారు. 
♦అనంతరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకొని బెటాలియన్‌ కమాండెంట్‌ దివంగత జాజుల సన్యాసి సతీమణి చిన్నతల్లి, కుమారుడు హవాల్దార్‌ గంగరాజును సత్కరించారు. 
♦కాకినాడకు చెందిన కేజే క్రిష్టఫర్‌ తరఫున లెప్టినెంట్‌ జనరల్‌ అరుణ్‌కుమార్, మేజర్‌ జనరల్‌ రాకేష్‌కుమార్‌ సింగ్‌లను సీఎం సన్మానించారు. వేణుగోపాల్‌ ఇంటి నుంచి తీసుకెళ్లిన మట్టిని విజయ జ్వాలతో పాటు నేషనల్‌ వార్‌ మ్యూజియంలో పెట్టనున్నట్లు రాకేష్‌ కుమార్‌ సింగ్‌ ప్రకటించారు. 

గౌరవంగా భావిస్తున్నా..
సీఎం సన్మానాన్ని గౌరవంగా భావిస్తున్నానని, దేశ పౌరుడిగా తన వంతు సేవ చేసినందుకు సంతృప్తికరంగా ఉందని యుద్ధ వీరుడు రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌ అన్నారు. 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొనడం ద్వారా దేశ సేవ చేసే అవకాశం వచ్చినందుకు గర్విస్తున్నానని తన సహయకుడి ద్వారా తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement